శుక్రవారం 05 జూన్ 2020
Sangareddy - Jan 13, 2020 , 04:12:11

గెలుపు టీఆర్‌ఎస్‌దే..

గెలుపు టీఆర్‌ఎస్‌దే..
  • -జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఖాయం..
  • -సంగారెడ్డి, సదాశివపేటల్లో చురుకైన అభ్యర్థులను బరిలోకి దింపాం..
  • -అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయాలి
  • -బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌
  • -టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ
  • -రామచంద్రాపురంలో బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సదాశివపేట పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రచారంపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో చురుకైన అభ్యర్థులను బరిలోకి దింపామన్నారు. అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా సాగించాలని, ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. అనంతరం రెండు మున్సిపాలిటీల అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అదేవిధంగా రామచంద్రాపురం డివిజన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీల అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు.
- సదాశివపేట/రామచంద్రాపురం

సదాశివపేట: సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సదాశివపే పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 23 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్‌ మాట్లాడుతూ సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో గెలుస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గాన్ని చాలెంజ్‌గా తీసుకొని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల పోటీలో చురుకైన అభ్యర్థులను దించామన్నారు. రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీల్లో గులాబీ రెపరెపలు ఎగురుతాయని తెలిపారు. బీఫారాలు అందుకున్న అభ్యర్థులు నేటి నుంచే ప్రచారం ముమ్మరం చేయాలన్నారు. సదాశివపేట పట్టణంలో మొత్తం సీట్లు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలని సూచించారు.

అభివృద్ధి పనులే గెలిపిస్తాయి...

- ఎమ్మెల్యే మాణిక్‌రావు
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేస్తాయని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపకూ అందుతుందని వాటిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారని తెలిపారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో సదాశివపేటను టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడం ఖాయమన్నారు. 

మాయ మాటలకు మోస పోవద్దు...

- మాజీ ఎమ్మెల్యే
చింతా ప్రభాకర్‌
గతంలో నమ్మిన విధంగా ఇప్పుడు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. పదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలను ప్రలోభాలకు గురిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాటలు నమ్మొద్దన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఆయన సంగారెడ్డి నియోజకవర్గానికి చేసిందేముందని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని ఆశిస్తున్నారని సీఎం కేసీఆర్‌ ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి చిన్న, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


logo