సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jan 25, 2020 , 23:55:54

‘ఖేడ్‌' ఫలితం ప్రత్యేకం

‘ఖేడ్‌' ఫలితం ప్రత్యేకం


నారాయణఖేడ్‌, నమస్తేతెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నారాయణఖేడ్‌లో ప్రత్యేక పరిస్థితిని కల్పించగా చైర్మన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కు ఉన్న ఎక్స్‌అఫీషియో సభ్యుల అవకాశంతో చుక్కెదురయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తద్వారా నారాయణఖేడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తుంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 వార్డులకుగాను 7 వార్డులను టీఆర్‌ఎస్‌ దక్కించుకోగా మిగతా 8 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక బీజేపీ 1వ వార్డులో మాత్రమే రెండో స్థానాన్ని దక్కించుకోగా మిగతా 14 స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16,042 ఓట్లు ఉండగా 11,657 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో స్థానం కోసం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగగా.. తుది ఫలితం తేలే వరకు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే 3వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డులకు రీకౌంటింగ్‌ నిర్వహించేంత స్థాయిలో పోటాపోటీ కొనసాగింది. కాగా 1వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుటాల కవిత 293 ఓట్ల ఆధిక్యంతో 15 వార్డుల్లోకెల్లా అత్యధిక మెజార్టీ సాధించగా 7వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మూడ సంధ్యారాణి కేవలం 2 ఓట్లతో గెలుపొందారు.

ఇక 2వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వప్న శెట్కార్‌ 21 ఓట్లు, 3వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి 5 ఓట్లు, 4వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేశ్‌చౌహాన్‌ 33 ఓట్లు, 5వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆహిర్‌ పరశురామ్‌ 64 ఓట్లు, 6వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద్‌స్వరూప్‌ శెట్కార్‌ 133 ఓట్లు, 8వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సింహులు 3 ఓట్లు, 9వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి ఉబ్ది సవిత 183 ఓట్లు, 10వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి ఫర్హానా బేగం 15 ఓట్లు, 11వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీదేవి శెట్కార్‌ 102 ఓట్లు, 12వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అబ్దుల్‌ మజీద్‌ 150 ఓట్లు, 13వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేకానంద 73 ఓట్లు, 14వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నూర్జహాన్‌ అబేదాబేగం 175 ఓట్లు, 15వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రుబినా బేగం 214 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కాంగ్రెస్‌ కంటే టీఆర్‌ఎస్‌ ఓట్ల శాతం అధికం..

టీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు ఒక స్థానం ఎక్కువగా వచ్చినప్పటికీ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే మాత్రం మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల కంటే టీఆర్‌ఎస్‌కు 551 ఓట్లు అధికంగా రావడం టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదనడానికి నిదర్శనం. ఇక బీజేపీకి మొత్తం 1,547 ఓట్లు పోలవగా, ఇతరులకు 540 ఓట్లు వచ్చాయి. మరో 159 చెల్లని ఓట్లు పోలయ్యాయి. అంతేకాకుండా 7వ వార్డు మినహా మిగతా స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందిన 8 వార్డుల్లో మూడు స్థానాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ మెజార్టీ రాగా మిగతా 5 స్థానాల్లో పోటాపోటి మెజార్టీతో గట్టెక్కడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 1వ వార్డులో 293, 5వ వార్డులో 64, 12వ వార్డులో 150, 14వ వార్డులో 175, 15వ వార్డులో 214 ఓట్ల మెజార్టీ రాగా కాంగ్రెస్‌ గెలుపొందిన స్థానాల్లో 6వ వార్డులో 133, 11వ వార్డులో 102, 9వ వార్డులో 183, 13వ వార్డులో 73 ఓట్ల మెజార్టీ లభించింది.

టీఆర్‌ఎస్‌లో మహిళలు.. కాంగ్రెస్‌లో పురుషులు..

నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో 15 వార్డుల్లో గెలుపొందిన వారిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా, కాంగ్రెస్‌లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి 1,2, 7,14,15 వార్డుల్లో మహిళలు, 4,12 వార్డుల్లో పురుషులు, కాంగ్రెస్‌లో 3,4,6,8,13 వార్డుల్లో పురుషులు, 9,10,11 వార్డుల్లో మహిళా అభ్యర్థులు ఎన్నికయ్యారు.


logo