ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jan 12, 2020 , 00:54:46

గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

వట్‌పల్లి : గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎవరికి వారు పరిసరాల పరిశుభ్రతకు పాటుపడితే గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా పల్లె ప్రగతి లక్ష్యం నెరవేరుతుందని  కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శనివారం మండంలోని మర్వెల్లి, పల్వట్ల, నాగులపల్లి గ్రామాల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పల్లెప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించారు. ముందుగా మర్వెల్లి గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్‌ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి పనుల వివరాలు తెలుసుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్‌ బస్వరాజ్‌ ప్రతి అభివృద్ధి పనికి అడ్డుతగులుతుండంతో పనులు చేపట్టడం లేదని.. గతంలో ఈ విషయంపై ఉన్నతాధికారులు ఉప సర్పంచ్‌ను హెచ్చరించినా అతడిలో మార్పురాలేదని సర్పంచ్‌ వివరించారు. ప్రతి అభివృద్ధి పనిలో రాజకీయం చేస్తుండటంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని చెప్పారు. దీంతో ఉప సర్పచ్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు సిఫారసు చేశారు. అదేవిధంగా గ్రామంలో పనుల నిర్వహణ సరిగాలేకపోవడంతో రోడ్లపై చెత్త పేరుకుపోయి కనిపించడం, హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోవడంతో గ్రామ కార్యదర్శి మంజ్రేఖర్‌ని సస్పెండ్‌ చేసి సర్పంచ్‌ శోభారాణి, ఉప సర్పంచ్‌ బస్వరాజ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మళ్లీ రెండు రోజుల్లో పనులను పరిశీలిస్తానని, అప్పటికీ మార్పురాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పల్వట్ల గ్రామంలో పర్యటించిన కలెక్టర్‌ నర్సరీని, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. పల్లె ప్రణాళికలో పనులు సరిగా జరగడం లేదని పనుల్లో వేగం పెంచాలని సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.


logo