e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Home రివ్యూస్‌ 'నాంది' రివ్యూ..నిజాయితీతో కూడిన ప్రయత్నం

‘నాంది’ రివ్యూ..నిజాయితీతో కూడిన ప్రయత్నం

'నాంది' రివ్యూ..నిజాయితీతో కూడిన ప్రయత్నం

వినోదాత్మక చిత్రాలతో తెలుగు చిత్రసీమలో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారు అల్లరి నరేష్‌.   తన కామెడీ శైలికి భిన్నంగా  చేసిన గమ్యం, శంభో శివశంభో, మహర్షి లాంటి సినిమాలు నరేష్‌లోని  నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించాయి. ఆ పంథాలో వచ్చిన చిత్రమే నాంది. కామెడీ పరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడంతో గత కొన్నేళ్లుగా నరేష్‌కు సరైన విజయం లేదు.  కొత్త తరహా సినిమాతో తిరిగి విజయాల బాట పట్టాలనే  ఆలోచనతో ఆయన నటించిన చిత్రమిది. హరీష్‌శంకర్‌ శిష్యుడు విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. హీరోగా నరేష్‌ కెరీర్‌కు ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడింది?కొత్త దర్శకుడు అతడికి విజయాన్ని అందించాడా?లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళాల్సిందే..

సూర్యప్రకాష్‌(నరేష్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతడు తల్లిదండ్రులతో సంతోషంగా జీవిస్తుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి మీనాక్షిని(వనిత) పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని కలలు కంటుంటాడు.   పేదల తరఫున పోరాడే లాయర్‌ రాజ్‌గోపాల్‌  హత్యకు గురవుతాడు. ఆ హత్యనేరంలో సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. నిర్దోషి అయిన  అతడికి వ్యతిరేకతంగా కిషోర్‌(హరీష్‌ ఉత్తమన్‌) అనే పోలీస్‌ ఆఫీసర్‌ దొంగసాక్ష్యాలు సృష్టించి జైలు పాలుచేస్తాడు. అండర్‌ట్రయల్‌ ఖైదీగా సూర్యప్రకాష్‌ ఐదేళ్లు  జైలులోనే మగ్గుతాడు. తాను నిర్ధోషిగా నిరూపించుకోవడానికి సూర్యప్రకాష్‌ చేసిన ప్రయత్నాలేమిటి? అతడి పోరాటానికి లాయర్‌ ఆద్య(వరలక్ష్మి శరత్‌కుమార్‌) ఎలాంటి సహకారం అందించింది?సూర్యప్రకాష్‌పై  పోలీస్‌ ఆఫీసర్‌ కిషోర్‌ నేరానికి మోపడానికి కారణమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. 

తెలుగు తెరపై జైలు, కోర్టు రూమ్‌ డ్రామా నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటికి భిన్నంగా ఓ సరికొత్త పాయింట్‌ను స్పృశిస్తూ తెరకెక్కిన చిత్రమిది. అక్రమంగా నేరం మోపబడిన ఓ వ్యక్తికి న్యాయం చేయడంలో కోర్టులు ఆలస్యం చేయకూడదనే అంశాన్ని ఎంచుకొని దానికి న్యాయశాస్త్రంలో ఉన్న చాలా మందికి అవగాహన లేని ఓ సెక్షన్‌ జోడిస్తూ సినిమాను రూపొందించారు.  తప్పుడు సాక్ష్యాలతో తనను జైలుకు పంపించిన పోలీస్‌లపై కేసు వేసిన ఓ సామాన్యుడి పోరాటానికి నాటకీయతను, భావోద్వేగాల్ని మేళవిస్తూ దర్శకుడు విజయ్‌ కనకమేడల ఆసక్తికరంగా సినిమాను మలిచారు. నేరం రుజువు కాకుండానే లక్షలాది మంది అమాయకులు ఎలా జైలులో మగ్గిపోతున్నారో, సమాజం దృష్టిలో  నేరస్తులుగా ముద్రపడటంతో వారి కుటుంబం ఎదుర్కొనే అంతఃసంఘర్షణను ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించిన చిత్రమిది. 

