మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jan 10, 2020 , 10:43:35

పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడాలి

పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడాలి

అందోల్, నమస్తేతెలంగాణ : గ్రామాలన్నీ పచ్చదనం - పరిశుభ్రతతో కళకళలాడాలని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పల్లె ప్రగతి రెండో విడుత కార్యక్రమంలో భాగంగా గురువారం అందోల్ మండల పరిధిలోని చందంపేట, అల్మాయిపేట గ్రామాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో ఆయన పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెలన్నీ పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారని చెప్పారు. పల్లెల్లో జరుగుతున్న ప్రగతి పనుల పర్యవేక్షణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ బృందాలు త్వరలో జిల్లాకు రానున్నట్టు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ బృందాల పర్యటన సమయంలో గ్రామాలు పచ్చదనం-పరిశుభ్రతతో కనబడాలన్నారు. ప్రగతి పనుల్లో మన జిల్లా.. రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగేలా పనులు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. వైకుంఠ ధామాలు, శ్మశానవాటిక పనులు త్వరగా పూర్తి చేయాలని, ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో సమావేశాలు ఏర్పాటు చేసి వందశాతం పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

ప్రజలు ఇండ్లతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో రోడ్ల వెంట చెత్తాచెదారం లేకుండా డంపింగ్ యార్డుకు తరలించాలని, తడి, పొడి చెత్తను సేకరించాలన్నారు. నర్సరీల ఏర్పాటుతోపాటు వాటి చుట్టూ ఫెన్సింగ్ చేసి గేటు, బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈచ్ వన్ - టీచ్ వన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా గ్రామాల్లో వంద శాతం అక్షరాస్యత పెంపొందుతుందన్నారు. చందంపేటలో హరితహరం కింద నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టిన సర్పంచ్ నాగిరెడ్డి, పంచాయతీ కార్యదర్శిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అల్మాయిపేటలో చేపడుతున్న ప్రగతి పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో పురోగతి కనిపించడం లేదని పంచాయతీ కార్యదర్శి పాపయ్యకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వెంటనే పారిశుధ్య పనులను పూర్తి చేయాలని, రోడ్లపై చెత్త వేసిన వారికి జరిమానా వేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీఎం మాణిక్యంతోపాటు ఉన్నారు.


logo