ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Feb 01, 2020 , 23:17:38

కనుల పండువగా రథోత్సవం

కనుల పండువగా రథోత్సవం

సంగారెడ్డి మున్సిపాలిటీ: శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత నెల 26వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. పట్టణ శివారులోని మహాలక్ష్మీ గోదాసమేత విరాట్‌ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం (శ్రీవైకుంఠపురం)లో శ్రీవారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఉదయం 6 గంటల నుంచి గర్భగుడిలో శ్రీవారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు పర్యవేక్షణలో శ్రీవారికి పూజలు, పట్టువస్ర్తాలతో అందంగా అలంకరించారు. అంతకుముందు స్వామి వారికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉదయం స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జై శ్రీమన్నారాయణ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందించారు. రథసప్తమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీవారి రథయాత్ర కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శ్రీవారి రథయాత్ర కోసం వివిధ రకాల పూలతో రథాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం 3.00 గంటలకు రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రథయాత్రలో భక్తులు అనేక మంది పాల్గొని రథాన్ని లాగుతూ జై శ్రీమన్నారాయణ... జైజై శ్రీమన్నారయాణ నామస్మరణతో మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.  కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు, మహిళా వలంటీర్లు, బంధువులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


జోగినాథ రథానికి పూజలు 

అందోల్‌, నమస్తే తెలంగాణ: రథ సప్తమి సందర్భంగా జోగిపేటలోని జోగినాథ రథానికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం జోగినాథ స్వామి ఆలయప్రాంగణంలోని రథానికి ఆలయ పూజారి వీరభద్రప్ప సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, రథాన్ని కదిలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య, కౌన్సిలర్లు రంగ సురేశ్‌, పిట్ల భాగ్యలక్ష్మీలక్ష్మణ్‌, డాకూరి శివశంకర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ డిబి. నాగభూషణం, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు  చాపల వెంకటేశం, కమిటీ సభ్యులు డీబీ.రాములు, భిక్షపతి, నర్సింహులు, అల్లెగోపాల్‌, సత్తయ్య, శంకరయ్య తదితరులు ఉన్నారు.


సింగూర్‌లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

పుల్కల్‌: సింగూర్‌లో వెలిసిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం కుంకుమార్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో శ్రీవారిని పురవీధుల గుండా ఊరేగించారు. మండలంలో సింగూర్‌ వేంకటేశ్వర స్వామి దేవాలయమే ప్రధానమైనది కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట పట్టణాల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. ఆలయ సమీపమంలో తినుబండారాల దుకాణాలు వెలిశాయి.


ఘనంగా రథ సప్తమి  

గుమ్మడిదల: కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలోని   శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కేవీ. నర్సింహాచార్యులు, కేవీ. రంగనాథచార్యులు అర్చక బృందం ఆధ్వర్యంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్లకు పూజలను నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. 


న్యాల్‌కల్‌లో..

న్యాల్‌కల్‌: మండలంలోని రాఘవపూర్‌ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న వసంత పంచమి ఉత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో వేదపండితులు సరస్వతీ అమ్మవారితోపాటు సాయిబాబా, గంగామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలో రథసప్తమి దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక క్షేత్ర ఆవరణలోని సూర్యభగవాన్‌ స్వామివారికి వేదపండితులు అభిషేకం, హారతి తదితర పూజలు చేశారు. అనంతరం భక్తుల భజన కీర్తనలు, భాజాభజంత్రీల హోరు, ఆటపాటల మధ్య సూర్యభగవాన్‌ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకలో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. 


logo