మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jan 18, 2020 , 00:20:23

వాయుసేన నియామక ర్యాలీ ప్రారంభం

 వాయుసేన నియామక ర్యాలీ ప్రారంభం


పుల్కల్‌: జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన వాయుసేన 12వ నియామక మొదటి విడుత ర్యాలీ నిర్వహించారు. వివిధ పరీక్షల అనంతరం 160 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి శనివారం మెంటల్‌ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామని వాయుసేన అధికారులు తెలిపారు. ఉదయం నుంచి జరిగిన వాయుసేన ఉద్యోగ నియామకంలో రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి యువకులు హాజరయ్యారు. ఈ నియామకపు ర్యాలీలో ఆటోటెక్నీషియన్‌, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌ ఉద్యోగాలకు ఎంపిక నిర్వహించారు.

ఉదయం 5 గంటల నుంచే..

వాయుసేన ఉద్యోగ ర్యాలీకి ఒకరోజు ముందే జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు వచ్చిన అభ్యర్థులు వచ్చారు. వాయుసేన సిబ్బంది, జిల్లా అధికారులు ఎంపిక ప్రక్రియను శుక్రవారం ఉదయం 5గంటల నుంచి ప్రారంభించారు. కళాశాల ప్రధానగేట్‌ వద్ద ఆటోటెక్నీషియన్‌ ఉద్యోగానికి 165 సెంటీ మీటర్ల ఎత్తు, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌ ఉద్యోగానికి 175 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అభ్యర్థులను లోనికి పంపించారు. 2400మంది అభ్యర్థులు ఉద్యోగర్యాలీకి రాగ, ఎత్తు కొలతల అనంతరం 600 మందిని అనర్హులుగా అధికారులు ప్రకటించారు. మిగతా వారిని పరుగు పందానికి ఎంపిక చేశారు. కళాశాలలోని రింగ్‌ రోడ్‌పై రన్నింగ్‌ రేసు నిర్వహించారు. ప్రతి విడతకు 300 మంది చొప్పున 6 గ్రూపులను ఎంపిక చేసి రన్నింగ్‌ నిర్వహించారు. యువకులు రన్నింగ్‌ చేసే సమయంలో అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచి సొమ్మసిల్లిన వారిని చికిత్సలు చేశారు. వాయుసేన నిబంధనల ప్రకారం 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకన్లలో చేధించిన 1200 మంది యువకులను తదుపరి పరీక్షలకు ఎంపిక చేశారు.

- రన్నింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిప్స్‌, స్కాట్‌, సిటప్స్‌ పరీక్షలను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ల ధ్రువపత్రాల పరిశీలనకు పంపించారు.
- శారీరక దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆడిటోరియం ఆవరణలో ధ్రువపత్రాలను పరిశీలించారు. అర్హతగల వారిని 375 మందిని రాత పరీక్షకు ఎంపిక చేశారు.

తుది జాబితాలో 160 మంది....

అన్ని రకాల పరీక్షల అనంతరం 375 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. వీరికి మధ్యాహ్నం రాత పరీక్ష నిర్వహించి సాయంత్రం ఫలితాలను ప్రకటించి 160 మందిని ఎంపిక చేశారు. వీరికి శనివారం వివిధ రకాల మెంటల్‌ ఎబిలిటీ పరీక్షలను నిర్వహిస్తారని వాయుసేన అధికారి యోగేశ్‌ మహతో తెలిపారు. శనివారం వివిధ రకాల మెంటల్‌ ఎబిలిటీ పరీక్షల అనంతరం మెడికల్‌ టెస్టుకు తుదిజాబితాను ప్రకటిస్తామని వాయు సేన అధికారులు తెలిపారు. సుల్తాన్‌పూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి 8 మంది విద్యార్థులు వాయుసేన రాత పరీక్షల అనంతరం వెలువడిన జాబితాలో చోటు సంపాదించారు.

ఏర్పాట్లు బాగున్నాయి...

వాయుసేన 12 నియామకపు ర్యాలీకి ఏర్పాట్లు బాగున్నాయని అభ్యర్థులు, వాయుసేన సిబ్బంది తెలిపారు. స్థానిక అదికారులు మౌలిక సౌకర్యాలు చక్కగా  కల్పించారని తెలిపారు. అభ్యర్థులకు ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో వసతి కల్పించగా, వాయుసేన అధికారులకు కళాశాలలోని సివిల్‌ బ్లాక్‌లో కేటాయించారు. వాయుసేన తుది జాబితాకు ఎంపికైన 160 మంది అభ్యర్థులకు కళాశాల బాలుర వసతి గృహంలో వసతిని ఏర్పాటు చేశారు. వీరు శనివారం నిర్వహించి వివిధ రకాల మెంటల్‌ ఎబిలిటీ పరీక్షలకు హాజరవుతారు. వాయుసేన ర్యాలీకి పుల్కల్‌ ఎస్‌ఐ పెంటయ్య శాంతి భద్రతలను, వసతుల కల్పన తాసిల్దార్‌ మురళి, శారీరక దారుఢ్య పరీక్షలకు కళాశాల పీడీ సునీల్‌ కుమార్‌, అత్యవసర వైద్యచికిత్సలకు డాక్టర్‌ నృపేన్‌ చక్రవర్తి పర్యవేక్షించారు.logo