శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Feb 03, 2020 , 23:24:39

జనగాం కలెక్టర్‌గా జేసీ నిఖిలకు పదోన్నతి

జనగాం కలెక్టర్‌గా జేసీ నిఖిలకు పదోన్నతి

సంగారెడ్డి చౌరస్తా : జిల్లా సంయుక్త కలెక్టర్‌గా సేవలందించిన నిఖిలకు పదోన్నతి లభించింది. జనగాం జిల్లా కలెక్టర్‌గా నిఖిలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 12వ తేదీన జిల్లా సంయుక్త కలెక్టర్‌గా విధుల్లో చేరిన నిఖిల అధికారులందరితో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేశారు. ముఖ్యంగా జిల్లా పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపేవారు. నిఖిల దాదాపు రెండేండ్ల పాటు జేసీగా జిల్లాలో సేవలందించి పదోన్నతిపై ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో జేసీ స్థానం ఖాళీ అయింది. ఇంకా ఎవరు జేసీగా నియామకం కాకపోవడంతో మంగళవారం డీఆర్వో రాధికారమణికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. 


నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు జితేశ్‌ వి.పాటిల్‌..

అదేవిధంగా గత రెండేండ్లపైగా జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, ట్రైనీ కలెక్టర్‌గా పని చేసిన జితేశ్‌ వి.పాటిల్‌ నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో కూడా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పథకాల అమలుకు కృషి చేశారు. జిల్లా స్థాయి అధికారులతో మంచి పేరున్న ఆయనకు సోమవారం ఘన సన్మానం లభించింది. ఆయా శాఖల జిల్లా అధికారులు పాటిల్‌కు పుష్పగుచ్ఛం  అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


logo