గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Feb 03, 2020 , 23:31:28

రెవెన్యూ డివిజన్‌గా జోగిపేట

రెవెన్యూ డివిజన్‌గా జోగిపేట
  • ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ప్రభుత్వం
  • అభ్యంతరాలు స్వీకరణకు నెలరోజుల గడువు
  • నెరవేరిన జోగిపేట వాసుల చిరకాల స్వప్నం
  • కొత్త మండలంగా చౌటకూర్‌
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌
  • నాలుగు మండలాలతో రెవెన్యూ డివిజన్‌

అందోల్‌, నమస్తే తెలంగాణ: జోగిపేట ప్రజల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కావాలన్న చిరకాల స్వప్నం నెరవేరింది. జోగిపేట రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై నెలరోజుల గడువులోగా ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను సేకరించాలని, పత్రిక ప్రకటనను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కలెక్టర్‌ హనుమంతరావుకు ఆదేశాలను జారీ చేశారు. జోగిపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. జోగిపేట పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2018 నవంబర్‌ 28వ తేదీన సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని హామీనిచ్చిన విషయం తెలిసిందే.


ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సైతం ఎప్పటికప్పుడు సంబంధితశాఖ అధికారులను కలుస్తూ, రెవెన్యూ డివిజన్‌ ప్రక్రియ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది ఫిబ్రవరి మాసంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషిని కలిసి వినతిపత్రం అందజేసి, డివిజన్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ డివిజన్‌ ప్రక్రియ ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా అధికారులు చాలా జాగ్రత్త పడినట్లు తెలుస్తున్నది. డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు నివేదించడంతో సోమవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  


కొత్త మండలంగా చౌటకూర్‌.. 

అందోలు నియెజకవర్గ పరిధిలోని పుల్కల్‌ మండల పరిధిలోని చౌటకూర్‌ను 14 గ్రామాలతో కలుపుకొని కొత్త మం డలంగా ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పుల్కల్‌ మండంలోని పోసానిపల్లి, చౌటకూర్‌, శేరిరాంరెడ్డిగూడ, సుల్తాన్‌పూర్‌, సరాఫ్‌పల్లి, కొర్పోల్‌, లింగంపల్లి, అంగడిపేట్‌, తాడ్‌దాన్‌పల్లి, గంగోజీపేట, చక్రియాల్‌, శివ్వంపేట, వెండికోల్‌, హున్నాపూర్‌ గ్రామాలను వేరు చేసి, కొత్త మండలం చౌటకూర్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. జాతీయ రహదారిపై  ఉన్న చౌటకూర్‌ మండల కేంద్రంగా మారడంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో చౌటకూర్‌ గ్రామస్తులు, ఆయా గ్రామాల ప్రజలు  సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


నాలుగు మండలాలతో జోగిపేట రెవెన్యూ డివిజన్‌..

అందోలు నియోజకవర్గ కేంద్రం జోగిపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుకు ప్రభుత్వం లైన్‌ క్లియర్‌ చేసింది. నియోజకవర్గ పరిధిలోని అందోలు, వట్‌పల్లి, పుల్కల్‌, కొత్త మండలం వట్‌పల్లి మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల అనంతరం నెలరోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు సేకరించనున్నారు. 


రెండు జిల్లాలు.. నాలుగు డివిజన్ల పరిధిలోకి అందోలు నియోజకవర్గం..

జిల్లాల పునర్విభజన ప్రక్రియలో అందోలు నియోజకవర్గంలోని మండలాలు రెండు జిల్లాలో పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గంలోని అందోలు, పుల్కల్‌, వట్‌పల్లి, రాయికోడ్‌, మునిపలి, చౌటకూర్‌ (కొత్త మండలం) మండలాలు సంగారెడ్డి జిల్లాలో, అల్లాదుర్గం, రేగోడ్‌, టేక్మాల్‌ మండలాలు మెదక్‌ జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఆయా మండలాలు నాలుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి చేర్చారు. ఇందులో సంగారెడ్డి డివిజన్‌లో మునిపల్లి మండలం, జహీరాబాద్‌ డివిజన్‌లోకి రాయికోడ్‌ మండలం, మెదక్‌ డివిజన్‌లో అల్లాదుర్గం, టేక్మాల్‌, రేగోడు మండలాలు ఉండగా, కొత్తగా ఏర్పాటైన జోగిపేట రెవెన్యూ డివిజన్‌లోకి అందోలు, పుల్కల్‌, చౌటకూర్‌ (కొత్త మండలం), వట్‌పల్లి మండలాలను చేర్చారు. 


మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌..

అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని సీఎం కేసీఆర్‌ హామీనిచ్చి, మాటను నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018 నవంబర్‌ 28న జోగిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ రెవెన్యూ డివిజన్‌గా జోగిపేటను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచార హామీలో ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకుని, జోగిపేట ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ఘనత ఆయనకే దక్కుతున్నది. 


టీఆర్‌ఎస్‌ సంబురాలు  

నియోజకవర్గ కేంద్రం జోగిపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా సోమవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో జోగిపేటలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలను జరుపుకున్నారు. సోమవారం సాయంత్రం జోగిపేట పట్టణంలోని జోగినాథ్‌ చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. జై టీఆర్‌ఎస్‌.. జై కేసీఆర్‌.. జై క్రాంతన్న అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారన్నారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు జోగిపేట ప్రాంత ప్రజల చిరకాల కలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చారని, ఇచ్చిన మాటాను నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ను మించిన వారు మరొకరు లేరన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఖాదిరాబాద్‌ రమేశ్‌, రిటైర్డు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులుగు కిష్టయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ డీబీ.నాగభూషణం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌, కౌన్సిలర్లు చందర్‌, దుర్గేశ్‌, ఆత్మగౌరవ కమిటీ నియోజకవర్గ కన్వీనర్‌ డి.వీరభద్రరావు, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ మల్లికార్జున్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, నాయకులు అనిల్‌ రాజ్‌, దుర్వాసులు, మహేశ్‌ యాదవ్‌, శంకర్‌ యాదవ్‌, పెండ్యాల రాములు, గాజుల అనిల్‌,  నాగరాజ్‌, రవీంద్రాగౌడ్‌, శివకుమార్‌, తుపాకుల సునిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.


రైతాంగానికి ఎంతో మేలు 

 జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. డివిజన్‌ ఏర్పాటుతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతున్నది. భూ సమస్యలు, పట్టాదారు పాసు పుస్తకాలు ఇలా ఎలాంటి సమస్యలైనా ఇక్కడే పరిష్కరించుకోవచ్చు. డివిజన్‌ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌కు కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్‌కు జోగిపేట పట్టణ ప్రాంత ప్రజలందరం ఎల్లవేళలా రుణపడి ఉంటాం. 

-పి.నారాయణ, మాజీ జడ్పీటీసీ, అందోలు  


జోగిపేట చరిత్రలో మైలురాయి 

 రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం జోగిపేట చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతున్నది.  అన్ని వర్గాల ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. డివిజన్‌ స్థాయి అధికారులు అందు బాటులో ఉండడం వల్ల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా భారం తగ్గుతున్నది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌, కృషిచేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు పీఆర్టీయూ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు. 

-ఎ.మాణయ్య, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి 

 

వాగ్దానాన్ని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌ 

జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జోగిపేటలో నిర్వహించిన ప్రజాశీర్వాద వేదికపై రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాన్ని ఇచ్చాను. తన వినతికి స్పందించి జోగిపేట రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం నా జీవితంలో మరిచిపోలేని రోజు. మాట నిలుబెట్టుకోవ డంలో సీఎం కేసీఆర్‌ను మించినవారేవ్వరూ లేరని మరోసారి రుజువు చేశారు. డివిజన్‌ ఏర్పాటులో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ కృషి అభినందనీయం. 

-డి.వీరభద్రరావు, అందోలు ఆత్మగౌరవ కమిటీ అధ్యక్షుడు 

 

జోగిపేట ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది

జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల  చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు. పూర్వకాలంలో అందోలు తాలూకాలో రెవెన్యూ డివిజన్‌గా జోగిపేట ఉండేది. కాలక్రమేణా రెవెన్యూ డివిజన్‌ నుంచి తొలిగించారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రాంత ప్రజలు జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సహకారంతో సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతున్నది. 

- లింగాగౌడ్‌, తాలెల్మ సర్పంచ్‌