సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Feb 07, 2020 , T01:10

పదిలో వందశాతం ఉత్తీర్ణతను సాధించాలి

పదిలో వందశాతం ఉత్తీర్ణతను సాధించాలి

అందోల్, నమస్తే తెలంగాణ: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించాలని, విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని జిల్లా విద్యాధికారి రాజేశ్  సూచించారు. గురువారం అందోల్ కేజీబీవీ, జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల,  డాకూర్ ప్రభుత్వ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో రికార్డులను పరిశీలించి విద్యార్థుల సంఖ్య వివరాలు, పదో తరగతి విద్యార్థుల వివరాలు,  ప్రత్యేక తరగతుల వివరాలను ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందోల్‌లోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులతో సమావేశమై వారితో మాట్లాడారు. ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయా.. సబ్జెక్టులలో ఏమైనా సందేహాలుంటే ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారా.. భోజనం సమయానికి అందిస్తున్నారా అంటూ విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేశారు. అన్ని బాగున్నాయి సార్ అంటూ వారు సమాధానమిచ్చారు. చదువుకున్న సబ్జెక్టు గుర్తుండాలంటే ఏం చేయాలి సార్ అని విద్యార్థిని డీఈవోను అడుగగా, చదువుకున్న అంశాన్ని ఒకసారి చూసుకుంటూ, మరోసారి చూడకుండా రాయాలని, ఈ రెండింటి తేడాను గమనిస్తే మీకే అర్థమవుతుందని తెలిపారు. చదువుకున్న సబ్జెక్టును తప్పనిసరిగా రాయడం చేస్తే మరోసారి ఆ సబ్జెక్టును చదివుకునే అవసరం ఉండదని, బాగా గుర్తుంటుందని సూచించారు. పాఠశాల సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ ఇంటర్ కళాశాల నిర్మా ణ పనులను పరిశీలించారు. పాఠశాలకు ప్రహారీ నిర్మాణం జరిగేలా చూడాలని పాఠశాల ప్రత్యేకాధికారి మీరాకుమారి ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలను తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు వేయగా, వారు సరైన సమాధానం ఇస్తుండడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయని, సందేహాలను ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకుంటున్నామని వారు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్టులను పూర్తి చేశారా అని ఉపాధ్యాయులను అడుగగా, పూర్తి చేశామని, మరోసారి సమీక్ష చేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. వసతి గృహం విద్యార్థులకు హాస్టల్‌లో ట్యూటర్‌లు ప్రత్యేక తరగతులను తీసుకుంటున్నారా అని పాఠశాలలో చదువుకుంటున్న హాస్టల్ విద్యార్థులను అడుగగా, ఉదయం, సాయంత్రం వేళల్లో చెబుతున్నారని హాస్టల్ విద్యార్థులు తెలిపారు. డాకూర్ ప్రభుత్వ పాఠశాలలోనూ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వంద శాతం ఉత్తీర్ణతను సాధించాలని, ఇష్టపడి చదువాలని వారికి సూచించారు. డీఈవో వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. 


logo