ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jan 16, 2020 , 23:41:28

మిషన్‌ భగీరథ సాక్షిగా..

మిషన్‌ భగీరథ సాక్షిగా..
  • -అధికార టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • -ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి

ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే 4, 5, 6, 8, 14, 15 వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించి ఆయా వార్డుల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో వెనుకబడిన నారాయణఖేడ్‌ను టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి ప్రజల దీవెనలతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి కావాల్సింది రాజకీయాలు కాదని ప్రజల అవసరాలు తీర్చడమే ముఖ్యమన్నారు. గత పాలకుల అసమర్థత కారణంగా  మున్సిపాలిటీగా ఉన్న నారాయణఖేడ్‌ మేజర్‌ పంచాయతీగా మారగా తాను తిరిగి మున్సిపాలిటీగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయాలను ఏర్పాటు చేసి వేగవంతమైన అభివృద్ధికి పునాదులు వేశామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావుల సహకారంతో రూ.15 కోట్లను మంజూరు చేయించి ప్రస్తుతం సీసీ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మంజీరా నుంచి నారాయణఖేడ్‌కు నీటి సరఫరాను పునరుద్ధరించిన విషయాన్ని వివరించారు.  ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉండే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి నారాయణఖేడ్‌ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఆయా వార్డుల అభ్యర్థులు రవీందర్‌నాయక్‌, పరశురామ్‌, సాయిరాం, నూర్‌జహాన్‌ అబేదా బేగం, రుబినా బేగం నజీబ్‌  టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo