శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Feb 06, 2020 , 00:25:30

లాభాల పట్టు పరిశ్రమకు కృషి చేయాలి

లాభాల పట్టు పరిశ్రమకు కృషి చేయాలి

సంగారెడ్డి చౌరస్తా: ఎక్కువ లాభాలను ఆర్జించే విధంగా పట్టు పరిశ్రమను నిర్వహించాలని కలెక్టర్‌ హనుమంతరావు పేర్కొన్నారు. జిల్లాలోని పట్టు రైతులకు నిర్వహించిన రెండో రోజు శిక్షణలో భాగంగా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టు పరిశ్రమ రైతులకు అవసరమమైన మార్కెట్‌ ఉన్నదని గుర్తుచేశారు. కూలీల అవసరం కూడా లేకుండానే కుటుంబ సభ్యులు సాగు చేసుకునే వీలున్నందున ఎక్కువ మంది రైతులు ముందుకు రావాలన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం షెడ్‌ నిర్మాణం కోసం రూ. 2.60 లక్షలను అందిస్తున్నదని గుర్తు చేశారు. మిగతా రైతులకు రూ.35 వేల సెంట్రల్‌ సబ్సిడీ అందిస్తుందన్నారు. అదేవిధంగా రూ.5 వేల విలువైన రోగ నిరోధకాలను 50శాతం సబ్సిడీపై అందించడంతో పాటు రూ.35 వేల విలువ చేసే పరికరాలను అందించనున్నట్లు తెలిపారు. ఈజీఎస్‌లో రావాల్సిన బకాయిలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి త్వరితగతిన విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, రెండు రోజులుగా పట్టు పరిశ్రమకు సంబంధించి చిన్న, సన్నకారు రైతులకు నాణ్యమైన మల్బరీ వంగడాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి సునీత, పట్టు పరిశ్రమ అధికారి రమాదేవి, ఉద్యానవన అధికారులు, పట్టు రైతులు పాల్గొన్నారు.logo