గురువారం 04 జూన్ 2020
Sangareddy - Jan 18, 2020 , 00:21:23

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
  • - ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు
  • - మొత్తం 162 వార్డుల్లో 4 వార్డులు ఏకగ్రీవం
  • - 158 వార్డుల్లో 358 పోలింగ్‌ కేంద్రాలు
  • - బరిలో 620 మంది అభ్యర్థులు
  • - 1.49 లక్షల మంది ఓటర్లు
  • - ఎన్నికల విధుల్లో పాల్గొననున్న 1754 మంది సిబ్బంది
  • - ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు పోలీసులతో బందోబస్తు
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పోలింగ్‌ జరుగడానికి చేపట్టాల్సిన అన్నిచర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌, ఎన్నికల అధికారి హనుమంతరావు పర్యవేక్షణలో దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నింటిలో కలిపి 162 వార్డులుండగా, బొల్లారంలో 3, సదాశివపేటలో ఒక వార్డు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 158 వార్డులకు పోలింగ్‌ జరుగనున్నది. ఈ వార్డుల్లో మొత్తం 1.49 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 158 వార్డుల్లో మొత్తంలో 620 మంది బరిలో ఉండగా, 1754 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు మున్సిపాలిటీలకు పంపించగా, బ్యాలెట్‌ పత్రాల పరిశీలన కూడా దాదాపుగా పూర్తయ్యిందని కలెక్టర్‌ హనుమంతరావు చెప్పారు. గతంలో మాదిరిగా ఈ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

158 వార్డుల బరిలో 620 మంది

జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో జరుగనున్న ఎన్నికల్లో మొత్తం 158 వార్డుల్లో 620 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో మొత్తం 162 వార్డులుండగా, బొల్లారం మున్సిపాలిటీలో 3 వార్డులు, సదాశివపేట మున్సిపాలిటీలో ఒక వార్డు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 158 వార్డులుండగా, ఇందులో వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 620 మంది పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,49,087 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధికంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా, తక్కువగా నారాయణఖేడ్‌ 15 వార్డులున్నాయి.

ఎన్నికల విధుల్లో 1754 మంది..

మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో మొత్తం 1754 మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో 58 మంది రిటర్నింగ్‌, 48 జోనల్‌ మరో 48 మంది రూట్‌ అధికారులు ఉంటారు. 15 సూక్ష్మ పరిశీలక, 14 వ్యయపరిశీలక, 14 నిబంధనల పరిశీలన బృందాలు, మరో 8 ఇతర బృందాలు పనిచేస్తాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. 70 పోలింగ్‌ స్టేషన్లకు వీడియో చిత్రీకరణ, 64 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఇద్దరు చొప్పున పోలీసులు విధులు నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన విధంగానే ఈ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీలో ఒకటి లేదా రెండు చొప్పున మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అందంగా అలంకరించి మొదటగా వచ్చే ఓటరుకు సిబ్బంది పువ్వులతో స్వాగతం పలుకుతారు.

బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన పూర్తి..

మున్సిపల్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం బ్యాలెట్‌ పేపర్లు, బ్యాక్సులు సిద్ధం చేసి అన్ని మున్సిపాలిటీలకు పంపించారు. పోలింగ్‌ కేంద్రానికి ఒకటి చొప్పున జిల్లాలో 358 పోలింగ్‌ కేంద్రాలుండగా, అంతేమొత్తంలో బ్యాలెట్‌ బాక్సులున్నాయి. మున్సిపాలిటీల వారీగా అవరసమైన మేర 2.60 లక్షల బ్యాలెట్‌ పత్రాలు రెడీ చేశారు. తప్పులు, ఇతర పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. వార్డులకు నెంబరింగ్‌ ఇచ్చారు.

కేంద్రాల వద్ద అన్ని వసతులు..

పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించారు. వికలాంగులు కేంద్రంలోనికి రావడానికి ర్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆటోలు, ట్రైసైకిళ్లు ఇతర వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వారిని కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేయించనున్నారు. వికలాంగులను ఓటు వేయడానికి తీసుకువచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ ఉంటుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు మంచి సౌకర్యాలు కల్పించి రాష్ట్రంలోనే జిల్లా నెంబర్‌-1 స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బెస్ట్‌ కలెక్టర్‌గా హనుమంతరావు అవార్డులను కూడా పొందారు. ఎన్నికల కమిషన్‌ నుంచి కూడా మరో అవార్డును కలెక్టర్‌ పొందారు. మంచి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణలో కలెక్టర్‌ సక్సెస్‌ అవుతూ వస్తున్నారు. ఈ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్ల ముందు అభ్యర్థుల పేర్లు, గుర్తులతో కూడిన బ్యానర్‌ ఏర్పాటు చేస్తారు. మొత్తం 67 ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సిబ్బంది ముందురోజే 21న సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తారు. పోలింగ్‌ ముగిసిన తరువాత అవే బస్సుల్లో తిరిగి వస్తారు.

28 కౌంటింగ్‌ కేంద్రాలు...

జిల్లాలో 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 28 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ఈ కేంద్రాలుంటాయి. అత్యధికంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా, ఇక్కడే ఎక్కువగా 13 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సదాశివపేటలో 26 వార్డులుండగా, 8 కౌంటింగ్‌ కేంద్రాలు, బొల్లారంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అందోలు-జోగిపేట, నారాయణఖేడ్‌, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో ఒక్కో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ 22న జరుగనుండగా 20 సాయంత్రం నుంచి మున్సిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ప్రచారం కూడా ఆరోజు నుంచే ముగియనున్నది.logo