మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jan 29, 2020 , 02:53:19

జాతరెల్లిపోదాం

జాతరెల్లిపోదాం
  • - ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు
  • - నేడు చల్లగిరి, రేపు సింగూరులో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • - రేపు వసంత పంచమి
  • - ప్రత్యేక పూజలు అందుకోనున్న వర్గల్‌ సరస్వతీ అమ్మవారు
  • - అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో కిటకిటలాడనున్న ఆలయం


 సంగారెడ్డి, నెట్‌వర్క్‌ : తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలైన జాతరలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రారంభంకానున్నాయి. పుల్కల్‌ మండలం సింగూరు, సిర్గాపూర్‌ మండలం చల్లగిరిలో వెలసిన వేంకటేశ్వరస్వామి, ఆలయాలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యాయి. చల్లగిరిలో నేటి నుంచి, సింగూరులో రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, తెలంగాణలో రెండో సరస్వతీ దేవాలయంగా విరాజిల్లుతున్న వర్గల్‌ విద్యాధరి క్షేత్రం వసంత పంచమి మహోత్సవానికి ముస్తాబైంది. అమ్మవారి జన్మదినంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఏటా వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. పెద్దసంఖ్యలో భక్తులు రానున్నట్లు ఆలయ వర్గాలు అంచనా వేయగా, గురువారం అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో అమ్మవారి సన్నిధి మార్మోగనున్నది. సంగారెడ్డిలోని వైకుంఠపురంలోని వేంకటేశ్వరస్వామి ఎదుర్కోలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

-

వర్గల్‌: నిత్యానందలకరిణి, విద్యాపాణి, చదువులతల్లి వర్గల్‌ సరస్వతీమాత ఆలయం గురువారం జరిగే శ్రీపంచమి (వసంత)వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హైదారాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలకు 55 కి.మీ దూరంలో వర్గల్‌ మండలకేంద్రంలో వెలసిన సరస్వతీమాత 1991 నుంచి భక్తుల చేత జయ జయ నీరాజనాలు అందుకుంటూ ఆశ్రితుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతున్నది. ప్రతి యేటా మాఘమాసంలో జరిగే శ్రీపంచమి వేడుకలలో పాల్గొనేందుకు రాష్ట్రంలో నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో వర్గల్‌ విద్యాధరిక్షేత్రానికి తరలివస్తుంటారు. తెలంగాణలోనే రెండో బాసర సరస్వతీ దేవాలయంగా విరాజిల్లుతున్న వర్గల్‌ సర్వతీమాత శ్రీపంచమి వేడుకలకు ముస్తాబైంది. ఆలయలంలో శాశ్వత ప్రాతిపాదికంగా ఏర్పాటు చేసిన మండపాలు, చండీహోమాది యాగశాల, సరస్వతీమండపం విద్యుత్‌ దీపాలు, పూలమాలలతో, రంగులమయంతో తీర్చిదిద్దారు.


విశేష కార్యక్రమాలు

వర్గల్‌ విద్యాధరిక్షేత్రంలో జరిగే శ్రీపంచమి వేడుకల సందర్భంగా గురువారం ఉదయం తెల్లవారు జామున 4 గంటలకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో వేద పండితులు గణపతిపూజ, అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామి   పాల్గొంటారు. అభిషేకాలనంతరం, అలంకార సేవ ఆ తరువాత గిరిప్రదక్షిణం సేవలో అమ్మవారు ఊరేగుతారు. 8-30 గంటలకు లక్షపుష్పార్చన 11-30 గంటలకు 56 రకాల మధురపదార్థంతో (చప్పన్‌భోగ్‌) నివేదన జరిపిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పీఠాధిపతులతో అనుగ్రహభాషాణం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.


ప్రతిభా పురస్కారాలు

మండలంలోని 2019-20 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జీ.పీ.ఏలో మంచి ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. 


ఆర్టీసీ బస్సు సౌకర్యం

శ్రీపంచమి వేడుకలను పురస్కరించుకొని హైదారాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. వీటికితోడు  గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన పలు బస్సులను నడుపనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.


పుల్కల్‌: భక్తుల కొంగు బంగారం సింగూర్‌ ప్రాజెక్టులో వెలిసిన కల్యాణ సుందర వేంకటేశ్వరుడు. స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శ్రీవారి కల్యాణోత్సవం, రథోత్సవం, సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఆలయ చరిత్ర..

సింగూర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటిపారుదలశాఖ అధికారులు, గుత్తేదారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1975లో ఆలయ నిర్మాణం ప్రారంభించగా, 1977లో నిర్మాణం పూర్తి చేసుకున్నది. అదే సంవత్సరం నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.


కార్యక్రమ వివరాలు

- 30న ప్రభాతవేళ పుణ్యహావచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

- 31న వేంకటేశ్వరస్వామి వారి కల్యాణం.

- ఫిబ్రవరి 1న సామూహిక సత్యనారాణ వ్రతాలు,  శ్రీవారి రథోత్సవం

- ఫిబ్రవరి 2న చక్రవర్తి తెప్పోత్సవంతో ముగింపు. 


ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం 

నీటిపారుదలశాఖ అధికారులతో నిర్వహిస్తున్న ఈ ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గత ఏడాది రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మించగా, ప్రస్తుతం ప్రధాన ఆలయానికి ఇరువైపులా అలవేలుమంగ, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్టించడానికి నూతనంగా నిర్మించిన ఆలయాలు పూర్తిచేశారు. అంతేకాకుండా ప్రధానాలయానికి సమీపంలో శివాలయం నిర్మించారు. ధ్వజస్థంభం వద్ద ద్వారపాలకుడికి భవ్యమైన ఆలయం నిర్మించారు. నవగ్రహాల కట్ట, కొలను నిర్మించారు. తాగునీటికోసం నల్లాల ఏర్పాటు చేశారు. లడ్డూల విక్రయానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవానికి రేకుల షెడ్డు, భోజనశాల నిర్మించారు.


పర్యాటక ప్రదేశాలు..

సింగూర్‌ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు పర్యాటక ప్రదేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. 30 టీఎంసీల సామర్థ్యం గల సింగూర్‌ డ్యాం, 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, టూరిజంశాఖ వారు ఏర్పాటు చేసిన పార్కు, హరిత హోటల్‌, నీటి పారుదలశాఖ అతిథి గృహం, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం అథితి గృహం, మంజీరా అభయారణ్యంలోని మొసళ్ల కేంద్రం చూడవచ్చు. సింగూర్‌ ప్రాజెక్టు చేరుకోడానికి జోగిపేట, సంగారెడ్డి, సదాశివపేట నుంచి ఆర్టీసీ బస్సుల సౌకర్య కలదు.


logo