శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jan 21, 2020 , 00:34:03

వాయుసేన ర్యాలీ నియామకాలు పూర్తి

వాయుసేన ర్యాలీ నియామకాలు పూర్తి


పుల్కల్‌ : జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో వారం రోజులుగా నిర్వహిస్తున్న వాయుసేన ఉద్యోగ నియామకపు ర్యాలీలో తెలంగాణ నుంచి 196 మంది యువకులు ఎంపికయ్యారు. వాయుసేన 12వ ఉద్యోగ నియామకం ర్యాలీ మండలంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు ర్యాలీలో  రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి యువకులు పాల్గొన్నారు. మొదటి విడుత ఈ నెల 17,18న నిర్వహించిన నియామకపు ర్యాలీలో 14 జిల్లాల నుంచి యువకులు పాల్గొన్నారు. వివిధ రకాల శారీరదారుఢ్య పరీక్షల, రాత పరీక్షలను నిర్వహించిన అనంతరం 92 మంది యువకులను ఎంపికచేశారు. అనంతరం ఈ నెల 19, 20న నిర్వహించిన రెండో విడుత వాయుసేన ర్యాలీలో 19 జిల్లాల యువకులు పాల్గొన్నారు. వీరులో వివిధ రకాల శారీరదారుఢ్య పరీక్షలు, రాత పరీక్షల అనంతరం 104 మందిని ఎంపికచేశారు. సోమవారం రాత్రి ధ్రువపత్రాలను వాయుసేన అధికారులు  అందజేశారు. ఆటో టెక్నీషియన్‌, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పోలీస్‌ ఉద్యోగాలకు నియామకాలు చేపట్టారు.

అభ్యర్థుల ఎంపిక పూర్తి..

జేఎన్‌టీయూలో వాయుసేన ఉద్యోగ నియామకానికి అభ్యర్థుల ఎంపిక ర్యాలీ సోమవారంతో ముగిసింది. నేడు వాయుసేన అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నట్లు వాయుసేన వింగ్‌ కమాండర్‌ తెలిపారు. ర్యాలీలో రెండు విడుతలుగా 196 మంది యువకులను ఎంపిక చేశారు. వాయుసేన రెండు విడుతలుగా నిర్వహించిన ఉద్యోగ ర్యాలీకి తెలంగాణ వ్యాప్తంగా 5 వేల మంది యువకులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో యువకులు రావడంతో సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో సందడి వాతావరణం నెలకొంది. వారం రోజులపాటు వాయుసేన సెలక్షన్‌ కమిటీ బోర్డు కమాండర్‌ శ్రీనివాస్‌, విండ్‌ కమాండర్‌ యెగేష్‌ మహల కళాశాలలోనే ఉండి ఎంపికను పర్యవేక్షించారు. వాయుసేన నియామకానికి రెండు నెలల నుంచి సికింద్రాబాద్‌ వింగ్‌ కమాండర్‌ నరేంద్రకుమార్‌ కర్‌ మౌలిక సౌకర్యాల కల్పనకు జిల్లా అధికారులతో కలిసి కృషి చేశారు.

వాయుసేన సహకరించిన జిల్లా యంత్రాంగం..

జేఎన్‌టీయూలో 12వ వాయుసేన ఉద్యోగ నియామకపు ర్యాలీని జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కలెక్టర్‌ హనుమంతరావు అధ్యక్షతన ఏర్పడిని కమిటీ జేఎన్‌టీయూలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషిచేసి వాయుసేన ర్యాలీ విజయవంతానికి కృషిచేశారు. ఆర్డీవో నగేశ్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, పుల్కల్‌ తాసిల్దార్‌ మురళి, ఎస్‌ఐ పెంటయ్య, జోగిపేట రెవెన్యూ అధికారి షఫీ, జేఎన్‌టీయూ పీడీ సునీల్‌కుమార్‌, మిషన్‌ భగీరథ అధికారులతో కూడిన కమిటీ అనుక్షణం కళాశాలలో ఉండి పనులను పర్యవేక్షించారు. వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉండి అధికారులకు సహాయకులుగా పనిచేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు వేదిక జేఎన్‌టీయూ..

సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికైంది. 165 ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించిన  కళాశాలలో జిల్లా యంత్రాంగం పలు ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకుంటోంది. గతేడాది నిర్వహించిన పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికలకు అందోల్‌ శాసనసభ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను జేఎన్‌టీయూ నుంచి పరిశీలించారు. ఉపాధ్యాయులకు శిక్షణతో పాటు, డీఎస్సీ ద్వారా టీఆర్‌టీ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. 12వ వాయుసేన ఉద్యోగ నియామకపు ర్యాలీని వారం రోజులుగా నిర్వహించి తెలంగాణ నుంచి 196 మంది యువకులను ఎంపిక చేశారు. ఉద్యోగ ర్యాలీకి  జేఎన్‌టీయూ వేదిక కావడం గమనార్హం.