శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Jan 24, 2020 , 23:24:32

నేడే ఓటరు తీర్పు

నేడే ఓటరు తీర్పు
  • - ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • - సాయంత్రంలోగా ఫలితాలు
  • - 27న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • - ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు
  • - కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

 సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఎప్పుడెప్పుడా అని అందరిలో నెలకొన్న ఉత్కంఠతకు నేటితో తెర పడనున్నది. నేడు ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్‌ మొదలు కానున్నది. మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లా రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కౌం టింగ్‌ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసిన విషయం క్రమంలో కౌంటింగ్‌ ప్రక్రియ కూడా సాగాలని కలెక్టర్‌ సిబ్బందితో ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లాలో జరిగిన 5 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 162 వార్డులుండగా, బొల్లారంలో 3, సదాశివపేటలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 158 వార్డులకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోనే కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక హాళ్లలో టేబుళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి తారా కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 38 వార్డులుండగా, 13 హాళ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాలులో 3 చొప్పున టేబుళ్లు వేయనున్నారు. ఒకేసారి అన్ని వార్డుల లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాటు చేశారు.  సదాశివపేటలో 8 హాళ్లలో సరిపడా టేబుళ్లు ఏర్పాటు చేశారు. పెద్ద హాళ్లు ఉన్న అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌లలో అందులోనే అన్ని టేబుళ్లు వేశారు.  సమయం మేరకు కౌంటింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే శనివారమే ఫలితాలు వెల్లడికానున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన వారికి నోటీసులు కూడా అందిస్తారు. 27న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికకు హాజరుకావాలని ఆ నోటీసులో సూచిస్తారు. అధికారులు సూచించిన 27న చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లును ఎన్నుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రమా ణ స్వీకారం చేసి,  12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు.

తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి

బొల్లారం:  బొల్లారం మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్‌ నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. మున్సిపల్‌ పరిధిలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. మున్సిపల్‌ పరిధిలోని మొత్తం 22 వార్డులకు 3 వార్డులు ఏకగ్రీవం కాగా, 19వార్డులకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు. మొత్తం 19వార్డులకు 8 గదుల్లో 3 టేబుళ్ల చొప్పున కౌంటింగ్‌ నిర్వహణకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు గాను 65 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. 6 మంది ఎంపీడీవోలు, ఇద్దరు తాసిల్దార్ల పర్యవేక్షణలో కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు. దాదాపు లెక్కింపు ప్రారంభమైన గంట లేదా రెండు గంటల వ్యవధిలోనే అన్ని వార్డుల ఫలితాలను వెల్లడి చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ కౌంటింగ్‌కు పటిష్టమైన చర్యలు, భారీ బందోబస్తు మధ్య అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు బొల్లారం మున్సిపల్‌ ఎన్నికల అధికారి రమేశ్‌బాబు తెలిపారు. కాగా కౌంటింగ్‌ సిబ్బంది, మున్సిపల్‌ అధికారులతో కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ సంతోశ్‌కుమార్‌, అధికారులు దశరథ్‌, భిక్షపతి, చంద్రశేఖర్‌, సుమతి పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో నగేశ్‌..

బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేం ద్రాన్ని శుక్రవారం సంగారెడ్డి ఆర్డీవో మెంచు నగేశ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల అధికారులతో కౌంటింగ్‌ సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. కౌంటింగ్‌కు సంబంధించి అన్ని రకాల చర్యలను తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ భిక్షపతి, మున్సిపల్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

3 గదుల్లో కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు 

అందోల్‌, నమస్తే తెలంగాణ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్‌ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ కేంద్రాలను  అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు గాను 82 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారి భవితవ్యం నేడు తేలనున్నది. మూడు గదుల్లో 20 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో చేపడుతున్న పనులను శుక్రవారం జడ్పీ సీఈవో రవి పర్యవేక్షించారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు 70 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 7 మంది రిటర్నింగ్‌ అధికారులను  నియమించినట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ మిర్జా పసహాత్‌ అలీబేగ్‌, తాసిల్దార్‌ ప్రభులు, ఎంపీడీవో సత్యనారాయణ ఉన్నారు. 
ఉదయం 7 గంటల్లోగా

కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలి 

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు మాత్రం ఉదయం 7గంటల వరకు చేరుకోవాలని జడ్పీ సీఈవో రవి తెలిపారు.  అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంను తేరుస్తామన్నారు. 7:30 గంటలకు కౌంటింగ్‌ కేంద్రాల గదుల్లోకి చేరుకోవాలని, 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో టేబుల్‌ వద్ద ముగ్గురు అధికారులు ఉంటారన్నారు. అభ్యంతరకరమైన ఓట్ల విషయంలో సందేహాలను రిటర్నింగ్‌ అధికారులు నివృత్తి చేస్తారన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లు, అభ్యర్థులు ముందస్తుగా జారీ చేసిన పాస్‌లను వెంట తీసుకురావాలన్నారు.

రామచంద్రాపురంలో..

రామచంద్రాపురం: ‘మున్సి’పోరు ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. తెల్లాపూర్‌లోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో అధికారులు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపును ప్రా రంభించనున్నారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18,132 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఓట్ల లెక్కింపులో భాగంగా 17 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులకు సంబంధించి 58 అభ్యర్థులు పోటీలో నిలువగా, 21,663 ఓటర్లకు గాను 18,132 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అందులో పురుషులు 9,169, మహిళలు 8,963 మంది ఓట్లు వేశారు. ఓట్ల లెక్కింపునకు 17 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 34మంది కౌంటింగ్‌ అసిస్టెంట్స్‌, 6గురు ఆర్వోలను నియమించారు. 1000 ఓట్లకు ఒక రౌండ్‌, 1000 ఓట్లు దాటితే రెండు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఆయా వార్డుల్లో పోలైన ఓట్లను బట్టి 6 వార్డులు ఒక రౌండ్‌, 11 వార్డులు రెండు రౌండ్ల చొప్పున ఓట్లను లెక్కించనున్నారు.  ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా డిప్యూటీ సీఈవో ఎల్లయ్య, డీసీవో ప్రసాద్‌, తాసిల్దార్‌ శివకుమార్‌, కమిషనర్‌ సంగారెడ్డి పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సంగారెడ్డి తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

- కలెక్టర్‌ హనుమంతరావు
పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శుక్రవారం అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడ ఎల్లంకి కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల అధికారులకు కౌం టింగ్‌ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎన్నికల సంఘం నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. పారదర్శకమైన విధానాలను పాటి స్తూ ఫలితాలను వెల్లడిస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా పోలీసుశాఖ చర్యలు తీసుకుంటున్నదన్నారు. అధికారులు ఉదయమే కౌంటింగ్‌ కేంద్రాలకు రావాలని సూచించారు. కలెక్టర్‌ వెంట  తాసిల్దార్లు,  ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లెక్కింపు సిబ్బందికి శిక్షణ

నారాయణఖేడ్‌, నమస్తేతెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం పట్టణ సమీపంలోని జూకల్‌ శివారులో గల ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కించనున్నారు. శుక్రవారం లెక్కింపు సిబ్బందికి ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌ శిక్షణ నిచ్చారు.పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. ఓట్ల లెక్కింపు విధానంపై సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కలిగించారు.

నారాయణఖేడ్‌లో..

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ : ఖేడ్‌ పట్టణ సమీపంలోని జూకల్‌ శివారులో గల మోడల్‌ డిగ్రీ కళాశాల భవనంలో శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 15 వార్డులకు గాను 30 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 16,042 ఓట్లు ఉన్నాయి. కాగా, 11,657 ఓట్లు పోలై 72.67 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే వార్డుల వారీగా నమోదైన పోలింగ్‌ శాతాన్ని బట్టి ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచారసరళి, పార్టీల బలాబలాలు, ప్రజల స్పందన తదితర అంశాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే విశ్లేషణలున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమర్థవంతమైన పనితీరు, సం క్షేమ పథకాలు, అభివృద్ధి పనులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గెలిపిస్తాయనే చర్చలు వినిపిస్తున్నాయి. logo