సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jan 27, 2020 , 05:04:24

ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా గణతంత్ర వేడుకలు
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం
  • ఆకట్టుకున్న శకటాలు

-


సంగారెడ్డి టౌన్‌: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆదివారం పట్టణంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు దేశ భక్తి గీతాలపై నృత్యాలు చేశారు. సంగారెడ్డిలోని చైతన్య పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులు, రామచంద్రాపురం మండలం ఉస్మానాబాద్‌ కేజీబీవీకి చెందిన 80మంది, సంగారెడ్డిలోని శాంతినగర్‌ సెయింట్‌ ఆంథోనీస్‌ పాఠశాల విద్యార్థులు 90 మంది, సంగారెడ్డి బాలికల పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థినులు, జహీరాబాద్‌లోని నారాయణ ఉన్నత పాఠశాలకు చెందిన 90 మంది విద్యార్థులు, సంగారెడ్డిలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులు, సంగారెడ్డిలోని స్పెక్ట్రా ఉన్నత పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులు, సబిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు, బాలసదనం విద్యార్థులు దేశభక్తి గీతాలు, ఇతర పాటలపై నృత్యాలు చేశారు. కొండాపూర్‌ మండలం గంగారం ఉన్నత పాఠశాలకు చెందిన 95 మంది విద్యార్థులు యోగాసనాలు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. నృత్యాలు చేసిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో షీల్డ్‌లను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న 10 కళా బృందాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, న్యాయమూర్తి పాపిరెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఏఎస్పీ సృజన, జాయింట్‌ కలెక్టర్‌ నిఖిల, ట్రైనీ కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, డీఆర్వో రాధిక రమణి, ఆర్డీవో మెంచు నగేశ్‌, డీఈవో విజయలక్ష్మిలు షీల్డ్‌లను బహూకరించి, అభినందించారు. 


ఆకట్టుకున్న శకటాలు...

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వివిధ ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోలీసుశాఖ-వేగాన్ని నియంత్రించే స్పీడ్‌ గన్‌, అటవీశాఖ (తెలంగాణకు హరితహారం), భారత ఎన్నికల సంఘం (ఓటు హక్కును నమోదు చేసుకోవాలి), పశుసంవర్ధకశాఖ, సంచార పశువైద్యశాల 1962, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అగ్నిమాపకశాఖ, వ్యవసాయశాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (108, 102, 104), సఖీ కేంద్రం ప్రదర్శించిన శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి.


పథకాలపై స్టాల్స్‌ ఏర్పాటు...

వివిధ శాఖలు తమ శాఖల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పథకాలను వివరిస్తూ పరేడ్‌ మైదానం శకటాలను ఏర్పాటు చేశారు. పోలీసుశాఖ ఆయుధాల ప్రదర్శన, షీటీంల పనితీరుపై, చిన్ననీటి పారుదలశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, వ్యవసాయం, విద్యాశాఖ, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖ, జిల్లా స్వచ్ఛ భారత్‌ మిషన్‌, గ్రామీణ నీటి సరఫరాలశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, ఉద్యానవన శాఖ, అటవీశాఖ, డీడీఎస్‌లు తమశాఖ ద్వారా అందిస్తున్న పథకాలపై స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.


స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం..

స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జేసీ నిఖిల శాలువాలు కప్పి సన్మానించారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 


logo