బుధవారం 03 మార్చి 2021
Realestate - Feb 20, 2021 , 02:24:20

వంటగది.. వైవిధ్యంగా!

వంటగది.. వైవిధ్యంగా!

  • మగువల మనసుకు నచ్చేలా మాడ్యులర్‌ కిచెన్లు
  • ఆధునిక శైలిలో నిర్మాణాలు

ఒకప్పుడు ఇంట్లో హాల్‌, బెడ్‌రూమ్‌లు మాత్రమే లగ్జరీగా కనిపించేవి. కానీ, కాలం మారింది. గృహస్తుల అభి‘రుచి’ కూడా మారింది. దీంతో ఇంటి నిర్మాణంలో వంటగదికీ ప్రాధాన్యం ఎక్కువైంది. తినే ఆహారంలో ఎలాంటి రుచులు కోరుకుంటున్నారో.. వంటగది విషయంలోనూ అంతే కొత్తదనాన్ని ఆశించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఫలితంగా ఒకప్పటి మామూలు వంటిల్లే.. ఇప్పుడు ‘మాడ్యులర్‌ కిచెన్‌' అవతారం ఎత్తింది. 

ఏ ఇంటికైనా ‘వంటగది’ ప్రత్యేకమైంది. గతంలో ఎంతో మామూలుగా ఉండే ఈ పాకశాలలు, ఇప్పుడు మహిళల మనసుకు నచ్చేలా, వారి అభిరుచులకు అద్దం పట్టేలా రూపు దిద్దుకుంటున్నాయి. ఆధునిక పోకడలను అద్దుకొని ‘మాడ్యులర్‌ కిచెన్స్‌'గా మారిపోతున్నాయి. ఇంట్లో హాల్‌, బెడ్‌రూమ్‌ మాత్రమే కాదు, వంటగది కూడా తమ స్థోమతకు తగట్టుగా ఎంతో విశాలంగా ఉండాలని కోరుకునేవారు ఎక్కువ అవుతున్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా తమకు నచ్చినట్లుగా వంటగదిని నిర్మించుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రూపొందించిన గృహోపకరణాలను వాడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్‌నూ కేటాయిస్తున్నారు. 

తక్కువ స్థలం.. ఎక్కువ సౌకర్యం..

వంటింటి మహారాణులుగా పేరొందిన మహిళలు వంటల్లోనే కాదు, కిచెన్‌లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. ఇంటి ఇంటీరియర్‌కు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో, కిచెన్‌ ఇంటీరియర్స్‌కూ అంతే ప్రాధాన్యమిస్తున్నారు. వంద అడుగుల వంటగదిలోనే సకల సౌకర్యాలూ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో గదిలోని ఏ ఒక్క వస్తువుకూడా బయటకు కనపడకుండా ఉండాలని అనుకుంటున్నారు. అంత తక్కువ స్థలంలో అన్ని సౌకర్యాలూ కలిగిన కిచెన్‌ కావాలంటే.. కేవలం ‘మాడ్యులర్‌ కిచెన్‌' ద్వారానే సాధ్యమని ఆర్కిటెక్టులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్లలో అగ్గిపెట్టెలా ఇరుకుగా ఉండే కిచెన్‌ కూడా విశాలంగా కనిపించేలా చేయడం ఈ మాడ్యులర్‌ కిచెన్లతోనే సాధ్యమవుతుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరూ వీటి వెంట పడుతున్నారు.

ఎన్నో వెరైటీలు..

డిజైన్ల పరంగా మాడ్యులర్‌ కిచెన్లలో నాలుగు రకాలు ముఖ్యమైనవి. వంటగది వైశాల్యం, ఇంటి యజమానుల అభిరుచి, ఆర్థిక స్థోమతనుబట్టి వీటిలో ఏదో ఒకదాన్ని తమ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. 

రూ.2.5 లక్షల నుంచి..

హైదరాబాద్‌ మహానగరంతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఆధునిక పోకడలు గణనీయంగా పెరిగాయి. స్థానిక బిల్డర్లతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు కూడా గృహ నిర్మాణాలు చేపడుతున్నాయి. గృహస్తులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నాయి. కొందరు గృహ నిర్మాణదారులు మాడ్యులర్‌ కిచెన్‌ను ఎక్కువగా ప్రమోట్‌ చేస్తూ, మహిళల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కో కిచెన్‌ కోసం రూ. 2.5లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మరికొందరైతే తమ ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకుకూడా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని శ్రీమంతులు, తమ ఇండ్లలోని వంటగదుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా వెచ్చిస్తున్నారని గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు యజమానులు చెబుతున్నారు. 

‘ఎల్‌' ఆకారం 

సాధారణంగా కనిపించే వంటగది లే అవుట్లలో ‘ఎల్‌' ఆకారం ఒకటి. ఇది చిన్న ఇండ్లకు ఎంతో అనువుగా ఉంటుంది. అందుబాటులో ఉన్న స్థలంలోనే ఎక్కువ వస్తువులను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అపార్ట్‌మెంట్లలో ఉండేవారు ‘ఎల్‌' ఆకారంలోని మాడ్యులర్‌ కిచెన్స్‌ను ఎక్కువగా నిర్మించుకుంటున్నారు. 

సమాంతర కిచెన్‌

వంట విషయానికి వస్తే, ‘సమాంతర’ వంటగది చాలా అనువైన లేఅవుట్‌. ఇందులో కిచెన్‌ మొత్తం ఒకవైపునే సరళరేఖ మాదిరిగా ఉంటుంది. తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. వంటగది కోసం ఎక్కువ స్థలాన్ని కేటాయించలేని వారికి ఇది మంచి ఆప్షన్‌. 

ఐలండ్‌..

ఇదికూడా పెద్ద కిచెన్‌కు సరిపోయే లే అవుట్‌. మిగతా అన్ని డిజైన్లు గది గోడలకు ఆనుకొని నిర్మిస్తే, దీన్ని మాత్రం కిచెన్‌ మధ్యలో నిర్మిస్తారు. ఇంట్లో వంట చేసేవారు ఎక్కువమంది ఉంటే ఈ డిజైన్‌తో వంటగదిని నిర్మించుకోవచ్చు. ఇంట్లోని మహిళలు కిచెన్‌లోనే కాలక్షేపం చేస్తూ వంట చేసేందుకు ఈ ఐలండ్‌ కిచెన్‌ ఎంతో అనువుగా ఉంటుంది.

‘యు’ ఆకారం

ఇండిపెండెంట్‌ ఇండ్లు, పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలో వంటగది కోసం ఎక్కువ స్థలాన్ని కేటాయించుకునే సౌలభ్యం ఉంటుంది. అలాంటివారికి ‘యు’ ఆకారంలోని లే అవుట్‌ బాగుంటుంది. ఈ కిచెన్‌లో ఒకేసారి ఒకరికన్నా ఎక్కువమంది వంటచేసే వీలుంటుంది. భారీస్థాయిలో నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.


VIDEOS

logo