సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jan 13, 2020 , 04:06:38

జోరుగా పల్లె ప్రగతి

 జోరుగా పల్లె ప్రగతిజహీరాబాద్‌, నమస్తేతెలంగాణ: జహీరాబాద్‌ నియోజకర్గంలో రెండు విడుత పల్లెప్రగతి పనులు జోరుగా సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరువ తీసుకున్నారు. మొదటి విడుత పల్లె ప్రగతి ప్రణాళిక విజయవంతమైంది. అదే స్ఫూర్తితో ఈ నెల 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించిన రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంమైంది.  గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులతోపాటు ఇంకుడు గుం తలు, ఇతర అభివృద్ధి పనులు జోరుగా సాగడంతో పల్లెలు కళకళలాడుతున్నాయి.

పల్లె ప్రగతి పనులు

రెండో విడుత పల్లె ప్రగతిలో గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగాయి. మొదటి విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, మెరుగుపడడంతో పాటు చెత్తాచెదారం తొలిగింపు, రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంపకం, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పాడుబడ్డ బావులు పూడ్చివేయడం, ప్లాస్టిక్‌ వాడకం నిషేధం వంటి వాటితో గ్రామాల్లో మార్పులు కనిపించాయి. అదే ఉత్సాహంతో ప్రారంభించిన రెండో విడుత పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగాయి. ఈసారి 30 రోజుల ప్రణాళికను 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నర్సరీల ఏర్పాటు, ఇంకుడు గుంతలు నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు.

జహీరాబాద్‌ డివిజన్‌లో పంచాయతీల పరిస్థితి..
జహీరాబాద్‌ మండలంలో 22, మొగుడంపల్లి 22, న్యాల్‌కల్‌ 37, కోహీర్‌ 24, ఝరాసంగం 33, రాయికోడ్‌ 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 10రోజుల పాటు చేపట్టనున్న పనులను స్థానిక అవసరాలకు అనుగుణంగా గుర్తించి, ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ముందుగా జిల్లాస్థాయిలో మంత్రులు, జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులు, సర్పంచ్‌లు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మొదటి విడుతలో మిగిలిన పనులు, ప్రస్తుతం చేయాల్సిన పనులు పంచాయతీలకు కేటాయించిన, నిధులు, వ్యయం తదితర విషయాలపై చర్చించారు. తర్వాత కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు.

పల్లె ప్రగతిలో చేసే పనులు

గ్రామాల్లో రెండో విడుతలో చేపట్టే కార్యక్రమాలను అధికారులు ముందుగానే సిద్ధం చేశారు. గ్రామాల్లో కూలిపోయిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాలు, ఇంకా ఏమైనా ఉంటే తొలిగించారు. పిచ్చిమొక్కల తొలిగింపు, గుంతల పూడ్చివేత, దోమల మందు పిచికారి మురుగు కాల్వలు శుభ్రం చేయడం, రహదారులపై గుంతలను పూడ్చివేయడం, పాఠశాలలు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. సంతలు, మార్కెట్‌ ప్రాంతాల పరిశుభ్రత, ప్రతి ఇంటిలో చెత్తబుట్టలు ఉండేలా చూశారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించడం వంటి పనులు 10 రోజుల్లో పూర్తి చేశారు.

పల్లె ప్రగతితో అభివృద్ధి పనులు

రెండో విడుత ప్రగతి ప్రణాళిక పనులను గ్రామాల్లో విజయవంతం చేశాం. మొదటి విడుతలో  పెండింగ్‌లో ఉన్న పను లు పూర్తి చేశాం. గతంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికతో సమస్యలు పరిష్కారమయ్యాయి. 10 రోజుల ప్రణాళికలో గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేశాయి. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, యువకుల సహకారంతో ఉత్సాహంగా పని చేసి రెండో విడుత పల్లె ప్రగతిని విజయవంతం చేశాం.
- రాములు,
ఎంపీడీవో జహీరాబాద్‌ 


logo