ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jan 14, 2020 , 01:20:37

వాయుసేన పిలుస్తోంది

వాయుసేన  పిలుస్తోంది
  • -ఉద్యోగ నియామక ర్యాలీకి వేదిక సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ
  • -16 నుంచి 21వరకు వాయుసేన ర్యాలీలు
  • -తెలంగాణ వ్యాప్తంగా జేఎన్‌టీయూలోనే ఎంపిక
  • -రెండు రకాల వాయుసేన ఉద్యోగాల భర్తీ
  • -పదివేల మంది వరకు హాజరు
  • -కలెక్టర్‌ హనుమంతరావు అధ్యక్షతన ఏర్పాట్ల కమిటీ
  • -రెండు వైద్య శిబిరాలు, అగ్ని మాపక వాహనాల ఏర్పాటు







దేశ రక్షణకు వెళ్లాలని ప్రతి యువకుడి రక్తం ఉరకలేస్తుంది. నేనుసైతం సిద్ధమంటూ ఉత్సాహం చూపుతారు. అందులో భాగమైన వాయుసేన కూడా ఎంతో కీలకం. ఈ వైమానిక దళం వేల సంఖ్యలో యువతకు కొలువులనిస్తున్నది.  గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాలిస్తామంటూ పిలుస్తున్నది. ఇందుకు పుల్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ వేదిక కానున్నది. ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఆటో టెక్నీషియన్‌, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈనెల 16 నుంచి 21 వరకు వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నది. కలెక్టర్‌ హనుమంతరావు సహకారంతో సికింద్రాబాద్‌ వాయుసేన విభాగం నియామకాలు జరుపుతున్నది.     - పుల్కల్‌

దేశ రక్షణలో వాయుసేన అత్యంత కీలకం. ఏటా వైమానికి దళం వేల సంఖ్యలో యువతకు కొలువులనిస్తున్నది. ఇందులో భాగంగానే గ్రామీణ యువతకు ప్రస్తుతం వాయుసేనలో కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఇందుకు మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలోని ఇంజినీరింగ్‌ కళాశాల వేదిక కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు జేఎన్‌టీయూలో భారత వాయుసేన నియామక ర్యాలీ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాయుసేనలో ఇంటర్మీడియట్‌ అర్హతతో ఆటో టెక్నీషియన్‌, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నెల 16 నుంచి 21 వరకు వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ ర్యాలీ కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నది. కలెక్టర్‌ హనుమంతరావు సహకారంతో సికింద్రాబాద్‌ వాయుసేన విభాగం నియామకాలు జరుపుతుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే యువతను రెండు విభాగాలు చేసి ఇంటర్యూ  ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
- పుల్కల్‌

రెండు విడుతల్లో పదివేల మంది..

జేఎన్‌టీయూలో నిర్వహించే వాయుసేన నియామక ర్యాలీలో రెండు విడుతల్లో 10 వేల మంది అభ్యర్థుల వరకు హాజరు అవుతారని వాయుసేన అధికారి నరేంద్రకుమార్‌ కర్‌ తెలిపారు. వాయుసేన సిబ్బంది 16వ తేదీన ఉదయమే చేరుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరుకానున్నారు. మొదటి విడుతలో 14 జిల్లాల అభ్యర్థులు, రెండో విడుతలో 19 జిల్లాల అభ్యర్థులు పాల్గొంటారని వాయుసేన అధికారులు తెలిపారు. 

రెండు వైద్య శిబిరాలు

జేఎన్‌టీయూలో నిర్వహించే వాయుసేన ర్యాలీ నేపథ్యంలో కళాశాల ప్రాంగణంలో రెండు వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. ఆరు రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు ఉంటాయి. ఇందుకోసం జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారికి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రాంగణంలో రెండు వైద్య శిబిరాల్లో ప్రథమ చికిత్స, గుండెకు సంబంధించిన వైద్యనిపుణులు, అగ్నిమాపక దళ వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు.

మొదటి విడుతలో...

