మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Jan 27, 2020 , 05:06:03

అభివృద్ధిలో నెంబర్‌-1

అభివృద్ధిలో నెంబర్‌-1
  • పల్లెప్రగతిలో పరిశుభ్రంగా గ్రామాలు
  • కలెక్టర్‌ హనుమంతరావు
  • పోషణ్‌ అభియాన్‌లో జిల్లాకు జాతీయ అవార్డు
  • 1.48లక్షల మందికి రైతుబీమా
  • రైతు బంధులో రూ.265 కోట్లు
  • రూ.80.67 కోట్ల నిధులు మంజూరు

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ/సంగారెడ్డి టౌన్‌:తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్‌-1గా నిలిపి ఉత్తమ అవార్డులు వచ్చాయి. పల్లెప్రగతిలో పల్లె సీమలను పరిశుభ్రత-పచ్చదనంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం సెప్టెంబర్‌ మాసంలో చేపట్టి విజయవంతం చేసిందని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ప్రగతిని వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరియాలని సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమాన్ని మొదటి విడుత విజయవంతం చేసి గ్రామాల రూపురేఖలు మార్చాం. 


రెండో విడుత ఈనెల 2వ తేదీ నుంచి 10 రోజుల పాటు పల్లెప్రగతి కార్యక్రమాలను చేపట్టి గ్రామాలను అందంగా తీర్చిదిద్దుకున్నాం. అంతేకాకుండా ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తయారు చేయడానికి గ్రామాల్లో టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ను సేకరించి కర్మాగారాలకు తరలించి శుభ్రం చేశాం. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాకు రూ.80.67లక్షల నిధులు విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా మార్చగలిగాం. ముఖ్యంగా గ్రామాల్లో డంపుయార్డులు, వైకుంఠధామాలు, ఇంకుడు గుంతలు, నర్సరీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిధులను ఖర్చు చేసింది. గ్రామాల్లో చెత్తాచెదారం కనిపించకుండా ప్రతి ఇంటికీ తడిపొడి చెత్తబుట్టలు, ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, డోజర్‌ యంత్రాలను అందించి ఎప్పటికప్పుడు వీధులను శుభ్రం చేస్తున్నాం. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేసి పల్లెనిద్ర, మెగాశ్రమదానం, మహిళా శ్రమదానం, యువశ్రమదానం వంటి కార్యక్రమాలు చేపట్టి జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టుకున్నామని కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. 


1,48,553 మందికి రైతు బీమా..

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంతో 1,48,553 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించాం. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన 346 మంది రైతు కుటుంబాలకు రూ.17.30 కోట్లను వారి నామినీ ఖాతాలో జమచేశామని కలెక్టర్‌ వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐకేపీ, సహాకార పరపతి సంఘాలతో 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 6,91,685 క్వింటాళ్ల ధాన్యం 12,745 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.117.55 కోట్లను వారి ఖాతాల్లో జమచేశాం. పందిరి కూరగాయల సాగుకు జిల్లాను ఫైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 100 మంది రైతులను గుర్తించి 97 ఎకరాల్లో పందిరి సాగు చేస్తున్నాం. 


వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం జలాలు..

జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను వచ్చే ఏడాది నాటికి జిల్లాకు అందించేందుకు ప్రభుత్వం పనులు వేగవంతం చేసిందని కలెక్టర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్‌ నుంచి సింగూరు, మంజీరా ప్రాజెక్టులను నింపి జిల్లాలోని రైతులకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా గోదావరి జలాలు అందిస్తాం. ఇందుకోసం ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకంలో 1,984 కిలోమీటర్ల పైపులైన్లు వేసి 20 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించి 949 ఆవాసాల్లోని 13,16,161 మంది జనాభాకు తాగునీరు అందజేస్తున్నాం. భవిష్యత్‌లో వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా సమీప బోరు బావులు, ట్యాంకర్లతో అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మిషన్‌ కాకతీయ నాలుగు దశల్లో జిల్లాలోని 1783 చెరువులను పునరుద్ధరణ పనులు చేపట్టి 1550 పనులు పూర్తి చేశాం. మిగతా పనులు పురోగతిలో కొనసాగుతున్నాయి. వచ్చే వానకాలం నాటికి సింగూరు ప్రాజెక్టు కింది 51,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా నల్లవాగు ప్రాజెక్టు కింద మరో 2 వేల ఎకరాల ఆయకట్టు సాగుకు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 


కార్పొరేషన్లతో స్వయం ఉపాధి..

ప్రభుత్వం నిరుద్యోగ యువకులను ఆర్థికంగా ఆదుకునేందుకు కార్పొరేషన్లతో స్వయం ఉపాధి పథకాలను అందిస్తుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వ్యక్తిగత స్వయం ఉపాధి పథకంలో 297 యూనిట్లు ప్రారంభించేందుకు రూ.కోటి 48లక్షల ఆర్థిక సాయం అందించాం. రాష్ట్రంలోనే తొలిసారిగా షీ క్యాబ్‌ ఫైలెట్‌ పథకం కింద 25 మంది యువతులకు డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చాం. శిక్షణ పొందిన యువతులకు త్వరలో వాహనాలు అందిస్తాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్‌లో 765 మంది బీసీలకు 100శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు రూ.3.82 కోట్ల నిధులు సమకూర్చాం. బ్యాంకులతో సంబంధం లేకుండా 41 మంది మైనార్టీలకు 100 శాతం సబ్సిడీతో రూ.18 లక్షలను అందజేశాం. గిరిజన సహకార సంస్థతో ట్రైకార్‌ కింద రూ.4.28 కోట్ల ఖర్చుతో 393 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రోత్సహించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులు అందించాం. 


57 ఏండ్లకే పింఛన్లు..

రాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు దాటిన వయస్సు వారికి పింఛన్లు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రకటించి అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని కలెక్టర్‌ వెల్లడించారు. ఈ పథకాన్ని మార్చి నెల నుంచి అమలు చేసి వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రతి నెల రూ.2016లను, వికలాంగులకు రూ.3016ల చొప్పున జిల్లాలో 1,37,517 మందికి పింఛన్లు అందజేస్తున్నాం. ఇప్పటి వరకు పింఛన్‌దారులకు జిల్లాలో రూ.31.71కోట్ల నిధులు ఆసరా పింఛన్లు అందజేశాం. 57 సంవత్సరాలకు వయస్సు తగ్గించినందున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి కొంతమందికి ఆసరా పింఛన్లను అందించే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. కులమతాలకు అతీతంగా పేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ పెండ్లి భారం కాకూడదనన ఉద్దేశంతో ప్రభుత్వం రూ.1,00,116లను కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో కల్యాణలక్ష్మి పథకంతో 4,632 పేద మహిళలకు రూ.46,37,37,312 కోట్లను, షాదీముభారక్‌లో 1,374 మంది మహిళలకు రూ.13,75,59,384 కోట్ల ఆర్థిక సాయం అందజేశామని కలెక్టర్‌ తెలిపారు. 


ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌తో సంపూర్ణ అక్షరాస్యత..

జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతలో నిలిపేందుకు 18 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను పల్లెప్రగతిలో గుర్తించి ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ ద్వారా సంపూర్ణ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్‌ వివరించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించి గత సంవత్సరం పదో తరగతిలో జిల్లాకు నాల్గో స్థానంలో నిలిచిందని, ఈ సంవత్సరం మొదటి స్థానం దక్కించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉత్తమ పలితాలు సాధించడానికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా వేక్‌ అఫ్‌ కాల్‌ ద్వారా వసతిగృహ విద్యార్థులను ఫోన్‌లో ఉదయమే లేపి ఫోకస్‌ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు రెసిడెన్సియల్‌లో బోధిస్తున్న ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నాం. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన పోలీసుశాఖ, జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బందికి, పాత్రికేయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయమూర్తి పాపిరెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎస్పీ సృజన, జాయింట్‌ కలెక్టర్‌ నిఖిల, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జడ్పీ సీఈవో టి.రవి, డీఆర్వో రాధిక రమణి, ఆర్డీవో మెంచు నగేశ్‌, డీఈవో విజయలక్ష్మితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 


logo