ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Feb 08, 2020 , T00:20

రైల్ ట్రయల్ రన్

రైల్ ట్రయల్ రన్

గజ్వేల్, నమస్తే తెలంగాణ/గజ్వేల్ అర్బన్: మనోహరాబాద్- గజ్వేల్ రైలు మార్గంలో రైల్వే అధికారులు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్ నుంచి నాచారం వరకు రైలు ఇంజన్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. నేడు నాచారం నుండి గజ్వేల్ వరకు ట్రయల్ రన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కల అయిన మనోహరాబాద్ -కొత్తపల్లి రైలు మార్గం సాకారమవుతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మనోహరాబాద్-కొత్తపల్లి రైలుమార్గాన్ని మంజూరు చేయించారు. దీనిలో భాగంగా మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైలుమార్గం నిర్మాణం పూర్తయింది. శుక్రవారం మనోహరాబాద్ నుంచి నాచారం వరకు రైలింజనుతో ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు. రైలు మార్గం నిర్మాణానికి సీఎం ప్రత్యేక చొరవతో అధికారులు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, గడా ఓఎస్డీ, ఆర్డీవో విజయేందర్‌రెడ్డిలతో పాటు తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది గ్రామగ్రామానికి వెళ్లి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భూ యజమానులు కూడా రైలు మార్గ నిర్మాణంలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చి పూర్తి సహకారాన్ని ఇవ్వడంతో రైల్వే అధికారులు కూడా సీఎం ఆదేశాలతో పనులను పరుగులు పెట్టించారు. 

ఫిబ్రవరి చివరికల్లా..

మనోహరాబాద్ -గజ్వేల్ మధ్య రైలు ప్రయాణం ఫిబ్రవరి చివరివారంలోగా గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరో రెండు రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి కానుండడంతో ఈనెల చివరి వారంలోగా రైలును ప్రారంభించనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి  అధికారులు వేగంగా పనులు చేపడుతున్నారు.logo