వాయుసేన నియామక (ర్యాలీ) మొదటి విడుతలో ఈ కింద సూచించిన జిల్లాల అభ్యర్థులు ఈనెల 17 ఉదయం 5 గంటల వరకు జేఎన్‌టీయూ ప్రాంగణానికి చేరుకోవాలి. దూరం నుంచి వచ్చే అభ్యర్థులు 16వ తేదీనే కళాశాలకు చేరుకోవచ్చు. అందుకు వాయుసేన విభాగం, కళాశాల యాజమాన్యాలు అన్ని సౌకర్యాలు కల్పించారు.
1. నల్లగొండ, 2. సూర్యపేట, 3. యాదాద్రి-భువనగిరి, 4. నిజామాబాద్‌, 5. కామారెడ్డి, 6. రంగారెడ్డి, 7. మేడ్చల్‌, 8. వికారాబాద్‌, 9. వరంగల్‌ రూరల్‌, 10. వరంగల్‌ అర్బన్‌, 11. జనగామ, 12. జయశంకర్‌ భూపాలపల్లి, 13. మహబూబాబాద్‌, 14. హైదరాబాద్‌ వారికి 17వ తేదీన ఉదయం 5 గంటలకు నుంచి ముందుగా ఎత్తు కొలతలు చూసి, దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు తర్వాత రోజు రాత పరీక్ష ఉంటుంది.

ముమ్మరంగా ఏర్పాట్లు..

ఈ నెల 16 నుంచి 21వరకు నిర్వహించే వాయుసేన ఉద్యోగాల నియామకానికి సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో ముమ్మరంగా ఏ ర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నియామక ర్యాలీని విజయవంతం చేయడానికి ప్రభు త్వం కమిటీని నియమించింది. కలెక్టర్‌ హనుమంతరావు అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. సంగారెడ్డి ఆర్డీవో నగేశ్‌, పుల్కల్‌ తాసిల్దార్‌ మురళి, జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపాల్‌ బాలూనాయక్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌, రెవెన్యూ అధికారి షఫీ, పుల్కల్‌ ఎస్సై పెంటయ్య తో కూడాని కమిటీని నియమించా రు. ఈ కమిటీ సభ్యులు పక్షం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాయుసేన ఉద్యోగ ర్యాలీకి హాజర య్యే అభ్యర్థులకు కళాశాలలో విద్యుత్‌ సరఫరా, గ్రౌండ్‌ను పరిశుభ్రపర్చుట, భోజ న వసతి, రాత్రి బసచేసేందుకు అభ్యర్థులకు బోర్డింగ్‌ వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

రెండో విడుతలో...

రెండో విడుతలో నియామకానికి కింద తెలిపిన జిల్లాల అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. వీరికి 20వ తేదీన ఉదయం 5 గంటలలోపు జేఎన్‌టీయూ ప్రాంగణానికి రావాల్సింటుంది. దూరం నుంచి వచ్చే అభ్యర్థులు 19న కళాశాలకు చేరుకోవచ్చు. వీరికి కళాశాలలో భోజనం, బోర్డింగ్‌ సదుపాయం కల్పించారు. ముందుగా ఎత్తు కొలతలు తీసుకుని ఎంపికైన అర్హులకు శారీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష వీలును బట్టి అదేరోజు లేద మరుసటి రోజు నిర్వహిస్తారు.
1. ఆదిలాబాద్‌, 2. కొమ్రం భీం ఆసిఫాబాద్‌, 3. మంచిర్యాల, 4. నిర్మల్‌, 5. కరీంనగర్‌, 8. జగిత్యాల, 9. పెద్దపల్లి, 10. రాజన్న సిరిసిల్ల, 11. భద్రాది కొత్తగూడెం, 12. ఖమ్మం, 13. జోగులాంబ గద్వాల, 14. మహబూబ్‌నగర్‌, 15. నాగర్‌కర్నూల్‌, 16. వనపర్తి, 17. మెదక్‌, 18. సంగారెడ్డి, 19. సిద్దిపేట జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని వాయుసేన అధికారి తెలిపారు.

