గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jan 16, 2020 , 23:50:04

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
  • -వాయుసేన ర్యాలీకి జేఎన్‌టీయూలో ఏర్పాట్లు పూర్తి
  • -నేడు ఉదయం 5గంటల నుంచి అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు
  • -వసతులను పరిశీలించిన కలెక్టర్‌ హనుమంతరావు
  • -విధుల్లోకి చేరిన జిల్లా యంత్రాంగం
  • -అభ్యర్థులకు ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో బస ఏర్పాటు

పుల్కల్‌ : వాయుసేన 12వ ఉద్యోగ నియామక ర్యాలీకి జేఎన్‌టీయూ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. కళాశాలలో వాయుసేన ర్యాలీ నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం రెండు నెలలుగా పనిచేస్తున్నది.  వాయుసేన ఉద్యోగ నియామకం ర్యాలీకి 33 జిల్లాల యువకులు హాజరు కానున్నారు. ఉద్యోగ నియామక ర్యాలీ రెండు విడుతలుగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణలోని కొన్ని జిల్లాల నుంచి, 19న మిగతా జిల్లాల నుంచి ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తిచేసి అభ్యర్థులకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. గురువారం కలెక్టర్‌ హనుమంతరావు కళాశాలను సందర్శించి పరిశీలించారు. ఎంట్రీ గేట్‌ వద్ద ఎత్తు కొలతలు తీసుకుని వింగ్‌ను, శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించే ట్రాక్‌, రన్నింగ్‌ ట్రాక్‌ను పరిశీలించారు. వాయుసేన సిబ్బందికి కేటాయించిన సివిల్‌ బ్లాకులను పరిశీలించారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసి అగ్నిమాపక కేంద్రం, రెండు వైద్య ఆరోగ్య శిబిరాలను పరిశీలించారు.

మొదటి విడుత జిల్లాలు ఇవే..

1.నల్లగొండ, 2.సూర్యపేట, 3.యాదాద్రిభువనగిరి, 4.నిజామాబాద్‌, 5.కామారెడ్డి, 6.రంగారెడ్డి, 7.మేడ్చల్‌, 8.వికారాబాద్‌, 9.వరంగల్‌ రూరల్‌, 10.వరంగల్‌ అర్బన్‌, 11.జనగామ, 12.జయశంకర్‌ భూపాలపల్లి, 13.మహబూబాబాద్‌, 14.హైదరాబాద్‌

అభ్యర్థులకు ఫంక్షన్‌హాల్‌లో వసతి ఏర్పాటు..

మొదటి విడుత 17తేదీన వాయుసేన ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు సుల్తాన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో వసతులను కల్పించారు. వీరు 16న రాత్రికి జేఎన్‌టీయూకు చేరుకున్నారు. 17న ఉదయం 5 గంటలకు కళాశాల ప్రధాన గేట్‌ వద్ద ఎత్తు కొలతలు చూసి అర్హత ఉన్న యువకులకే కళాశాల లోనికి అనుమతిస్తారు. అప్పటి వరకు వీరికి ఫంక్షన్‌ హాల్‌లో వసతి కల్పించారు. మొదటి విడుత జిల్లాల నుంచి 5 వేల పైగా అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. వీరు వెంట వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులకు కూడా వసతి కల్పించారు. తక్కువ ధరకే భోజనాలు అందించేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు.

కళాశాలకు చేరుకున్న వాయుసేన సిబ్బంది, జిల్లా అధికారులు..

12 వాయుసేన ఉద్యోగ నియామకం ర్యాలీకి అధికారులు, సిబ్బంది, జిల్లా అధికారులు గురువారం ఉదయమే జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌కు చేరుకున్నారు. వాయుసేన సిబ్బందికి సివిల్‌ బ్లాక్‌లను కేటాయించారు. జిల్లాలోని మండల తాసిల్దార్లు, విద్యుత్‌, తాగునీటి సరఫరా అధికారులతో పాటు శాంతి భద్రతలు పరిరక్షించడానికి పోలీసులను ఏర్పాటుచేశారు. సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి అధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

జిల్లా యువకులకు ప్రత్యేక శిక్షణ.. కలెక్టర్‌ హనుమంతరావు

వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీలో జిల్లా యువత పాల్గొని ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు పొందాలని కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. వాయుసేన 12వ ఉద్యోగ నియామక ర్యాలీని మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో నిర్వహిస్తున్నారు. ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్స్‌ఫోర్స్‌ ర్యాలీలో జిల్లాకు చెందిన యువత పాల్గొని పెద్దఎత్తున ఉద్యోగాలు పొందాలని సూచించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఉద్యోగ ర్యాలీకి మొదటి విడుతలో 5వేల మంది, రెండో విడుతలో ఐదు వేల మంది పాల్గొంటారని తెలిపారు. మొదటి విడుత అభ్యర్థులు 17వ తేదీన ఉదయం 5 గంటల వరకు జేఎన్‌టీయూ కళాశాల గేట్‌ వరకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు వేల సంఖ్యలో హాజరువుతున్నందున భారీకేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా నుంచి కొందరు అర్హత గల యువకులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. వీరికి శారీరక పరీక్షలతో పాటు జనరల్‌ నాలెడ్జిపై శిక్షణ కూడా ఇచ్చినట్లు చెప్పారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన యువకులు వాయుసేన ఉద్యోగాలకు ఎంపిక అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట వాయుసేన సికింద్రాబాద్‌ కమాండర్‌ నరేంద్రకుమార్‌ కర్‌, ఆర్డీవో మంచు నగేశ్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఈఈ శేషు, తాసిల్దార్‌ మురళి, ఫిజికల్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.logo