కమర్షియల్‌ హంగులు, హీరోయిజానికి తావులేకుండా దర్శకుడు సిద్ధం చేసిన ఇలాంటి కథను నమ్మి సినిమాను అంగీకరించడానికి కథానాయకులకు చాలా ధైర్యం కావాలి.  దర్శకుడు విజయ్‌ కనకమేడల ఊహల నుంచి ఆవిర్భవించిన సూర్యప్రకాష్‌ పాత్రను చేయడానికి ఒప్పుకోవడమే  కాకుండా తన సహజ నటనతో నరేష్‌ ప్రాణంపోశారు. చేయని తప్పుకు  జీవితాన్ని కోల్పోయి నిరంతరం సంఘర్షణకు లోనయ్యే యువకుడిగా అతడి నటన కట్టిపడేస్తుంది. జైలు లోపల మగ్గిపోయే  ఓ ఖైదీ జీవితాన్ని వాస్తవికంగా చూపించడానికి, పాత్రను రక్తికట్టడించడానికి చాలా శ్రమించారు.  నటుడిగా అతడికి గొప్ప పేరును తీసుకొచ్చే చిత్రమవుతుంది. గత సినిమాల ప్రభావం ఏ మాత్రం కనిపించకుండా భావోద్వేగభరిత నటనతో ఆద్యంతం అతడి పాత్ర ఆకట్టుకుంటుంది. నరేష్‌తో పాటు మిగతా పాత్రధారులు తమ నటనతో సినిమాను నిలబెట్టారు. నిర్ధోషులు  శిక్షింపబడకూడదని నమ్మే లాయర్‌ ఆద్యగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ కనిపిస్తుంది. తాను నమ్మిన విలువల కట్టుబడే మహిళగా ఆమె పాత్ర శక్తివంతంగా  సాగుతుంది. చాలా సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన ప్రవీణ్‌, ప్రియదర్శి ఇందులో హీరో స్నేహితులుగా సెంటిమెంట్‌ కలబోసిన పాత్రల్లో కనిపించారు.  హీరో తండ్రిగా దేవిప్రసాద్‌ చక్కటి ఎమోషన్స్‌ను పండించారు. 

చాలా మంది దర్శకులు తొలి సినిమా కోసం ప్రేమ, కమర్షియల్‌ హంగులు కలబోసిన కథల్ని ఎంచుకుంటూ సులభంగా విజయాల్ని అందుకోవాలని ప్రయత్నిస్తారు.  కానీ విజయ్‌ కనకమేడల మాత్రం అరంగేట్రంలోనే ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని దర్శకుడిగా వైవిధ్యతను చాటుకున్నారు. కథాగమనాన్ని ఊహకందని మలుపులతో నడిపించిన విధానం బాగుంది. తాను చెప్పాలనుకున్న పాయింట్‌పై చాలా పరిశోధన చేసి  ఎక్కడా లాజిక్‌లు మిస్‌ కాకుండా  సినిమాలో చూపించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు.  విజయ్‌ కనకమేడల కథను తెరపై  అద్భుతంగా ఆవిష్కృతం చేయడంలో సాంకేతిక నిపుణుల నుంచి చక్కటి సహకారం లభించింది.  సిధ్‌ ఛాయాగ్రహణం, శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం కథానుగుణంగా చక్కగా కుదిరాయి.

వాణిజ్య సూత్రాలకు లోబడకుండా మంచి కథ చెప్పాలనే ఆలోచనతో నిజాయితీగా చిత్రబృందం చేసిన భిన్నమైన ప్రయత్నమిది. వాస్తవికతతో కూడిన సినిమాలు ఎక్కువగా ఇతర భాషల్లోనే రూపొందుతుంటాయని, తెలుగు  రావడం లేదనే విమర్శలకు  సమాధానంగా నిలుస్తుంది. ఇలాంటి సినిమాల విజయాలు మౌత్‌టాక్‌పైనే ఆధారపడి ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల స్పందనపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది. కామెడీ సినిమాల హీరోగా తనపై ఉన్న ఇమేజ్‌ను దూరమయ్యేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న నరేష్‌  కెరీర్‌కు ఈసినిమా కొత్త నాంది అవుతుంది. 

రేటింగ్‌:3.25/5

Advertisement
'నాంది' రివ్యూ..నిజాయితీతో కూడిన ప్రయత్నం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement