గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jan 20, 2020 , 02:56:59

తుది ఘట్టానికి ప్రచార పర్వం

తుది ఘట్టానికి ప్రచార పర్వం
  • - నేటి సాయంత్రం 5గంటల వరకు సమయం
  • - ఏడు మున్సిపాలిటీల్లో కారుదే జోరు
  • - మున్సిపాలిటీల్లో మంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటన
  • - ఎంపీ, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం
  • - టీఆర్‌ఎస్‌ ప్రచారానికి విశేష స్పందన
  • - గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
  • - ప్రచారంలో కనిపించని ప్రతిపక్ష పార్టీలు

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనున్నది. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలుజోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌ సవాల్‌గా తీసుకున్నది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేకంగా సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా స్వయంగా ఎంపీ, ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బరిలో ఉన్న అభ్యర్థులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా మంత్రి హరీశ్‌రావు ఏడు మున్సిపాలిటీల పరిధిలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ముమ్మరం ప్రచారంతో టీఆర్‌ఎస్‌లో రెట్టింపు ఉత్సాహంగా కనిపించగా, కాంగ్రెస్‌, బీజేపీల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. కాగా, ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కలెక్టర్‌ హనుమంతరావు ప్రభుత్వ సెలవు ప్రకటించారు.

మంత్రి సుడిగాలి ప్రచారంతో ఉత్సాహం

జిల్లా మంత్రి హరీశ్‌రావు సుడిగాలి ప్రచారంతో అధికార పార్టీలో రెట్టింపు ఉత్సాహం కొనసాగుతున్నది. జిల్లాలోని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌పాటు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, కాంత్రి కిరణ్‌, మాణిక్‌రావులతోపాటు ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, పార్టీ కార్యదర్శులు బక్కి వెంకటయ్య ఇతర నేతలతో కలిసి హరీశ్‌రావు అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. రోజువారీగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ఇన్‌చార్జిలతో సమీక్షలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించగా, మరో పక్క పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేరుగా ఎంపీ, ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో సమీక్షించారు. ఏ మున్సిపాలిటీల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. వారికి దిశా నిర్దేశం చేశారు. నేరుగా అభ్యర్థులకు ఫోన్లు చేసి కూడా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలకు ముందే సీఎం కేసీఆర్‌ కూడా జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష జరిపారు.  సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి కార్యకర్త వరకు మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు.

ప్రతిపక్ష పార్టీల్లో కనిపించని స్పందన

మున్సిపల్‌ ఎన్నికల విషయంలో జిల్లాలో మాత్రం పెద్దగా స్పందన కనిపించలేదు. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీల్లో బీజేపీ నామ మాత్రంగా పోటీలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారంలో కారు జోరు కొనసాగుతున్నది. నారాయణఖేడ్‌, అందోలు జోగిపేటలో వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లే కొనసాగుతున్నది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో తమ బలం ఉన్నదని గొప్పలకు పోతున్న కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేతలు కూడా ఆయా మున్సిపాలిటీల పరిధిలో ప్రచారానికి దూరంగా ఉంటున్నా రు.  ఏడు మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్‌, బీజేపీ పరిస్థితి దారుణంగానే ఉన్నది. ఒకటి రెండు స్థానాలు మినహా అంతకు మించి  పార్టీలు ఇంకా ఏం ఆశించే పరిస్థితి లేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

ప్రచారం సాయంతం 5గంటల వరకే..

పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగిసే విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 22 తేదీన జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ జరుగనున్నది. దీంతో 20తేదీన సాయంత్రం 5గంటలతో ఆయా మున్సిపాలిటీల పరిధిలో ప్రచారానికి తెర పడనున్నది. కాగా, ఆయా మున్సిపాలిటీల పరిధిలో 20తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు, బార్‌ షాపులు కూడా మూసి ఉండనున్నాయి. ఓట్ల లెక్కించే 25వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 26తేదీన ఉదయం 6గంటల వరకు కూడా వైన్స్‌లు, బార్లు మూసి ఉంటాయి. నేటి సాయంత్రంతో ఆయా మున్సిపాలిటీల పరిధిలో లౌడ్‌స్పీకర్లు మూగబోనున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు మాత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించుకోనున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల అధికారులు సిబ్బందితో ఇంటింటికీ పోల్‌ చిట్టీలు పంపిణీ చేయిస్తున్నారు.

22వ తేదీన మున్సిపాలిటీల్లో ప్రభుత్వం సెలవు

ఈ నెల 22న జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వారి పరిధిలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. ఆ రోజు ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ హనుమంతరావు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలకు సెలవు ఉంటుంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో బ్యాంకు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగంచుకోవడానికి సెలవు ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌కు కలెక్టర్‌ ఆదేశించారు. దుకాణాలు, ఎస్టాబిష్‌మెంట్‌ చట్టం ప్రకారం అన్ని దుకాణాలతో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు జీతంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నామని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. 22తేదీన ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అందుకు ముందు రోజు అంటే 21న, ఓట్ల లెక్కింపు రోజు 25న పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు ఆ రెండు రోజుల్లో సెలవు ఉంటుంది.logo