శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Feb 06, 2020 , 00:23:14

సమయం దగ్గర పడుతుంది

సమయం దగ్గర పడుతుంది

సంగారెడ్డి చౌరస్తా : పదో తరగతి వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున పక్కా ప్రణాళికతో చదువుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్‌ పేర్కొన్నారు. అక్షరదాన్‌ మొదటి వార్షికోత్సవ వేడుకలను బుధవారం పట్టణంలోని వైఎంఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు. విద్యాశాఖ, ఎంఎన్‌ఆర్‌ యాజమాన్యం సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1000 మంది పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందించారు. ఈ సందర్భంగా డీఈవో రాజేశ్‌ మాట్లాడుతూ సమయం చాలా విలువైనదని గుర్తు చేశారు. సమయం వృథా చేయకుండా పది పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రతి సబ్జెక్టుకు మూడు రోజుల చొప్పున కేటాయించుకొని చదువుకోవాలన్నారు. అపుడే జిల్లాలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. అంతకుముందు ప్రముఖ సైకాలజిస్టు గంప నాగేశ్వర్‌రావు పదో తరగతి విద్యార్థులకు చదువుకునే సమయంలో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. 


ముఖ్యంగా జ్ఞాపక శక్తి ఎలా వస్తుంది, ఎలా సద్వినియోగం చేసుకోవాలనే పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఎంఎస్‌ఆర్‌ మూర్తి మాట్లాడుతూ అక్షరదాన్‌ ఏవిధంగా సహాయపడుతుందనే విషయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఎన్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.రవి వర్మ, విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo