ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jan 31, 2020 , 23:31:51

విద్యార్థులను తీర్చిదిద్దే గొప్పబాధ్యత ఉపాధ్యాయులది

విద్యార్థులను తీర్చిదిద్దే గొప్పబాధ్యత ఉపాధ్యాయులది

  డీఈవో రాజేశ్‌

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: విద్యార్థులను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుందని జిల్లా విద్యాధికారి రాజేశ్‌ అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు పట్టణంలో విద్యాశాఖ ఆధ్యర్యంలో నిష్ట ట్రైనింగ్‌ సెంటర్‌లో జరుగుతున్న నిష్ఠ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణను ఆయన పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులకంటే ఎక్కువ గౌరవ ప్రదమైందన్నారు. సెలవుల్లో ఉపాధ్యాయులు స్వీయ అభివృద్ధికి చదువులకోవాని, విద్యార్థులకు ఆకర్షణీయమైన బోధనను అందజేసేందుకు సాధన చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యాయులపై తనకు నమ్మకం ఉందని, అందరూ కృషి చేసి నిష్ట శిక్షణలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలన్నారు. ఎంఈవో పీపీ రాథోడ్‌ మాట్లాడుతూ పటాన్‌చెరులో జరుగుతున్న ఈ శిక్షణ విజయవంతమైందన్నారు. ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తితో ఈ శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. తెలుగు మీడియం నుంచి 116 మంది, ఉర్దూ మీడియం నుంచి 47 మంది టీచర్లు శిక్షణ పొందారన్నారు. ఐదు రోజుల ఈ శిక్షణతో ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంచుతున్నామన్నారు. నాణ్యమైన బోధనను అమలు చేసి విద్యార్థులను అన్నిరకాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. 


ఫోకస్‌ కేంద్రాన్ని సందర్శించిన డీఈవో

సంగారెడ్డి చౌరస్తా: ఫోకస్‌ కేంద్రాన్ని జిల్లా నూతన విద్యాశాఖ అధికారి రాజేశ్‌ సందర్శించారు. జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా స్థానిక బైపాస్‌ రోడ్డులో ఉన్న జిల్లా సైన్స్‌ కేంద్రంలోని ఫోకస్‌ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు నేర్చుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వచ్చే పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలనున సాధించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్‌ అధికారి విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు పూర్ణ కృష్ణ,  ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నూతన డీఈవోకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 


logo