ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jan 23, 2020 , 01:31:31

పోలింగ్ కు పోటెత్తారు

 పోలింగ్ కు పోటెత్తారు


సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, అందోలు-జోగిపేట, తెల్లాపూర్, అమీన్ బొల్లారం మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలుకాగా, సాయంత్రం 5 గంటల వరకు కేంద్రంలోపల ఉన్న అందరికీ ఓటింగ్ అవకాశం ఇచ్చారు. కాగా, జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 73.04 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

అత్యధికంగా అందోలు-జోగిపేటలో 84.10 శాతం, అత్యల్పంగా బొల్లారంలో 65.16 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 2,27,251 మంది ఓటర్లు ఉండగా, 1,65,983 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో పురుషులు 85,559 మంది, మహిళలు 80,424 మంది ఉన్నారు. కలెక్టర్ హనుమంతరావు స్వయంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి కలెక్టరేట్ నుంచి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎస్పీ చంద్రశేఖర్ శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఎలాంటి ఘర్షనలకు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అధికార యంత్రాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది. కలెక్టర్ సంగారెడ్డిలో తన ఓటు హక్కు వినియోగించుకోగా ప్రజాప్రతినిధులు తమ మున్సిపాలిటీల పరిధిలో ఓటు వేశారు.

పెరిగిన పోలింగ్ శాతం...

అమీన్ బొల్లారం మినహా మిగతా మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలో 73.04 శాతం పోలింగ్ నమోదు కావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీల్లో 72.29 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇంతకుముందు ఈ స్థాయిలో నమోదు కాకపోవడం గమనార్హం. అందోలు-జోగిపేట, తెల్లాపూర్, సదాశివపేట, నారాయణఖేడ్ అన్నిచోట్లా పోలింగ్ శాతం సంతృప్తి పర్చింది. అయితే పోలింగ్ పెరుగడంతో తమకే ప్రయోజనం ఉంటుందని అధికార టీఆర్ నేతలు సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికలను టీఆర్ నేతలు సవాలుగా తీసుకున్న నేపథ్యంలోనే పోలింగ్ పెరిగిందని చెబుతున్నారు. పురుషులతో పోటీపడి మహిళలు కూడా ఉత్సాహంగా ఓట్లు వేశారు. మొత్తం 85,559 మంది పురుషులు ఓట్లు వేయగా, 80,424 మంది మహిళలు ఓటింగ్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న నేపథ్యంలో అమీన్ ప్రాంతంలో పోలింగ్ తగ్గిందని చెబుతున్నారు. ఇక్కడ వివిధ రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల వారు నివాసముంటున్నారు. ఎక్కువ మంది పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు నివాసముంటారు. అలాంటి వారు ఎక్కువ మంది ఓటింగ్ పాల్గొనలేదని రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్నారు

                         .

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, జేసీ

కలెక్టర్ హనుమంతరావు, జాయింట్ కలెక్టర్ నిఖిల పోలింగ్ సరళిని సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి పరిశీలించారు. వెబ్ ద్వారా ఎవరికి వారు తమ కార్యాలయాల నుంచి ఏడు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ పరిశీలించారు. అక్కడి అధికారులకు ఇక్కడి నుంచే దిశానిర్దేశం చేశారు. ఎస్పీ చంద్రశేర్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేశారు. సమస్యాత్మాక ప్రాంతాలపై ముందు నుంచే ప్రత్యేక నిఘా పెట్టారు. ఘర్షణలను సృష్టించే వారిపై నిఘా పెట్టడంతో పాటు సమస్యాత్మక కేంద్రాల వద్ద బందోబస్తు పెంచారు. ఈక్రమంలోనే ఎక్కడ కూడా చిన్న సమస్యలు, ఘర్షణలు కనిపించలేదు. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది.

25న మున్సిపాలిటీల్లో కౌంటింగ్

ఈ నెల 25న కౌటింగ్ నిర్వహించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేశారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే కౌంటింగ్ నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత పోలిస్ బందోబస్తు మద్య బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. సంగారెడ్డిలో తారా కళాశాలకు తరలించారు. ఇక్కడే కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సదాశివపేటలో జూనియర్ కళాశాల, నారాయణఖేడ్ డిగ్రీ కళాశాల, అందోలు-జోగిపేటలో జూనియర్, డిగ్రీకళాశాల, తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అమీన్ ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల, బొల్లారంలో మోడల్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. బాక్సులు భద్రత పరిచిన నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద పోలీసుల రక్షణ ఏర్పాటు చేశారు. కాగా, ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌటింగ్ మొదలుకానున్నది. వార్డుల ప్రకారం ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేస్తారు. తక్కువ వార్డులు ఉన్న మున్సిపాలిటీల ఫలితాలు మధ్యాహ్నం వరకు తేలిపోనున్నాయి.


అందరి సహకారంతో ప్రశాంతంగా పోలింగ్

జిల్లాలో ఏ చిన్న సమస్య, ఇబ్బందికి తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అధికారులు, సిబ్బంది, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించడంతోనే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలను స్వయంగా పరిశీలించాను. అన్నిచోట్లా ప్రజలు స్వచ్ఛంధంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో కొందరి ఇండ్ల వద్దకు వెళ్లి ఓట్లు వేశారా..? అని నేను అడిగితే ఇదిగో వేశామంటూ సిరా గుర్తు చూపించారు. ప్రజలు, యువతలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో చైతన్యం వచ్చింది. ప్రజలకు కల్పించిన అవగాహన కార్యక్రమాలు కూడా పోలింగ్ శాతం పెరుడానికి దోహదం చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బందిపై కూడా ఎక్కడా చిన్న ఆరోపణలు కూడా రాలేదు. అంటే అందరూ బాధ్యతతో పనిచేశారు. ఎన్నికలు విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు. అధికారులు, సిబ్బందికి సహకరించి తమఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు కృతజ్ఞతలు. జిల్లా వ్యాప్తంగా 73.04 శాతం పోలింగ్ నమోదు కావడం మంచి పరిణామం. భవిష్యత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింత పెంచడానికి కృషి చేస్తాం. 25న కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు చేశాం. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
- హనుమంతరావు, కలెక్టర్logo