మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jan 31, 2020 , 23:55:29

నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలు

నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలు

-ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

సంగారెడ్డి టౌన్‌: నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌హాల్లో సంగారెడ్డి రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లు, వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 440 మంది చనిపోయారన్నారు. ఒక్క జనవరి నెలలోనే రోడ్డు ప్రమాదం జరిగి 24 మంది చనిపోయారని, గత సంవత్సరం జనవరి నెలలో 36 మంది చనిపోయారన్నారు. ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయన్నారు. 60 శాతం ప్రమాదాలు డ్రైవర్ల తప్పు వలనే జరుగుతున్నాయని, మరో 25శాతం ప్రమాదాలు ఎదురుగా వచ్చి ఢీకొనడం, మరో 20 శాతం ప్రమాదాలు రోడ్లు బాగా లేకపోవడం వల్ల జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా 80 శాతం ప్రమాదాల్లో టూవీలర్స్‌ డ్రైవర్లే చనిపోతున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణాలు అన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారని భద్రతను పాటిస్తూ తమ ఆటోలను నడుపాలన్నారు. తాగి ఆటోలను నడుపవద్దని, డ్రంకన్‌డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తున్నామని, తాగి వాహనం నడిపితే జైలు శిక్ష పడుతుందన్నారు. 100 శాతం ఆల్కహాల్‌ శాతం పెరిగితే జైలు తప్పదని, మద్యం సేవించి పోలీసులకు దొరికిన వారి వేలిముద్రలు తీసుకుంటున్నామని, తిరిగి రెండోసారి మద్యం సేవించి వాహనం నడిపి దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. పోలీసుశాఖ నుంచి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగినప్పుడే ప్రమాదాల గురించి తెలుసుకుని మర్చి పోకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. 


తాగి వాహనం నడిపిన వారు ఆత్మాహుతి బాంబర్‌ లాంటివారు

- సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి

మద్యం తాగి వాహనం నడిపిన వారు ఆత్మాహుతి బాంబర్‌ లాంటివారని సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. తాగొద్దు, బండినడుపొద్దని సూచించారు. ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనాలు నడుపవద్దని, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయవద్దని, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. టూ వీలర్‌ నడిపేవారు కాకుండా వెనుకసీటులో కూర్చున్నవారు కూడా హెల్మెట్‌ పెట్టుకోవాలన్నారు. ఏఎంవీఐ లావణ్య మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలన్నారు. రోడ్డు సిగ్నల్స్‌ పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణిలకుపై మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ట్రాఫిక్‌ సీఐ ముజిబుర్‌ ఉర్‌ రెహ్మాన్‌, రూరల్‌ సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 


logo