రెండు విభాగాల ఉద్యోగాలు 

జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌లో రెండు విభాగాల ఉద్యోగాలకు నియామకం జరుపనున్నారు.
1. ఆటో టెక్నీషియన్‌
2. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌

అర్హతలు..

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన విద్యా సంస్థల నుంచి ఇంటర్మీడియట్‌ లేదా అందుకు సమానమైన పరీక్షల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఆంగ్లం సబ్జెక్టులో కూడా 50 శాతం మార్కులు కలిగి ఉండాలి.
-ఆటో టెక్నీషియన్‌ కోసం ఎత్తు 165 సెంటీమీటర్లు, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పోలీస్‌కు 175 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్థులను తొలి రౌండ్‌లో ఎంపిక చేస్తారు. ఈ ఎత్తు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత 1.6 లోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి. 10 ఫుషప్స్‌ను, 10 సీటప్స్‌, 20 స్వాట్స్‌ను పూర్తి చేసిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షను సమయాన్ని బట్టి అదేరోజు సాయంత్రం లేదా మరునాడు ఉదయం నిర్వహిస్తారు.     రాత పరీక్ష ఆంగ్లం, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్నెస్‌పై నిర్వహిస్తారు. పరీక్షల్లో ఇంటర్మీడియట్‌, సీబీఎస్‌సీ చదువుల సామర్థ్యం ప్రకారం ప్రశ్నాపత్రాలుంటాయి. అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు..
వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీలో పాల్గొనడానికి వచ్చే అభ్యర్థులు ఈ కింద సూచించిన సర్టిఫికెట్లు, పరీక్ష రాయడానికి ఉపయోగించే వస్తువులను వెంట తెచ్చు కోవాలని వాయుసేన విభాగాధిపతి నరేంద్రకుమార్‌ కర్‌ తెలిపారు. 

1. ఒరిజినల్‌ ఎస్సెస్సీ మెమో
2. ఒరిజినల్‌ ఇంటర్మీడియట్‌ మెమో
3. ఒరిజినల్‌ నెటివిటీ సర్టిఫికెట్‌ (స్థానిక ధ్రువీకరణ పత్రం)
4. ఒరిజినల్‌ ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ పైన సూచించిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్ల సెట్‌తో పాటు నాలుగు జతల జిరాక్స్‌ కాపీ సెట్లను వెంట తెచ్చుకోవాలి.

రాత పరీక్ష కోసం...

1. పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు 7 (కొత్తగా తీసుకున్నవి ఉండాలి)
2. హెచ్‌బీ పెన్సిల్‌
3. రబ్బరు
4. షార్పునర్‌
5. గమ్‌ బాటిల్‌
6. స్టాప్లర్‌
7. పెన్ను (బ్లూ/బ్లాక్‌)

ప్రాంగణాన్ని శుభ్రం చేశాం.

వాయుసేన ఉద్యోగాల నియామకం కోసం కళాశాల ఆవరణ శుభ్రం చేశాం. బారికేడ్లు నిర్మిస్తున్నాం. తాత్కాలిక మరుగు దొడ్లను ఏర్పాటు చేశాం. వాయుసేన ర్యాలీకి ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల సహకారం తీసుకుంటున్నాం.
- పీడీ సునీల్‌కుమార్‌

కళాశాలకు ఖ్యాతి

వాయుసేన ఉద్యోగ నియామకాలు సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో జరుగడం కళాశాలకు గర్వంగా ఉంది. దేశ రక్షణ కోసం జరిగే నియామకాల్లో కళాశాల తరఫున నేనే పాల్గొనడం సంతోషంగా ఉంది. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కళాశాల తరఫున కృషి చేస్తా. యువకుల ఉద్యోగాల కోసం కాలేజీని వినియోగించుకోవడం సంతోషంగా ఉంది.
- ప్రిన్సిపాల్‌ బాలూనాయక్‌



logo