శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Jan 14, 2020 , 01:23:17

నేటి నుంచి పాత పంటల జాతర

 నేటి నుంచి పాత పంటల జాతర
  • -సేంద్రియ ఎరువులతో సాగు చేయాలి
  • -జహీరాబాద్‌ అజెండాను ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి అందజేస్తాం
  • -పాత పంటల ఉత్సవాలకు హాజరుకానున్నప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌
  • -డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్‌ పీవీ సతీశ్‌
  • -పస్తాపూర్‌లో ముందస్తు సంక్రాంతి సంబురాలు
జహీరాబాద్‌, నమస్తేతెలంగాణ : జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్‌ పీవీ సతీశ్‌ అన్నారు. సోమవారం జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌ డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవవైవిధ్యం అంటే పుస్తకాలకే పరిమితం కాదని.. శాస్త్రవేత్తలు యూనివర్సిటీలో చర్చించబడే అంశం అన్నారు. జీవవైవిధ్యం కాపాడేందుకు డీడీఎస్‌ సంస్థ 20 ఏండ్లుగా పాత పంటల జాతర నిర్వహిస్తుందన్నారు.

నేడు 20వ పాత పంటల జాతర ప్రారంభం..

20వ పాత పంటల జాతరను నేడు జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రారంభిస్తారని డీడీఎస్‌ డైరెక్టర్‌ పీవీ సతీశ్‌ తెలిపారు. జాతర ప్రారంభోత్సవానికి జాతీయ, గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి, కర్ణాటకలోని ‘భూమి’ వ్యవసాయ విద్యా సంస్థ పత్రిక నిర్వాహకురాలు సీత అనంతశివన్‌, పశ్చిమ ఆఫ్రిక దేశం మాలి నుంచి మహిళా రైతులు, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో), (ఫుడ్‌ యాండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది యూనైటెడ్‌ నేషన్స్‌) ఆఫ్రిక ముఖ్యప్రతినిధి ఆలిమాతాట్రావోర్‌, ఫ్రాన్స్‌ దేశంలో జీవవైవిధ్యం కోసం కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధి ఆన్‌బర్‌సో, డీడీఎస్‌ తరపున జాతీయ అవార్డు తీసుకున్న విత్తనాల సంరక్షకురాలు గంగ్వార్‌ అంజమ్మ హాజరుకానున్నట్టు తెలిపారు.

జహీరాబాద్‌ అజెండాతో ముందుకు..

డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీకి వ్యవసాయం, పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయడంతో ఈక్వేటార్‌ అవార్డు రావడం జరిగిందని డీడీఎస్‌ డైరెక్టర్‌ సతీశ్‌ తెలిపారు. ‘జహీరాబాద్‌ ప్రాంతంలో వ్యవసాయం, సంస్కృతి, వాతావరణ సంక్షోభానికి పరిష్కారం’ అనే అంశంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. జహీరాబాద్‌ అజెండాను 156 మంది సర్పంచులు ఆమోదించడం జరిగిందన్నారు. ఈ అజెండాను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు.

ముందస్తుగా సంక్రాంతి సంబురాలు..

జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌ డీడీఎస్‌ కార్యాలయంలో ముందస్తుగా సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి సందడి చేశారు. డీడీఎస్‌ కార్యాలయ ఆవరణలో మహిళలు సంక్రాంతి ముగ్గులు వేశారు. ఈ సమావేశంలో డీడీఎస్‌ ప్రతినిధులు జైశ్రీ, మేఘ, నర్సమ్మ, కమలతోపాటు ఆఫ్రిక ముఖ్యప్రతినిధి ఆలిమాతాట్రావోర్‌, ఫ్రాన్స్‌ దేశంలో జీవవైవిధ్యం కోసం కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధి ఆన్‌బర్‌సో పాల్గొన్నారు.logo