శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Feb 08, 2020 , 22:58:41

1165 జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లలో దాఖలైన నామినేషన్ల సంఖ్య

1165 జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లలో దాఖలైన నామినేషన్ల సంఖ్య

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. 6 నుంచి నామినేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకున్నారు. మొత్తం 1070 నామినేషన్లు వచ్చాయి. మూడు రోజుల్లో మొత్తం 53 పీఏసీఎస్‌లకు గాను 1665 నామినేషన్లు వచ్చాయి. 53 సంఘాల్లో 689 వార్డులున్నాయి. ఎస్టీలు లేని కారణంగా 9 వార్డులకు ఎన్నికలు జరుగడం లేదు. 680 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా, ఒక్కో పీఏసీఎస్‌లో 13 వార్డులు ఉండగా కల్హేర్‌, బొక్కాస్‌గావ్‌ (ఒక వార్డుకు రెండు నామినేషన్లు), మార్డి, కడ్పల్‌ పీఏసీఎస్‌లలోని అన్ని వార్డులకు ఒక్కో నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ నాలుగు సంఘాలు ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం జిల్లాలోని ఐదు సబ్‌డివిజన్లలో కలిపి 144 వార్డులకు ఒక్కటి మాత్రమే నామినేషన్లు వచ్చాయి. దీంతో అన్ని ఏకగ్రీవం కానున్నాయి. కాగా, నామినేషన్ల పక్రియ ముగియడంతో ఆదివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. 10న ఉప సంహకరణ ప్రక్రియ ముగిసిన తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి, గుర్తులు కేటాయించనున్నారు. 


నాలుగు సొసైటీలు ఏకగ్రీవం...

జిల్లాలో నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో మూడు కల్హేర్‌ మండలంలోని కాగా, సిర్గాపూర్‌ మండలంలో మరొకటి ఉన్నాయి. మండల కేంద్రమైన కల్హేర్‌తో పాటు బొక్కాస్‌గావ్‌, మార్డి, సిర్గాపూర్‌ మండలంలోని కడ్పల్‌ సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. బొక్కాస్‌గావ్‌లో 13 వార్డుల్లో ఒక్క వార్డుకు మాత్రం రెండు నామినేషన్లు రాగా, మిగతా వాటికి ఒక్కో నామినేషన్‌ మాత్రమే వచ్చింది. మిగతా సొసైటీలోని 13 వార్డులకు 13 చొప్పున మాత్రమే నామినేషన్లు వచ్చాయి. దీంతో ఈ నాలుగు ఏకగ్రీవం కానున్నాయి. ఈ నెల 10న నామినేషన్ల ఉప సంహకరణ ప్రక్రియ ముగిసిన తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే నాలుగు పీఏసీఎస్‌లు నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని కావడం గమనార్హం. 


144 వార్డులు ఏకగ్రీవం..

జిల్లాలో మొత్తం 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 144 వరకు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సంగారెడ్డి సబ్‌డివిజన్‌లో 25, జహీరాబాద్‌లో 9, పటాన్‌చెరు డివిజన్‌లో 31, నారాయణఖేడ్‌లో 63, అందోలు సబ్‌ డివిజన్‌లో 16 వార్డులు ఒక్క నామినేషన్‌ వచ్చిన వార్డుల జాబితాలో ఉన్నాయి. కల్హేర్‌, కడ్పల్‌, మార్డి పీఏసీఎస్‌ల్లో 13 చొప్పున 39 వార్డులకు 39 నామినేషన్లు, బొక్కాస్‌గావ్‌లో 13 వార్డులుంటే 14 నామినేషన్లు వచ్చాయి. 


చివరి రోజు జోరుగా నామినేషన్లు..

నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శనివారం పెద్దసంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్‌ సబ్‌డివిజన్లు ఉన్న విషయం తెలిసిందే. అన్నింటి పరిధిలో కలిసి 53 సహకార సంఘాలున్నాయి. 680 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, మొదటి రోజు అంటే 6న అంతంత మాత్రంగానే నామినేషన్లు రాగా, చివరి రోజు పెద్దసంఖ్యలో దాఖలు చేశారు. మొదటి రోజు 91, రెండో రోజు 504, మూడో రోజు శనివారం అత్యధికంగా 1070 నామినేషన్లు వచ్చాయి. మొత్తం మూడు రోజుల్లో 1665 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా జహీరాబాద్‌ సబ్‌డివిజన్‌లో 14 పీఏసీఎస్‌లకు 526 నామినేషన్లు వచ్చాయి. సంగారెడ్డిలో 356, నారాయణఖేడ్‌లో 308, అందోలు-జోగిపేటలో 275, పటాన్‌చెరు సబ్‌డివిజన్‌లో 200 నామినేషన్లు వచ్చాయి.


logo