మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Feb 05, 2020 , 00:46:32

జోరుగా.. యాసంగి

జోరుగా.. యాసంగి

సంగారెడ్డి టౌన్‌:

యాసంగి సాగుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ సీజన్‌లో జిల్లాలో 40,494  హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేయనున్నట్లు అధికారులు అంచనా వేయగా, వాస్తవంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల 22,122 హెక్టార్లలో సాగవుతుందని అధికారులు తెలిపారు. యాసంగి సాగుకు విత్తనాలను సిద్ధం చేశారు. జిల్లాలో ఎన్ని విత్తనాలు అవసరమవుతాయో ప్రణాళికలు తయారు చేసిన అధికారులు కావాల్సిన విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వం యాసంగి పంటలకు సబ్సిడీని ప్రకటించింది. కొన్ని విత్తనాలకు 50శాతం, మరి కొన్నింటికి 33శాతం, ఇంకొన్ని విత్తనాలకు కేజీ చొప్పున సబ్సిడీని ప్రకటించారు. జిల్లాలో యాసంగిలో పంటలు వేసేందుకు విత్తనాలను అందుబాటులో ఉం చారు. జిల్లాలో మొత్తం 17,576 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. జిల్లాకు కావాల్సిన విత్తనాలను మండలాల వారీగా నిల్వ ఉంచినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.


అందుబాటులో ఎరువులు..

యాసంగి సాగుకోసం వ్యవసాయశాఖ అధికారులు ఎరువులను అందుబాటులో ఉంచారు. జిల్లాకు మొత్తం అన్ని రకాల ఎరువులు 8948 క్వింటాళ్లు అవసరం కాగా, అందులో యూరియా 4020 క్వింటాళ్లు, డీఏపీ 1029 క్వింటాళ్లు, ఎంవోపీ 1415 క్వింటాళ్లు, కాంప్లెక్స్‌ ఎరువులు 1893 హెక్టార్లు ఎస్‌ఎస్‌పీ 591 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. కావాల్సిన దానికంటే ఎక్కువగానే నిల్వలు ఉంచినట్లు అధికారులు తెలిపారు. యూరియా ప్రైవేట్‌ డీలర్ల వద్ద 680 క్వింటాళ్లు, సొసైటీల వద్ద 155 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్‌ వద్ద 5137 మొత్తం 5972 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా డీఏపీ ప్రైవేట్‌ డీలర్ల వద్ద 200 క్వింటాళ్లు, సొసైటీల వద్ద 27 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్‌ వద్ద 227క్వింటాళ్లు మొత్తం 454 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఏంవోపీ ఎరువులు ప్రైవేట్‌ డీలర్ల వద్ద 152 క్వింటాళ్లు నిల్వ ఉంచారు. కాంప్లెక్స్‌ ఎరువులు ప్రైవేట్‌ డీలర్ల వద్ద 140 క్వింటాళ్లు నిల్వ ఉంచారు. అదేవిధంగా ఎస్‌ఎస్‌పీ ఎరువులు ప్రైవేట్‌ డీలర్ల వద్ద 712 క్వింటాళ్లు, సొసైటీల వద్ద 72 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్‌ వద్ద 377 క్వింటాళ్లు మొత్తం 1161 క్వింటాళ్లు నిల్వ ఉంచినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ నెలలో ఎంత ఎరువులు అవసరం అవుతాయోనని అంచనా వేసి వాటిని కూడా నిల్వ ఉంచుతున్నట్లు తెలిపారు. 


logo