గురువారం 25 ఫిబ్రవరి 2021
Realestate - Jan 16, 2021 , 02:57:27

అందంతోనే ఆహ్లాదం

అందంతోనే ఆహ్లాదం

కొవిడ్‌ వ్యాప్తి తర్వాత ప్రజలకు ఇంట్లో గడిపే సమయం ఎక్కువైపోయింది. అనేక సంస్థలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' ఇస్తుండగా, ఆఫీస్‌ పనికూడా ఇంటి నుంచే చేసుకోవాల్సి వస్తున్నది. ఇలా 24 గంటలూ స్వగృహంలోనే బందీ అయిపోతే క్రమంగా మానసిక ఒత్తిడి పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఇంటిని ‘హ్యాపీ హోమ్‌'గా మార్చుకోవాల్సిన అవసరమున్నది. ఇల్లు ఎంత అందంగా ఉంటే.. మనస్సు అంత ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారుతుంది. 

సర్దేయండి బాస్‌!

ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఎవరికైనా హాయిగా అనిపిస్తుంది. అదే ఇంటి నిండా వస్తువులు, పిల్లల స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు చిందరవందరగా కనిపిస్తే ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. ఇంట్లో వస్తువులు కూడా కిక్కిరిసినట్లు ఉంటే చూసేందుకే కాదు.. అక్కడ కాసేపు ఉండేందుకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు చక్కగా సర్దుకోండి. అంతేకాదు, ఇంటిని అందంగా సర్దుకునే మహిళల్లో మానసిక ఒత్తిడిని ప్రేరేపించే ‘కార్టిజోల్‌' అనే హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

మొక్కలు పెంచేద్దాం

పార్కులో కాసేపు అలా తిరిగి వస్తే చాలు.. ఎన్ని టెన్షన్స్‌ ఉన్నా, ఇట్టే ఎగిరిపోతాయి. మన రోజూవారీ జీవితంలో కలిగే ఒత్తిడిని దూరం చేయడంలో పచ్చని మొక్కలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనసుకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతాయి. పెరటి మొక్కలు ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి. అందుకోసమే మీ అభిరుచికి తగిన మొక్కలను పెరట్లో నాటుకోండి. అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లయితే, కుండీల్లో పెంచుకునే మొక్కలను బాల్కనీల్లో పెట్టేయండి. వాటిని చూస్తూ, వాటి మధ్యలో ధ్యానం చేస్తే మానసిక ఒత్తిడి మాయమైపోతుంది. అంతేకాదు.. ఆ మొక్కలు విడుదల చేసే ఆక్సీజన్‌, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.  ఇంకేం కావాలీ?

రంగులతోనూ..

మనిషి మానసిక స్థితిని ప్రభావితం చేయడంలో సంగీతం ముందువరుసలో ఉంటే.. ఆ తరువాతి స్థానం రంగులదేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. రంగులు మనచుట్టూ అందాన్ని, ఆనందాన్ని సృష్టిస్తాయి. ఇంటి గోడలకు, అలంకరణలో మనసుకి నచ్చిన రంగుల్ని ఎంపిక చేసుకుంటే ఆ ఆనందం రెట్టింపవుతుంది. అందుకోసమే ఏదో హడావుడిగా కాకుండా, ఏ రంగు అయితే మనసుకు ప్రశాంతతను, ఇంటికి అందాన్ని తీసుకొస్తుందో ముందే తెలుసుకోండి. దానికి తగ్గట్లు ఇంటికి పెయింట్‌ వేయించండి. లేత రంగులు ఇంట్లో ఉల్లాసపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. గదుల్ని విశాలంగా చూపడంతోపాటు కండ్లకూ హాయినిస్తాయి. 

పనికిరానివి వద్దు

పాత దుస్తులు, పనికిరాని వస్తువులను చాలామంది ఇంట్లోనే అట్టిపెట్టుకుంటారు. స్టోర్‌ రూముల్లో వీటిని దాచడం వల్ల అక్కడి పరిసరాలు అధ్వానంగా తయారవుతాయి. ఇవి ఇంటి అందాన్ని దెబ్బతీయడంతోపాటు బొద్దింకలు, దోమలకు ఆవాసాలుగా మారి, అనేక రోగాలకూ కారణమవుతాయి. అందుకోసమే మీకు అవసరమైన వస్తువులను మాత్రమే ఇంట్లో ఉంచుకోండి. మీరు ఉపయోగించని మంచి దుస్తులు, వస్తువులను నిరుపేదలు, పనివాళ్లకు ఇచ్చేయండి. ఎందుకూ పనికిరానివి అనుకుంటేనే, చెత్తకుప్పలో పడేయండి. దీనివల్ల స్టోర్‌ రూమ్‌, వార్డ్‌రోబ్‌ అందంగా కనిపించడంతోపాటు నిరుపేదలకు దుస్తులు దానం చేశామన్న సంతృప్తి మీలో పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది. 


VIDEOS

logo