మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jan 10, 2020 , 10:44:15

అక్షరాస్యత పెంపు కోసమే ఈచ్ వన్-టీచ్ వన్

అక్షరాస్యత పెంపు కోసమే ఈచ్ వన్-టీచ్ వన్

అందోల్, నమస్తేతెలంగాణ : గ్రామాల్లో అక్షరాస్యతను పెంచాలని, అందరికీ విద్యనందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈచ్ వన్ - టీచ్ వన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి.మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి రెండో విడుత కార్యక్రమంలో భాగంగా గురువారం అందోల్ మండల పరిధిలోని తాడ్మన్నూర్, బ్రహ్మణపల్లి, కొడెకల్, నాదులాపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పారిశుధ్య పనులు, శ్మశాన వాటిక నిర్మాణం, డంపింగ్ యార్డులను ఆమె పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. తాడ్మన్నూర్‌లో సర్పంచ్ సంగీతాఅనిల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమానికి హాజరై గ్రామస్తులకు తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా రోగాల బారీన పడకుండా ఉంటారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులేదనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, ఎంపీడీవో సత్యనారాయణ, ఐసీడీఎస్ సీడీపీవో లక్ష్మీబాయి పాల్గొన్నారు.


logo