గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jan 21, 2020 , 00:32:35

ఎన్నికలకు సర్వం సిద్ధం

ఎన్నికలకు సర్వం సిద్ధం


అందోలు, నమస్తే తెలంగాణ: జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. ఏడు మున్సిపాలిటీల్లో 82 సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. వాటిలో లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తామన్నారు. సోమవారం అందోలు-జోగిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వాహకులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌం టింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూంను పరిశీలించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. ఈ నెల 22న జిల్లాలోని 7మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనుండగా, సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పీవో, ఏపీవోలు ఈ నెల 21న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని రిసెప్షన్‌ కేంద్రానికి ఉదయం 8గంటల వరకు చేరుకుని పోలింగ్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకుని, కేటాయించిన కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట జడ్పీ సీఈవో రవి, మున్సిపల్‌ కమిషనర్‌ మిర్జా ఫసహాత్‌ అలీబేగ్‌, ఆర్‌వో అంజన్‌కుమార్‌, తాసిల్దార్‌ ప్రభులుతో పాటు తదితరులు ఉన్నారు.

రామచంద్రాపురంలో పోలింగ్‌ కేంద్రం పరిశీలన

రామచంద్రాపురం : మున్సిపల్‌ ఎన్నికలు సజావుగా కొనసాగుతాయని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. సోమవారం తెల్లాపూర్‌ మున్సిపాలిటీలోని పోలింగ్‌ కేంద్రం, కౌంటింగ్‌ హాల్‌ను పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లపై కలెక్టర్‌కు వివరాలు అందజేశారు. కలెక్టర్‌ ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావ్వొ ద్దన్నారు.  లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ఉంటుందని ఎన్నికల కమిషన్‌ ప్రతి అంశాన్ని ప్రత్యక్షంగా వీడియోల ద్వారా చూస్తాయన్నారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలీసులు భద్రత విషయంలో ఎక్కడ లోటుపాట్లు రాకుండా చూస్తారన్నారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే ఉన్నతాధికారులకు  సమాచారం ఇవ్వాలన్నారు. సమస్యాత్మక బూత్‌లను గుర్తించి అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.

ఎన్నికల అబ్జర్వర్‌ పరిశీలన

మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకురాలు వర్షిణి, కలెక్టర్‌ హనుమంతరావుతో కలిసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల రోజు సిబ్బంది, ఎన్నికల అధికారులకు విధుల కేటాయింపు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


logo