e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News అర్ధశతాబ్దం.. రివ్యూ

అర్ధశతాబ్దం.. రివ్యూ

అర్ధశతాబ్దం.. రివ్యూ

గత కొంతకాలంగా పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిన్న చిత్రాల్లో అర్ధశతాబ్ధం ఒకటి. సామాజిక ఇతివృత్తంతో నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె ఈ సినిమాను తెరకెక్కించారు. కార్తిక్త్న్రం, నవీన్‌చంద్ర, సాయికుమార్‌, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సిరిసిల్లకు చెందిన కృష్ణ(కార్తిక్త్న్రం) చదువు పూర్తిచేసుకొని బతుకుతెరువు కోసం దుబాయ్‌ వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. చిన్ననాటి నుంచి తన గ్రామానికి చెందిన పుష్పను(కృష్ణప్రియ) ప్రేమిస్తాడు. తన ప్రేమను ఆమెకు వ్యక్తంచేయడానికి బయపడుతుంటాడు. ఓ రోజు ధైర్యం చేసి తన మనసులో మాటను పుష్పకు చెప్పాలని అనుకుంటాడు కృష్ణ. తన ప్రేమ విషయంలో అతడిలో మొదలైన చిన్నపాటి అపోహ కారణంగా ఆ ఊరి సర్పంచ్‌ తమ్ముడితో కృష్ణ గొడవపడతాడు.

ఆ గొడవ కాస్త ఊరిలో కులపోరాటానికి దారితీస్తుంది. గ్రామస్తులందరూ రెండు వర్గాలు విడిపోయి ఒకరినొకరు చంపుకుంటుంటారు. ఈ సమస్యల కారణంగా కృష్ణ, పుష్పల ప్రేమకథ ఏ మలుపు తిరిగింది? ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్నా.. పోలీస్‌ వృత్తి కారణంగా కఠిన మనస్కుడిగా మారిపోయిన ఎస్‌ఐ రంజిత్‌, కుల వివక్షను రూపుమాపడానికి ప్రయత్నించే మాజీ నక్సలైట్‌ రామన్న, ప్రజల ఆలోచనలు మారనంతా కాలం ఎన్ని చట్టాలు వచ్చిన ఉపయోగం లేదనే నమ్మే ఓ మంత్రికి ఈ ప్రేమకథతో ఉన్న సంబంధమేమిటన్నది ఈ చిత్ర కథ.


కులవివక్ష, సామాజిక అంతరాలు కథాంశాలుగా సీతాకొకచిలుక, సప్తపది నుంచి ఉప్పెన వరకు తెలుగు చిత్రసీమలో ఎన్నో ప్రేమకథలు తెరకెక్కాయి. వాటికి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు నూతన దర్శకుడు రవీంద్ర. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సమానమేననే సదుద్ధేశంతో అర్ధశతాబ్దం క్రితం రాజ్యాంగం రాసిన నేటికి ఆ లక్ష్యం నెరవేరలేదని.. కుల,మతప్రాంతాల కోసం నేటికి మారణహోమాలు జరుగుతూనే ఉన్నాయి… అధికారదాహం, ఆధిపత్య ధోరణితో సామాన్యుల జీవితాలతో కొందరు చెలగాటమాడుతున్నారనే అంశాలను చర్చిస్తూ దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు.

అతడు ఎంచుకున్న కథాంశం మంచిదే అయినా ఆ పాయింట్‌ను అర్థవంతంగా తెరపై ఆవిష్కరించడంలో మాత్రం విఫలమయ్యారు. సన్నివేశాల ద్వారా కాకుండా సంభాషణలతోనే కథలోని సంఘర్షణను వివరించడం ఆకట్టుకోదు. ప్రేమకథ సాగతీతగా మారిపోయింది. అందంగా మలచలేకపోయారు. ప్రథమార్థం మొత్తం కథానాయకుడిగా చిన్ననాటి జ్ఞాపకాలు, తన ప్రేమను నాయికతో చెప్పడానికి పడే తపన తాలూకు సన్నివేశాలు ఎంతకీ ముందుకు కదలవు. ద్వితీయార్థంలో ఆసలు కథ మొదలైన వాటిని ఉత్కంఠభరితంగా మలచలేకపోయారు. తెరపై చాలా పాత్రలు కనిపిస్తున్నా..అవి ఎందుకున్నాయో, వాటి లక్ష్యమేమిటో అంతుపట్టదు. ైపతాక ఘట్టాల్లో వచ్చే మలుపు బాగుంది.


కుటుంబ బాధ్యతలు, ప్రేమ మధ్య నలిగిపోయే యువకుడిగా కార్తిక్త్న్రం చక్కటి నటనను కనబరిచారు. కృష్ణగా అతడి పాత్ర నవతరం యువకుల్ని ప్రతిబింబిస్తూ సహజంగా సాగింది. పుష్పగా కృష్ణప్రియ సంభాషణల కంటే హావభావాలతోనే ఎక్కువగా ఆకట్టుకుంది. తన ఉద్యోగం, వ్యవస్థపై సదాభిప్రాయం లేని పోలీస్‌ ఆఫీసర్‌గా నవీన్‌చంద్ర ఎమోషనల్‌ పాత్రలో కనిపించారు. సమసమాజం కోసం పాటుపడే మాజీ నక్సలైట్‌గా సాయికుమార్‌ నటనకు ఆస్కారమున్న పాత్రను పోషించారు. ఆమని, అజయ్‌, శుభలేఖసుధాకర్‌ తెరపై కనిపించేది తక్కువే అయినా తమ నటనతో పాత్రలకు ప్రాణంపోశారు.

నౌఫల్‌రాజా సంగీతాన్ని అందించిన పాటలు ఇప్పటికే పెద్ద విజయాన్ని సాధించాయి. అవే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఏ కన్నులు చూడని చిత్రమే, మెరిసెలే పాటల్లోని సాహిత్యంతో పాటు వాటిని చిత్రీకరించిన తీరు బాగుంది. 2003 కాలంలో జరిగే కథ ఇది. నిర్మల్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తెరకెక్కించిన సన్నివేశాలు ఆనాటి కాలంలోని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాయి. తెలంగాణ యాస, భాషలకు ప్రాముఖ్యతనిస్తూ రాసిన సంభాషణలు కొత్త అనుభూతిని పంచుతాయి. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నమైన ప్రయత్నమిది. ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం తడబాటుకు లోనవ్వడంతో యావరేజ్‌ సినిమాగా నిలిచింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్ధశతాబ్దం.. రివ్యూ

ట్రెండింగ్‌

Advertisement