బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jan 24, 2020 , 22:05:45

తల్లి తిడుతుందని.. లైంగిక దాడి కథ

తల్లి తిడుతుందని.. లైంగిక దాడి కథ
  • - ఎలాంటి దాడి జరుగలేదు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
  • - యువకుడిపై పోస్కో కేసు నమోదు
  • - వీడియో తీసిన వ్యక్తిపై కేసు

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: అమీన్‌పూర్‌లో 16 ఏండ్ల బాలికపై లైంగికదాడి జరిగినదని గురువారం వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా, ఇదంతా కట్టుకథేనని తేలింది. అమీన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చంద్రశేఖర్‌రావు వివారాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు అమీన్‌పూర్‌ పరిధిలోని శ్రీవాణినగర్‌ కాలనీలో ఒక భవనం వద్ద వాచ్‌మెన్‌గా పనిచేసుకుంటూ, అక్కడే  రూంలో ఉంటున్నారు. వారి కూతురు (16) శ్రీకాకుళం నుంచి సంక్రాంతి సెలవులకు ఇక్కడికి వచ్చింది. వారం రోజులుగా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జరుగుతుండడంతో ఆమె కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన రవిగౌడ్‌సతీమణి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో స్థానికంగా ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న, వరంగల్‌ జిల్లాకు చెందిన సందీప్‌గౌడ్‌ (23) పరిచయమయ్యాడు. దీంతో ఇద్దరూ నిత్యం ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. కాగా, రెండు రోజుల్లో శ్రీకాకుళం వెళ్లాల్సి ఉన్నదని అంతలోపు తనకు సినిమా చూపాలని ఆ యువకుడిని యువతి కోరింది. దీంతో గురువారం ఉ.10 గంటల ప్రాంతంలో శ్రీవాణినగర్‌కు వచ్చిన సందీప్‌ యువతిని ద్విచక్ర వాహనంపై మియాపూర్‌లోని టాకీటౌన్‌ టాకీస్‌లో సినిమా చూపించాడు. అనంతరం ఇంటికి కొద్ది దూరంలో యువతిని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి వరకు స్విచ్‌ ఆఫ్‌లో ఫోన్‌ను ఆన్‌ చేయగానే యువతి తల్లి ఫోన్‌ చేసింది.

తాను మూడు గంటల పాటు సినిమా చూసిన సంగతిని దాచి తనను నలుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేశారని, తనపై లైంగిక దాడి చేశారని చెప్పింది. అదే సమయంలో తన బట్టలు చింపుకుని, చేతిపై చిన్నపాటి గాయాలు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానిక నాయకుడొకరు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని ఆ యువతి చెప్పిన రేప్‌ కథను వీడియో తీసి పరిచయం ఉన్నవారికి పంపించారు. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి చెప్పిన కథనంతో తక్షణం సంగారెడ్డి దవాఖానకు పంపించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరించారు. 

ఎలాంటి దాడి జరుగలేదు

లైంగికదాడి జరిగిందని చెబుతున్న మైనర్‌ బాలికను పరీక్షించిన సంగారెడ్డి మహిళా డాక్టర్లు ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరుగలేదని స్పష్టం చేశారు. దీంతో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి యువతిని ప్రశ్నించి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. తాను సినిమాకు యువకుడితో వెళ్లిన విషయం తన తల్లిదండ్రులకు తెలుస్తుందనే భయంతోనే లైంగికదాడి కథ చెప్పానని వెల్లడించింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇదే సమయంలో మైనర్‌ బాలికను సినిమాకు తీసుకుని పోవడంతో సందీప్‌పై పోక్సో చట్టం సెక్షన్‌ 127, ఐపీసీ 509ను కేసు నమోదు చేశారు. మైనర్‌ బాలికను లైంగికదాడి జరిగిందని వీడియో తీసి పోలీసులకు చెప్పకుండా సోషల్‌ మీడియాలో వేసినందుకు కాంగ్రెస్‌ నాయకుడు రవిగౌడ్‌పై పోక్సో చట్టం  ప్రకారం సెక్షన్‌ 21, 22, 15 ప్రకారం, ఐపీసీ 509, జువైనల్‌ జస్టిస్‌ కింద 74, 75 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో మైనర్‌తో ప్రచారం నిర్వహించినందుకు మరో కేసును రవిగౌడ్‌పై పోలీసులు పెట్టారు. ఈ కేసును తొందరగా ఛేదించిన డీఎస్పీ రాజేశ్వర్‌రావు బృందంలోని అమీన్‌ఫూర్‌ సీఐ ప్రభాకర్‌కు, భానూర్‌ సీఐ రాంరెడ్డికి, జిన్నారం సీఐ  లాలునాయక్‌ను, ఎస్‌ఐలను, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. బాలల చట్టాలు కఠినంగా ఉంటాయని, బాలలపై ఆకృత్యాలు జరిగితే ఎలాంటి వీడియోలు తీయొద్దని హెచ్చరించారు.


logo