గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jan 24, 2020 , 04:51:38

రేపే కౌంటింగ్‌

రేపే కౌంటింగ్‌
  • -సాయంత్రంలోగా ఫలితాలు
  • -27తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • -అదే రోజు మొదటి సమావేశం
  • -మున్సిపాలిటీ కేంద్రాల్లోనే కౌంటింగ్‌ కేంద్రాలు
  • -ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
  • -ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు

 సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కౌంటింగ్‌ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కౌంటింగ్‌ ప్రక్రియ కూడా సాగాలని కలెక్టర్‌ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోనే కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలు కానున్నది. మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అన్నింట్లో కలిసి 162 వార్డులుండగా, బొల్లారంలో 3, సదాశివపేటలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 158 వార్డులకు పోలింగ్‌ జరిగింది. కౌంటింగ్‌ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. కాగా, తక్కువ వార్డులున్న నారాయణఖేడ్‌ ఫలితాలు ముందుగా వెలువడనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సంగారెడ్డిలో 13 హాళ్లు..

మున్సిపాలిటీ పరిధిలోనే కౌం టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక హాళ్లలో టేబుళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సం గారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి తారా కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 38 వార్డులుండగా, 13 హాళ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాలులో 3 చొప్పున టేబుళ్లు వేయనున్నారు. ఒకేసారి అన్ని వార్డుల లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాటు చేశారు. సదాశివపేటలో 8 హాళ్లలో సరిపడా టేబు ళ్లు ఏర్పాటు చేశారు. పెద్ద హాళ్లు ఉన్న అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌లలో అందులోనే అన్ని టేబుళ్లు వేస్తున్నారు. వార్డుకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఓ పక్కన ఏజెంట్లు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు. చేతులు కౌంటింగ్‌ కేంద్రంలోకి పెట్టరాకుండా బారికేడ్లు పెడుతున్నారు. అన్ని తెల్లబ్యాలెట్‌ పేపర్లు కావడంతో మొదట 25 చొప్పున బెం డల్స్‌ కడతారు. ఆ తర్వాత లెక్కిం చి అక్కడికక్కడే ఫలితాలు వెల్లడిస్తారు. కౌంటింగ్‌ కేం ద్రంలోని పోలింగ్‌ అధికారి గెలిచిన వారికి సర్టిఫికెట్లు అందిస్తారు.

27వ తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక

25వ తేదీన ఫలితాలు వెల్లడికానున్న విషయం తెలిసిందే. కాగా, అదే రోజు ఎన్నికల్లో గెలుపొందిన వారికి నోటీసులు కూడా అందిస్తారు. 27న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికకు హాజరుకావాలని ఆ నోటీసులో సూచిస్తారు. అధికారులు సూచించిన 27న చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఆ రోజు ఉదయం 11గంటలకు సభ్యు లు ప్రమాణ స్వీకారం చేసి,  12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. అనంతరం మొదటి సమావేశంలో పాల్గొంటారు. కాగా, ఆయా మున్సిపాలిటీల్లో బ్యా లెట్‌ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ రోజున అధికారుల సమక్షంలో డబ్బాలు బయటకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా, అభ్యర్థులు బాక్సుల్లో దాగిన తమ భవితవ్యంపై అందోళన చెందుతున్నారు. ఓటరు మహాశయులు ఎవరికి పట్టం కట్టారో..? అంటూ ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.logo