మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Feb 01, 2020 , 00:05:56

పెండింగ్‌ పనులు..పూర్తి చేయండి

పెండింగ్‌ పనులు..పూర్తి చేయండి
  • ఈ నెల 8న జహీరాబాద్‌లో ‘డబుల్‌' ఇండ్లు ప్రారంభం
  • వేసవిలో నీటి సమస్య రాకూడదు
  • సింగూర్‌ నుంచి సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు తాగునీరు సరఫరా చేయాలి
  • మున్సిపల్‌ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
  • ప్రతి అధికారి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేయాలి

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అభివృద్ధి పనులు వేగవంతం చేయడం లేదని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్‌ మున్సిపల్‌లో పట్టణ అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని, చెత్తను రోడ్లుపై వేయకుండా ప్రజలను చైతన్యం తీసుకురావాలన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేయాలన్నారు. పారిశుద్ధ్య అధికారులు మున్సిపల్‌కు 12 వేల చెత్త బుట్టలు కావాలని కోరాగా, వెంటనే మంత్రి హరీశ్‌రావు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రెండు రోజుల్లో బుట్టలు పంపిణీ చేయాలన్నారు. మున్సిపల్‌ ప్రత్యేక అధికారి, ఆర్డీవో రమేశ్‌బాబు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపల్‌ పరిధిలో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మున్సిపల్‌ పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఏఈ శ్రీధర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపల్‌లో చెత్త సేకరణ ఎలా చేస్తున్నారో పరిశీలించి, ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. 


తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి

వేసవిలో జహీరాబాద్‌ మున్సిపల్‌లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మిషన్‌ భగీరథ ఎస్‌ఈ రఘువీర్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సింగూర్‌ ప్రాజెక్టులోని నీరు మే వరకు సరిపోతుందన్నారు. సింగూర్‌ నీటిని తాగునీటి కోసం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు సరఫరా చేస్తామన్నారు. జహీరాబాద్‌ మున్సిపల్‌లో ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నల్లా ఏర్పాటు చేసి, ఫిబ్రవరి నుంచి సింగూర్‌ నీటిని సరఫరా చేస్తామన్నారు. గ్రామాల్లో వందశాతం మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసి, నల్లాలు బిగించిన వెంటనే సర్పంచులు, ఎంపీటీసీలతో సంతకాలు తీసుకోవాలన్నారు. జహీరాబాద్‌ పట్టణంలో రూ.24కోట్లతో మిషన్‌ భగీరథ పనులు చేసేందుకు టెండర్‌ వేసి కాంట్రాక్ట్‌ పనులు అప్పగించినా, పూర్తి చేయడం లేదని మంత్రి దృష్టికి అధికారులు తీసుకురాగా, వెంటనే టెండర్‌ రద్దు చేసి కొత్త వారికి పనులు అప్పగించాలని సూచించారు. 


డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి

జహీరాబాద్‌ పట్టణంలో నిర్మాణం చేస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌ఈ ప్రతాప్‌కుమార్‌ను ఆదేశించారు. పస్తాపూర్‌ శివారులో నిర్మాణం చేసిన 40 ఇండ్లను ఫిబ్రవరి 8న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. రహ్మిత్‌నగర్‌లో నిర్మాణం చేసిన 312 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లును ప్రారంభించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌లకు సూచించారు. ఫిబ్రవరి నెల చివరి వరకు అక్కడ కూడా ఇండ్లను ప్రారంభించుకుందామన్నారు. హోతి(కే) శివారులో నిర్మాణం చేస్తున్న 660 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పగా, జూన్‌ వరకు పనులు పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. 


