మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Feb 08, 2020 , T00:30

595 నామినేషన్లు

595 నామినేషన్లు

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. మొదటి రోజు అంతంత మాత్రంగానే నామినేషన్లు రాగా, రెండోరోజు శుక్రవారం నామినేషన్ల సంఖ్య అమాంతం పెరిగింది. జిల్లాలో మొత్తం 53 సంఘాల్లో 689 వార్డులు (ప్రాదేశిక నియోజకవర్గం) ఉన్నాయి. ఎస్టీలు లేని కారణంగా 9 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం 680 వార్డులకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, శుక్రవారం 504 నామినేషన్లు వచ్చాయి. మొదటిరోజు జిల్లాలో 91 నామినేషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా, శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు గడువు ఉన్నది. ఈ క్రమంలో చివరిరోజు కూడా పెద్దఎత్తున నామినేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు.

సంగారెడ్డిలో అత్యధిక నామినేషన్లు..

జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్ సబ్‌డివిజన్లు ఉన్నాయి. అన్నింటి పరిధిలో కలిసి 53 సహకార సంఘాలున్నాయి. గురువారం నుంచి ఆయా పీఏసీఎస్‌ల వద్ద నామినేషన్ల స్వీకరణ మొదలైన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో సంగారెడ్డి సబ్ డివిజన్‌లో 11 సంఘాలకు అత్యధికంగా 182 నామినేషన్లు వచ్చాయి. జహీరాబాద్ డివిజన్‌లో 14 సంఘాలకు మొత్తం 176 నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజుల్లో ఈ రెండు సబ్‌డివిజన్లలోనే ఎక్కువ నామినేషన్లు రావడం గమనార్హం. నారాయణఖేడ్‌లో 12 పీఏసీఎస్‌లు ఉన్నప్పటికీ రెండు రోజుల్లో కలిపి అతి తక్కువగా కేవలం 39 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. చివరిరోజు శనివారం ఖేడ్‌లో నామినేషన్ల సంఖ్య భారీగా పెరుగనున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాగా, శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా పీఏసీఎస్‌ల వద్ద నామినేషన్లు స్వీకరించనున్నారు. గడువు ముగియనున్న నేపథ్యంలో ఆశావహులంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. logo