గురువారం 04 జూన్ 2020
Sangareddy - Feb 06, 2020 , 00:27:31

సహకార పోరుకు.. సమాయత్తం

సహకార పోరుకు.. సమాయత్తం
  • నేటి నుంచి సహకార ఎన్నికలకు నామినేషన్లు
  • 8వ తేదీ వరకు స్వీకరణకు గడువు
  • 9వ తేదీన పరిశీలన, 10న ఉపసంహరణ
  • పల్లెల్లో ఎన్నికల సందడి
  • గెలుపుగుర్రాల ఎంపికలో పార్టీల నేతలు
  • అన్ని సొసైటీలపై టీఆర్‌ఎస్‌ గురి

సంగారెడ్డి టౌన్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది. 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనుండగా, 9న పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ గడువు విధించారు. అనంతరం జాబితా అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. జిల్లాలోని 53 సహకార సొసైటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని సంఘాల పరిధిలో 53,535 మంది ఓటర్లు ఉండగా, ఒక్కో సొసైటీని 13 వార్డులుగా విభజించారు. ఈ మేరకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించింది. కాగా, ఎన్నికల్లో గెలుపు గుర్రాలను నిలిపేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని సహకార సంఘాలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ దృష్టిసారించింది. ఇందుకోసం పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలపర్చే అభ్యర్థులను గెలిపించుకునేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు.


సహకార ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్నది. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ దిశగా జిల్లా సహకార శాఖ అధికారులు జిల్లాలోని 53 సహకార సొసైటీలకు ఎన్నికల నిర్వహణ అధికారులను కేటాయించారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీ లు కసరత్తులు ప్రారంభించాయి.    జిల్లాలోని 53 సొసైటీలను కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తున్నది. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా సమీకరణలు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి నామినేషన్లను 8వ తేదీ వరకు స్వీకరించి 9వ తేదీన పరిశీలన చేస్తారు. ఈ నెల 10వ తేదీన ఉపసంహరణ గడువు విధించారు. అనంతరం ఫైనల్‌ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 53సొసైటీల పరిధిలో 53,535 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి సొసైటీని 13 వార్డులుగా విభజించారు. సొసైటీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం-2 ప్రకారం నామినేషన్‌ వేయాలి. ఒక అభ్యర్థి రెండు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయవచ్చు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు 53 సొసైటీలకు గాను 53 మంది ఎన్నికల నిర్వహణ అధికారులను నియమించారు.  ఎస్సీ, ఎస్టీలకు రూ.500, బీసీ రూ.750, జనరల్‌ రూ.1000 నామినేషన్‌ ఫీజు తీసుకోనున్నారు. 


 అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు..

ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం-2 ప్రకారం నామినేషన్‌ వేయాలి. ఒక అభ్యర్థి రెండు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయవచ్చు. అయితే సంఘంలో అదే నియోజకవర్గ వార్డు ఓటర్ల జాబితాలో ఎవరి పేరు ఉందో ఆ వ్యక్తి అభ్యర్థిగా నామినేషన్‌ వేయవచ్చు. కాగా, అదే వార్డులో ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తి ప్రతిపాదకుడు, బలపరిచే వ్యక్తి ఉండాలి. పోటీచేసే అభ్యర్థి ఒకటి మించి మరో వార్డులో పోటీ చేయరాదు. ప్రతి నామినేషన్‌ పత్రం ఓటర్ల జాబితాలో అర్హులైన సభ్యులుగా ఉన్న ప్రతి పాదకుడిగా, బలపర్చే వ్యక్తిగా సంతకం చేయాల్సి ఉం టుంది. ఒక సభ్యుడు ఒక అభ్యర్థిని మాత్రమే ప్రతిపాదించడం, బలపర్చడం చేయాలి. ప్రతి అభ్యర్థి స్వయంగా తన ప్రతిపాదకుడు, బలపర్చిన వ్యక్తి ద్వారా ఎన్నికల నోటీసులో చెప్పినట్లు తిరిగి ఇవ్వలేని రుసుముతో పాటు నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించాలి. వెనుకబడిన కులములు, వెనుకబడిన తెగల కింద చెప్పుకునే సభ్యులు సంబంధిత అధికారి జారీ చేయబడిన కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందుపర్చాలి. ఎన్నికల అధికారి నామినేషన్‌ పత్రమును స్వీకరించి ఫారం-2 జత చేసినట్లు తెలియపరిచే పత్రమును విడదీసి ఇవ్వాలి. 


అతడు నామినేషన్‌ పత్రంపై నామినేషన్‌ పత్రం స్వీకరించిన క్రమ సంఖ్య, తేదీ, సమయం రాసి వెంటనే నామినేషన్‌ ముట్టినట్లు రాత పూర్వకమైన రసీదును అధికారి ఇవ్వాలి. నామినేషన్‌ వేసే అభ్యర్థి సహకార సంఘానికి, ఆ సంఘమునకు ఆర్థిక సహాయం చేయు బ్యాం కుకు ఎటువంటి బకాయిలు ఉండరాదు. నామినేషన్‌ పత్రంతో పాటు ఒక పాస్‌ ఫొటో, ఎటువంటి బకాయిలు లేనట్టు నో డ్యూ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు ప్రతి సమర్పించాలి. నామినేషన్‌లోని అన్ని కాలమ్స్‌ నింపాలి. అదే విధంగా పోటీ చేయు అభ్యర్థులకు 1995 తర్వాత ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. పోటీ చేయు, ప్రతిపాదించు, బలపర్చు వ్యక్తుల సభ్యత్వాల నెంబర్‌ జాగ్రత్తగా ఓటరు లిస్టులో చూసుకుని నామినేషన్‌ పత్రంలో నింపాలి. సంతకాలు చేయడం మర్చిపోరాదు. 


logo