డివైడర్‌ పనులు పూర్తి చేయాలి

జాతీయ రహదారిపై డివైడర్‌ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాని మున్సిపల్‌ అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. నిధులున్నా పనులు పూర్తి చేయడం లేదని, మున్సిపల్‌ ఏఈ శ్రీధర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డివైడర్‌ పనులు పూర్తి చేసి, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్‌లో రూ.4.15 కోట్ల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. 14 ఆర్థిక సంఘం నిధుల మంజూరు చేసినా పనులు పూర్తి చేయడం లేదని, మాజీ కౌన్సిలర్లు మంత్రి దృష్టికి తీసుకుపోగా, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంనగర్‌- చిన్న హైదరాబాద్‌ వరకు బీటీ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మున్సిపల్‌లో ఎస్సీ, క్రైస్తవ శశ్మాన వాటిల నిర్మాణం పనులు ప్రారంభించి, పూర్తి చేయాలన్నారు. శశ్మాన వాటిలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం రూ.1.5కోట్ల మంజూరు చేసిందన్నారు. బాగారెడ్డి స్టేడియంలో వెంటనే విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌ దీపాలు ఏర్పాటుకు టెండర్లు వేసినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదని, ఇంజినీరింగ్‌ అధికారులు తెలుపగా, కొత్తగా టెండర్లు వేయాలని సూచించారు. అదేవిధంగా పార్కులు నిర్మాణం, మురికి కాల్వలు, సీసీ రోడ్లు నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. 


ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్‌ మున్సిపల్‌ అదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రమేశ్‌బాబుకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. మున్సిపల్‌ సంవత్సరం ఆదాయం రూ.5.30 కోట్లు ఉందని ఆర్వో ప్రభాకర్‌ తెలుపడంతో ఆదాయం కరెంట్‌ బిల్లులకు సరిపోదన్నారు. వెంటనే ఆదాయం పెంచేందుకు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆస్తి పన్నులు చెల్లించకపోయినా మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక అధికారులు కొత్త భవనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారని మాజీ కౌన్సిలర్లు మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే పరిశీలించి ఆస్తి పన్నులు వసూలు చేయాలని ఆదేశాలిచ్చారు. 


అర్హులకే ప్రభుత్వ పథకాలు 

జహీరాబాద్‌ డివిజన్‌లో అర్హులైన వారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు వెంటనే ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆర్డీవో రమేశ్‌బాబును ఆదేశించారు. హోతి(కే) శివారులో భూమి సర్వే చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావును ఆదేశించారు. సమావేశంలో జహీరాబాద్‌ సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, సినీ నిర్మాత మల్కాపూరం శివకుమార్‌, తహసీల్దార్‌ పి.నాగేశ్వర్‌రావు, ఎంపీడీవో రాములు, మున్సిపల్‌ రెవెన్యూ అధికారి ప్రభాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ ప్రతాప్‌కుమార్‌, డీఈఈలు యాదయ్య, సాబేర్‌ హుస్సేన్‌, ట్రాన్స్‌కో డీఈ లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎంజీ.రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు తంజీం, మాజీ కౌన్సిలర్లు నామ రవికిరణ్‌, రాములునేత, మోతీరాం, కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


ఫిబ్రవరి 8 వరకు పనులు పూర్తి చేయాలి

- ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌

జహీరాబాద్‌ మున్సిపల్‌లో పెండింగ్‌లో ఉన్న పనులు ఫిబ్రవరి 8 వరకు పూర్తి చేసి నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌ను అధికారులకు సూచించారు. మంత్రి హరీశ్‌రావు ఆరోజున జహీరాబాద్‌లో పర్యటన చేస్తారన్నారు. మున్సిపల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి చేయాలన్నారు. 


అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

- ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు మంజూరు చేసిందని, పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు. మున్సిపల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసేందుకు ముందుకు రావాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. 


మున్సిపాలిటీల పాలకవర్గాలకు శుభాకాంక్షలు

బొల్లారం/ అమీన్‌పూర్‌: నూతనంగా ఎన్నికైన బొల్లారం, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు శుక్రవారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త పాలక వర్గాలకు మంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మంత్రి హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొలన్‌ రోజారాణి, అమీన్‌పూర్‌ చైర్మన్‌ తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్‌చైర్మన్‌ నందారం నర్మింహ్మగౌడ్‌, బొల్లారం కౌన్సిలర్లు వేణుపాల్‌రెడ్డి, సంధ్య, బాలమణి, శైలజ, సుజాత, బీరప్పయాదవ్‌, ప్రభు, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు బీజీలీ రాజు, కల్పన ఉపేందర్‌రెడ్డి, నవనీత జగదీశ్వర్‌, బాసెట్టి కృష్ణ, కొల్లూరి మల్లేశ్‌, చంద్రకళ గోపాల్‌, మహాదేవరెడ్డి, రాజేశ్వరీ, మంజుల ప్రమోద్‌రెడ్డి, బాలమణి, ఎండీ యూసుఫ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు తలారి రాములు, నాయకులు దాసుయాదవ్‌ తదితరులు ఉన్నారు.


logo