బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Feb 03, 2020 , 23:29:02

ప్రభుత్వ, దేవాలయ భూములను రక్షించండి

ప్రభుత్వ, దేవాలయ భూములను రక్షించండి

సంగారెడ్డి చౌరస్తా: దేవాలయ, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్‌ బెటర్‌ సంగారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కరం కోసం అర్జీదారులు కలెక్టరేట్‌కు పోటెత్తారు. ఫోరం నాయకులు శ్రీధర్‌ మహేంద్ర, మహేశ్‌ కుమార్‌, శ్రీకాంత్‌ తదితరులు వినతిపత్రం అందజేస్తూ సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో సర్వే నెంబర్‌ 292లో గల 34 గుంటల వేంకటేశ్వర ఆలయ భూమిలో ఇతరులు భూమిని చదును చేసి ఆక్రమిస్తున్నారని తెలిపారు. కల్వకుంట శాంతినగర్‌లోని సర్వే నెంబర్‌ 349లో ఎకరా 28 గుంటల భూమి సర్కార్‌ పరంబోకు పేరున ఉండగా, ఆ భూమిలో బీరప్ప దేవాలయం కూడా ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు రికార్డులో పేరు మార్చి బీరప్ప ఆలయ భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని వివరించారు. వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.


గ్రీవెన్స్‌లో అందిన ఫిర్యాదులు.. 

పటాన్‌చెరువు మండలం చిన్న కంజర్లకు చెందిన బేగరి రామస్వామి తన అర్జీని అందజేస్తూ తన పిత్రార్జితం ఇనామ్‌ పట్టాభూములు సర్వే నెంబర్‌, విస్తీర్ణంతో సహా నా స్వాధీనంలో ఉండి అనుభవిస్తున్నామని, ఆ భూములను తన పేరున పట్టా మార్చి కొత్త పాసుపుస్తకాలు ఇప్పించాలని కోరారు.


సదాశివపేట లోపలికోటాకు చెందిన లోపలికోటా హనుమందిర్‌ మందిరం పూజారి ఎం. చంద్రశేఖర్‌ తన అర్జీని అందజేస్తూ 2011 నుంచి చాలీచాలని వేతనంతో జీవనం కొనసాగిస్తామని తెలియజేశారు. నాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలిన కోరారు.


రాయికోడ్‌ మండలం అల్లాపూర్‌కు చెందిన గొల్ల మణెమ్మ తన అర్జీని అందజేస్తూ తనకు దివ్యాంగుల పింఛన్‌ రూ.3,016 ఇప్పించాలని కోరారు.


జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం గ్రామానికి వెంకటేశ్‌ తన అర్జీని అధికారులకు అందజేస్తూ 2017-18 సంవత్సరానికి గాను బీసీ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎలాంటి సహాయం అందలేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. అర్జీలను స్వీకరించిన కలెక్టర్‌ సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


logo