రాతి ఇసుకే మేలు!

ఇల్లు కట్టాలన్నా, ప్రాజెక్టు ప్రారంభించాలన్నా ఇసుక కావాలి. కట్టడం ఏదైనా.. నిర్మాణం ఎలాంటిదైనా ఇసుక ఉండి తీరాల్సిందే. కానీ.. చూస్తున్నాం కదా? పల్లెల్లో కూడా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ఇన్ని కట్టడాలకు ఇసుక ఎక్కడ సరిపోతుంది? ప్రత్యామ్నాయమేదో కావాలి. అదే రాతి ఇసుక. ఇక వచ్చేది రాతి ఇసుక జమానానే! భవన నిర్మాణ రంగం అవసరాలను తీర్చే ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక దూసుకొస్తున్నది. నాణ్యతలో రాతి ఇసుక మన్నికైంది. తక్కువ ఖర్చు, పర్యావరణహితం కావడంతో ప్రభుత్వాలు, నిర్మాణ సంస్థలు ఇటువైపుగా మొగ్గు చూపుతున్నాయి. నదుల్లో లభ్యమయ్యే ఇసుక ప్రకృతి సంపదే అయినా.. అవసరాలకు సరిపడా అందుబాటులో ఉండటం లేదు. పైగా రవాణా ఖర్చుకూడా తడిసి మోపెడవడంతో ధర పెరిగిపోతున్నది. దీంతో ఇసుక ఖర్చు భవన నిర్మాణ యజమానులకు భారంగా మారుతున్నది. నీటి ప్రవాహం కారణంగా ఇసుక లభ్యత తగ్గుతున్నది. అందుకే రాతి ఇసుకను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు భవన నిర్మాణదారులు.
ఏడాది పొడవునా..
రాతి ఇసుక నాణ్యమైందేనా? దానితో ఇల్లు కట్టుకోవచ్చా? లాంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అయితే, వీటిలో ఎలాంటి అపోహలు వద్దని అంటున్నారు నిపుణులు. రాతి ఇసుకలో వేరే ఇతర పదార్థాలేవీ కలుపనంత వరకు దానిని నిరభ్యంతరంగా వాడవచ్చని పలు అధ్యయన సంస్థలు కూడా సూచిస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే.. కాలంతో సంబంధం లేకుండా రాతి ఇసుక ఏడాదంతా అందుబాటులో ఉంటుంది. రాతి ఇసుక విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సాంకేతికంగాకూడా రుజువైంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు పరీక్షలు భవన నిర్మాణానికి రాతి ఇసుక వాడుకోవచ్చని ధ్రువీకరించాయి కూడా. అంతెందుకు ఎల్అండ్టీ లాంటి అంతర్జాతీయ సంస్థలు సైతం నిర్మాణాల్లో రాతి ఇసుకను వాడుతుండటం విశేషం.
హైదరాబాద్ చుట్టూ..
రాష్ట్రంలో రెగ్యులర్ ఇసుక అవసరాలకు కృష్ణ, గోదావరి నదులే ప్రధాన ఆధారం. పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, గద్వాల, నిర్మల్ జిల్లాల నుంచి ఇసుకను రాష్ట్ర అవసరాలకు తీసుకురావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్, శివారు ప్రాంతాలకు తరలించడానికి రవాణా ఖర్చు రోజురోజుకీ పెరుగుతున్నది. వర్షాకాలంలో సుదూర ప్రాంతాలనుంచి రవాణా కష్టంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాణదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో రాతి ఇసుకకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇసుక తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో రాతి ఇసుకను తయారు చేసే యూనిట్లు 74 ఉన్నాయి. ఇందులో అత్యధికం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే నిర్మాణ పనుల్లో అధికభాగం హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి అవసరాలకు అనుగుణంగా యూనిట్లను ఏర్పాటు చేశారు. రాతి ఇసుకపై అవగాహన పెరుగుతున్న కొద్దీ దీని వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని చెబుతున్నారు నిర్మాణదారులు. బహుళ అంతస్తుల భవనాలతో పాటు సాధారణ గృహ నిర్మాణంలోనూ దీన్ని వినియోగిస్తున్నారు.
గణనీయ వాడకం
ప్రస్తుతం హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలకు రాతి ఇసుక వాడకం గణనీయంగా పెరిగింది. నది ఇసుక కొరత పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో దీని వాడకం రాష్ట్రంలో అధికమైంది. తెలంగాణకు చెందిన పలు సంస్థలు జాతీయ స్థాయిలో రాతి ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నాయి. సాధారణ ఇసుకతో పోల్చితే దీని ధర తక్కువ. పర్యావరణ అనుకూలమైంది. అందుకే, నిర్మాణ సంస్థలు రాతి ఇసుకను ఎంచుకుంటున్నాయి.
-ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్
తాజావార్తలు
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి