మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Feb 08, 2020 , T00:15

కరోనాకు ఇవిగో మందులు

కరోనాకు ఇవిగో మందులు

కంది, నమస్తేతెలంగాణ : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కరోనా వైరస్ హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. కరోనా వైరస్‌కు మందులు మా వద్ద ఉన్నాయంటూ సైబర్ నెరగాళ్లు పలు లింక్‌లను మొబైల్ వినియోగదారులకు నేరుగా పంపిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే అవకాశముందని జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు పలు సూచనలు అందజేస్తుంది. ప్రధానంగా కరోనా వైరస్ సోకుండా ఇవిగో మందులు అంటూ ప్రముఖ మందుల కంపెనీ నుంచి ప్రజలకు అబద్దపు మెయిల్స్, మెసేజ్‌లు వచ్చే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చిన మెయిల్‌లో ఏదైనా ఫైల్ అటాచ్‌మెంట్ కానీ, మెసేజ్‌లో నీలిరంగు లింకు గానీ ఉంటే వాటిని అస్సలు ఓపెన్ చేయొద్దని, ఒకవేళ తెలియకుండా ఆ లింక్‌లు ఓపెన్ చేస్తే మీ ఖాతాలోని డబ్బులు మాయమయ్యే ప్రమాదముందన్నారు. ఈ విషయమై ప్రజలు ఒకింత అవగాహన కలిగి ఉండాలని, సరైన సమాచారం లేనిదే ఎలాంటి లింక్‌లు ఓపెన్ చేయడం సరికాదని పోలీసులు సూచిస్తున్నారు.

సైబర్ మోసాలకు గురికావద్దు

ప్రజలు సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్‌కు వచ్చే అనవసరపు మెయిల్స్, మెసేజ్‌లకు స్పందించకుండా ఉండాలి. వీటితో పాటు కొంతమంది సైబర్ నేరగాళ్లు మీకు లక్కీ లాటరీ తగిలిందని, మీ మొబైల్ నెంబర్‌కు డ్రాలో డబ్బులు వచ్చాయంటూ మెసేజ్‌లు, మెయిల్స్ పంపిస్తుంటారు. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలి. సరైన అవగాహన లేనిదే ఎలాంటి మెసేజ్‌లకు స్పందచకూడదు. అలాగే మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. మీకు వచ్చిన ఓటీపీ నెంబర్‌ను చెప్పాలంటూ కూడా మోసాలు చేస్తారని, ఎవరికీ తమ వ్యక్తిగత వివరాలు చెప్పొద్దన్నారు. 

- శివకుమార్, సంగారెడ్డి రూరల్ సీఐ


logo