బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Feb 02, 2020 , 22:41:47

జోడెడ్లకు రూ.1.30. లక్షలు

జోడెడ్లకు రూ.1.30. లక్షలు

న్యాల్‌కల్‌: ఉర్సె షరీఫ్‌ పీర్‌గైబ్‌ సాహెబ్‌ ఉర్సులో భాగంగా జరిగే పశువుల సంత భారీగా తరలివచ్చిన పశువులతో దర్గా ప్రాంతం కిక్కిరిసిపోయింది. మండల కేంద్రమైన న్యాల్‌కల్‌ శివారులోని దర్గాలో జరిగే ఉత్సవాలకు ఆదివారం తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి రైతులు పశువులను భారీగా తీసుకువచ్చారు. పశువులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. పశువుల యజమానులు పశువులను అందంగా అలంకరించుకుని సంతకు తీసుకువచ్చారు. రైతులు ఎడ్లు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలను కొనుగోలు చేశారు. పశువుల సంతలో వచ్చిన పలు జాతులకు చెందిన ఎడ్లు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు సుమారు రూ.50 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ధర పలికాయి. రాయికోడ్‌ మండలం శరణప్ప అనే రైతుకు చెందిన దున్నపోతుకు రూ.4.50 లక్షలు ధర చెప్పారు. అంతమొత్తంలో ధర ఉండడంతో దున్నపోతును తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 


కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా పరిధిలోని అంధాన్‌పాడ్‌కు చెందిన కాశీనాథ్‌కు చెందిన ఎడ్ల జాతలకు రూ.2 లక్షల ధర చెప్పారు. అయితే ఈ ఎడ్లను రూ 1.50 లక్షలకు కొనుగోలు చేసేందుకు పలువురు రైతులు ముందుకు వచ్చినా అమ్మలేదు. మండలంలోని చాల్కి గ్రామానికి చెందిన విఠల్‌ అనే రైతుకు చెందిన ఎడ్లను రూ.1.60 ధర చెప్పాగా, రాయికోడ్‌ మండలం సింగితం గ్రామానికి చెందిన అంజయ్య అనే రైతు రూ.1.30 లక్షలకు కొనుగోలు చేశాడు. పశువుల సంతలో న్యాల్‌కల్‌ గ్రామానికి చెందిన దివంగత అడివప్ప, గిరిజమ్మల దంపతుల జ్ఞాపకార్థం ఉత్తమ పశుపోషణ చేసిన రైతులకు గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, ఉర్సు ఉత్సవ కమిటీ నిర్వాహకులు కలిసి బహుమతులు అందజేశారు. ఇదిలాఉండగా ఉర్సు ఉత్సవాలకు ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి దర్గాలో మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శివరణయ్యస్వామి, నాయకులు  శ్రీనివాస్‌, భాస్కర్‌, ప్రభాకర్‌, శివరాజ్‌, సత్యనారాయణ, విఠల్‌రెడ్డి, హోతి శివరాజ్‌, ఇసాంపటేల్‌, మక్సుద్‌, ఉర్సు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎండి.ఉస్మాన్‌ పటేల్‌, ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రహెమాన్‌ చౌదరి, ప్రధాన కార్యదర్శి యూనుస్‌ ఖాన్‌, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


logo