గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Feb 01, 2020 , 00:02:45

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు
  • పరీక్షలకు హాజరుకానున్న12,478 మంది విద్యార్థులు
  • జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాలు
  • ఆన్‌లైన్‌లో పరీక్షా పత్రం.., అప్పటికప్పుడే మార్కుల నమోదు
  • మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు

సంగారెడ్డి టౌన్‌ : ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ప్రాక్టికల్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 12,478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 59 సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో జనరల్‌లో 53 సెంటర్లు కాగా, ఒకేషనల్‌లో 6 సెంటర్లు, మొత్తం 59 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షల కోసం బొటనీ, జువాలజీలో 3,750 మంది విద్యార్థులు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో 8,728 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వాటితో పాటుగా ఒకేషనల్‌లో ఫస్టియర్‌లో 1272 మంది, సెకండియర్‌లో 857 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్‌ పరీక్షల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు పరీక్షలను సీసీ కెమెరాల నిఘా నీడన నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు చర్యలు తీసుకున్నది. ఆన్‌లైన్‌లోనే ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ చేయడం, వాల్యూయేషన్‌ చేసిన తర్వాత నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే మార్కుల నమోదు వంటి చర్యలు రెండేండ్లుగా నిర్వహిస్తున్నారు. 


ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌..

ప్రాక్టికల్‌ పరీక్షలకు ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేస్తారు. ఇంటర్‌ బోర్డు విద్యార్థి హాల్‌టికెట్‌ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని సదరు విద్యార్థికి కేటాయిస్తున్నది. పైగా అది ఎగ్జామినర్‌కు కూడా ముందుగా తెలియదు. పరీక్ష సమయానికి అరగంట ముందుగా ఎగ్జామినర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పరీక్ష కేంద్రం ఐడీ, పాస్‌వర్డుతో లాగిన్‌ అయ్యాక అతని మొబైల్‌కు వచ్చే ఓపీటీని ఉపయోగించి ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్‌ చేస్తారు. అందులో ఏ హాల్‌ టికెట్‌ నెంబర్‌ విద్యార్థికి ఏ ప్రశ్నాపత్రం అన్నది ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాలు చేయించాలి. ప్రతిరోజు రెండు బ్యాచ్‌లుగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రాక్టికల్స్‌ చేయిస్తారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఉంటాయి. అవి పూర్తి కాగానే ఎగ్జామినర్‌ ఆ ల్యాబ్‌లోని 20 మంది విద్యార్థుల రికార్డులను దిద్ది ప్రాక్టికల్స్‌ ఫలితాలను, మార్కుల వివరాలను 12.00 గంటల నుంచి 2.00 గంటల లోగా అప్‌లోడ్‌ చేయాలి. నిర్ణీత వేళలో అప్‌లోడ్‌ చేయకుంటే వెబ్‌సైట్‌ క్లోజ్‌ అవుతున్నది. ఆ విద్యార్థి మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు కావు. దీంతో అక్రమాలు జరుగకుండా ఉంటుంది. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకు జరిగే రెండో బ్యాచ్‌కీ ఇదే పద్ధతి అమలు చేస్తారు. ఎప్పటికప్పుడు మార్కులను అప్‌లోడ్‌ చేయాలి. 


మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు..

మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 4వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఇంటర్‌ వార్షిక పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 49 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 16,062 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సెకండియర్‌లో 16,076 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఒకేషనల్‌ కేటగిరీలో ఫస్టియర్‌లో 1272 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 913 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 


logo