శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jan 13, 2020 , 02:25:56

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

కల్హేర్‌ : గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రజలకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని మిర్కాన్‌పేట్‌లో డంపింగ్‌ యార్డును ఆయన ప్రారంభించి తడి, పొడి చెత్త బుట్టలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే పల్లెల్లో పారిశుధ్యం సాధ్యమవుతుందన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలు చైతన్యవంతమయ్యారని, గ్రామాల్లో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం లేదన్నారు. అనంతరం డంపింగ్‌ యార్డును త్వరితగతిన పూర్తి చేసిన గ్రామ సర్పంచ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహారెడ్డి, గ్రామ సర్పంచ్‌ నీరుడి భాగ్యలక్ష్మి, మార్డి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జలంధర్‌, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ దుర్గారెడ్డి, రాజు, ఉప సర్పంచ్‌ లచ్చవ్వ, ఎంపీడీవో మంజుల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలే మానవుడికి జీవనాధారం

కంగ్టి : మొక్కలే మానవుడికి జీవనాధారమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రాసోల్‌ గ్రామ శివారులో అటవీ భూమి చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాసోల్‌ గ్రామ శివారులో సుమారు 250 ఎకరాల్లో అటవీ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారని చెప్పారు. ప్రతిఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ ఆంజనేయులు, గ్రామ సర్పంచ్‌ సాయిలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.