శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Feb 09, 2020 , 23:04:40

నూతన ఆవిష్కరణలకు అద్భుతం

నూతన ఆవిష్కరణలకు అద్భుతం
  • ఐఐటీ ప్రయోగాలతో హైస్పీడ్‌ స్కూటర్‌
  • డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి
  • విద్యార్థుల నైపుణ్యం ఎంతో గొప్పది
  • కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: రోజురోజుకూ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయ డం అద్భుతమని డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి ఐఐటీ విద్యార్థులను అభినందించారు. ఆదివారం కంది మండల కేంద్రం హైదరాబాద్‌ ఐఐటీలోని ఆడిటోరియంలో ఈప్లూటో 7జీ ఎలక్ట్రికల్‌ హైస్పీడ్‌ స్కూటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి నీతి అయోగ్‌ సభ్యుడు వీకే.సారస్వత్‌, ఐఐటీ డైరెక్టర్‌ బీఎస్‌. మూర్తిలతో కలిసి నూతన హైస్పీడ్‌ వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఆర్డీవో చైర్మన్‌ మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి నైపుణ్యాన్ని ప్రదర్శించడం గొప్పవిషయమని అభినందించారు. 


తాను మొదటి సారిగా ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌కు వచ్చానని ఇక్కడ వసతులు ఎంతో మెరుగ్గా ఉన్నాయని, కొత్త ఆలోచనలకు అధికారులు ప్రోత్సహించి అమలు చేయడం మరో గొప్ప విషయమన్నారు. సమయాన్ని ఆదాచేసే విధంగా విద్యుత్‌ ఆధారంతో చార్జీంగ్‌తో అతివేగంగా ప్రయాణించే స్కూటర్‌ రూపకర్తనకు ఈప్లూటో యాజమాన్యం ముందుకు వచ్చి శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో  ఆధారంగా బస్సులు నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయని గుర్తుచేశారు. దేశానికి ఉపయోగపడే విధంగా ఐఐటీ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు ముందుకు వస్తే డీఆర్డీవో ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. 


దేశ పరిజ్ఞానంతో విద్యుత్‌ వాహనాలు..

-నీతి అయోగ్‌ సభ్యుడు వీకే.సారస్వత్‌

ఐఐటీ హైదరాబాద్‌ విద్యుత్‌ వాహనాల తయారీలో విద్యార్థుల కృషి అమోఘమని నీతి అయోగ్‌ సభ్యుడు వీకే.సారస్వత్‌ కితాబు ఇచ్చారు. తాను డీఆర్డీవో చైర్మన్‌గా బాధ్యతల్లో ఉన్నప్పుడు ఐఐటీ సందర్శనకు 2014 సంవత్సరంలో వచ్చినట్లు తెలిపారు. అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని గుర్తుచేశారు. ఐఐటీ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించి విద్యుత్‌ ఆధారంగా చార్జీంగ్‌తో నడిచే వాహనాలు తయారు చేయడం గొప్పవిషయమన్నారు. ఇప్పటి వరకు  చైనాలో అత్యధికంగా బ్యాటరీ వాహనాలు రవాణా చేస్తున్నాయని, దేశీయ పరిజ్ఞానంతో ఐఐటీ విద్యార్థుల ప్రతిభతో ఈప్లూటో యాజమాన్యం ముందుకువచ్చి కొత్త వాహనాలకు శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలోని అభివృద్ధి చెందిన పట్టణాలలో చార్జీంగ్‌తో నడిచే వాహనాల రవాణా పెరుగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


200 యూనిట్ల ఏర్పాటు లక్ష్యం..

- ఈప్లూటో సీఈవో రోహిత్‌ వధేరా

విద్యుత్‌ చార్జీంగ్‌తో అతి వేగంగా ప్రయాణించే ఈప్లూటో స్కూటర్లను తయారు చేయడానికి దేశంలో 50యూనిట్లు ఉన్నాయని, భవిష్కత్‌లో రెండు వందల యూనిట్లను నెలకొల్పే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఈప్లూటో సీఈవో రోహిత్‌ వధేరా అన్నారు. తమ సంస్థతో ఐఐటీ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు ముందుకు రావడం అదృష్టంగా భావించి విద్యుత్‌ చార్జీంగ్‌తో నడిచే వాహనాలను మార్కెట్‌లో విడుదల చేశామన్నారు. ఈ వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో సులభంగా ప్రయాణించవచ్చన్నారు. మధ్య తరగతికి  ధర రూ.79,999 నిర్ణయించి అందుబాటులోకి తెచ్చామన్నారు. స్కూటర్‌ 40 వేల కిలో మీటర్లు తిరిగేంత వరకు సంస్థ వారంటీ ఉంటుందని, ఒక్కసారి బ్యాటరీ చార్జీంగ్‌తో 116 కిలో మీటర్ల ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు. భవిష్కత్‌లో కొత్త కొత్త ఆవిష్కరణలకు ఐఐటీ విద్యార్థులు ముందుకు వస్తే తమ వంతు సహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఈప్లూటో సంస్థ ప్రతినిధి నిషాంత్‌, విద్యాసాగర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


logo