శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jan 14, 2020 , 01:13:13

ప్రచారానికి ఆరు రోజులే

ప్రచారానికి ఆరు రోజులే
  • -పార్టీ బీ-ఫాం రాకముందే అభ్యర్థుల ప్రచారం
  • -ఈ నెల 15 నుంచి అధికారికంగా..
  • -20న ముగియనున్న ప్రచారం
  • -ఈ నెల 22న ఎన్నికలు

అందోల్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీ ఎన్నికలు ఈ నెల 22న పోలింగ్‌ జరుగనుండగా, ప్రచార గడువు మాత్రం అధికారికంగా ఆరు రోజులే ఉండడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొన్నది. వార్డుల వారీగా జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆరు రోజుల సమయమే ఇచ్చింది. జనవరి 8 నుంచి 10 వరకు వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 12న అభ్యంతరాల స్వీకరణ, 13న అభ్యంతరాల డిస్పోజ్‌, 14న నామినేషన్ల ఉపసంహరణ, ఆదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వార్డుల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచే అభ్యర్థులు అధికారికంగా ప్రచారం మొదలుపెడతారు. 22న పోలింగ్‌ ఉండగా, 36 గంటల ముందు అంటే ఈ నెల 20 సాయంత్రమే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు అధికారికంగా నిర్వహించే ప్రచారం ఆరు రోజులకే పరిమితమవుతుంది. అందోలు-జోగిపేట మున్సిపాలిటీలోని 20 వార్డులకు గానూ, 14,134 మంది ఓటర్లు ఉండగా, ఒక్కో వార్డులో 650 నుంచి 750 వరకు ఓటర్లు ఉన్నారు. వీరిని అభ్యర్థులు ఆరు రోజుల వ్యవధిలో కలిసి ఓట్లు అభ్యర్థించాల్సి ఉంది.

పార్టీ బీ-ఫాం రాకముందే ప్రచారం

నామినేషన్ల ఉప సంహరణ తర్వాత చేపట్టాల్సిన ప్రచారాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు తమ వార్డుల్లో ఇంటింటికీ పర్యటిస్తూ, ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కో వార్డు నుంచి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి అభ్యర్థులు ముగ్గురికిపైగా పోటీలో ఉన్నారు. వీరిలో ఆయా పార్టీలు బీ-ఫాంలను అందించకముందే అభ్యర్థులు ఆయా పార్టీల కండువాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. దీంతో అధికారికంగా అభ్యర్థి ఎవరన్నది ప్రజల్లో, నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కొన్ని వార్డుల్లో మాత్రం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడంతో, మరికొన్ని వార్డుల్లో ఎవరినీ ప్రకటించకపోవడంతో ప్రచారం మాత్రం ఎవరికి వారు జోరుగా సాగిస్తున్నారు.

బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు..

మున్సిపల్‌ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్‌ ఓటింగ్‌ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. గుర్తులు ఫైనల్‌ కాగానే, బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌కు సిద్ధంగా ఉండాలంని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కూడా బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచారు.logo