మెట్రోనగరి.. మేలైన స్థిరాస్తి!

తగ్గిస్తే తరగనిది భూమి. ఆ భూమి కేంద్రంగా నడిచేది స్థిరాస్తి వ్యాపారం. కరోనా వల్ల కొంతకాలం ఇది స్తబ్ధ్దుగా ఉన్నమాట వాస్తవమే. కానీ, ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నది. పెట్టుబడి.. రాబడితో రియల్ దూకుడు కనబరుస్తున్నది. కదులుతున్న క్రయవిక్రయాలు.. పెరుగుతున్న రిజిస్ట్రేషన్లతో మరే మెట్రో నగరాల్లోనూ లేని వృద్ధిరేటును సాధిస్తున్నది హైదరాబాద్! గ్రేటర్ చుట్టూ రియల్ రంగం అంతకంతకూ అభివృద్ధి చెందుతున్నది.
ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నె, బెంగళూరు వంటి నగరాలతో పోల్చితే మన దగ్గర జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పెద్దది. ప్రతి ఆస్తీ హాట్ కేక్ లాంటిదే. ఇక్కడ స్థిరాస్తి అమ్మకం దార్లకూ, కొనుగోలుదార్లకూ అనుకూలంగా ఉంటుంది. అందుకే అంతర్జాతీయ సంస్థలూ పెట్టుబడులు పెట్టేందుకు లైన్లు కడుతున్నాయి.
మౌలిక వసతులు
రియల్ వ్యాపారానికి ప్రధాన వెసులుబాటు మౌలిక వసతులు. ఔటర్ రింగురోడ్డు సంగతే చూసుకుందాం. ఇప్పటికే చాలా విస్తరించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నలువైపులా 60-70 కిలోమీటర్ల వరకు భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. నగరం నుంచి నలువైపులా వెళుతున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పొడవునా పారిశ్రామిక వాడలు ప్రత్యేకంగా ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఔటర్ అవతల 30-40 కి.మీ వరకు భారీ పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. ఫార్మాసిటీ, చందనవెళ్లి పారిశ్రామిక వాడ వీటి కిందికే వస్తాయి. అదేవిధంగా కొత్తూరు మండల పరిధిలో సిద్ధాపూర్ వద్ద సుమారు 300 ఎకరాల్లో పారిశ్రామిక వాడ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. పరిశ్రమలతో పాటు ఐటీరంగంలోనూ పెట్టుబడులు వస్తున్నాయి. మేలైన మౌలిక వసతులు ఉండటం వల్లనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను కొవిడ్ ఏం చేయలేకపోయిందని అంటున్నాయి అధ్యయన సంస్థలు.
నివాస ప్రాంతాలకూ డిమాండ్
కోర్ సిటీలో ఖాళీ స్థలాలు అందుబాటులో లేకపోవడంతో, కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు శివారు ప్రాంతాల్లో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో తమ బడ్జెట్లోనే కొత్త ఇండ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోర్ సిటీలో గజం ధర రూ.80వేల నుంచి లక్షపైన ఉంటే.. శివారు మున్సిపాలిటీలు, ఔటర్ లోపల మాత్రం రూ.25 నుంచి 35 వేలకే గజం చొప్పున భూములు అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు ఓఆర్ఆర్, మరోవైపు అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలే కావడంతో నగర వాసులు ఇక్కడ ఇంటి స్థలాలను, ఇండ్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండ్లులేనివారు తమ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు అపార్టుమెంట్లు, కొంత మేర బడ్జెట్ ఉన్నవారు శివారు ప్రాంతాల్లో వ్యక్తిగత ఇండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. అటు వ్యాపార సంస్థలపరంగా బహుళ అంతస్తులు, ఇటు నివాస ప్రాంతాల్లోనూ వ్యక్తిగత గృహాలు, మరోవైపు నగరం చుట్టు పక్కలే భారీ పారిశ్రామిక వాడల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇతర మెట్రో నగరాలకు దీటుగా జరుగుతున్నాయనేది నిపుణుల విశ్లేషణ.
ప్రభుత్వ విధానాలు భేష్
రియల్ ఎస్టేట్ రంగంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల త్రైమాసిక, వార్షిక నివేదికలు కూడా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి రేటు ఎంతో ఆశాజనంగా ఉన్నదని విశ్లేషిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనా సమయంలోనూ వేల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి రావడమే. అవన్నీ హైదరాబాద్ చుట్టూనే ఏర్పాటు కావడంతో రియల్ ఎస్టేట్ రంగం జోరు పెరగడానికి కారణమైందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికంతటికి కారణం హైదరాబాద్, తెలంగాణ రాష్ర్టానికి ఉన్న సానుకూలతలేనని చెబుతున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా, అవసరాలకు మించి మంచినీటి సరఫరా వ్యవస్థ, పరిశ్రమలకు అవసరమైన నిపుణులు అందుబాటులో ఉండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతమిస్తున్నాయి, వృద్ధిలో మేటిగా నిలుపుతున్నాయి.. అనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. సామాన్యుల మాట కూడా.
అందరికీ అందుబాటులో
ఇతర రాష్ర్టాల వారు సైతం శివార్లలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 5.25 లక్షల ఐటీ ఉద్యోగుల్లో చాలావరకు శివార్లలోనే సొంతింటిని కట్టుకొని ఉంటున్నారు. భవిష్యత్ పెట్టుబడిగా ఖాళీ స్థలాలనూ కొనుగోలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న రిజిస్ట్రేషన్లే రియల్ ఎస్టేట్ అభివృద్ధికి నిదర్శనమని తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధి జి.వి.రావు అంటున్నారు.
తాజావార్తలు
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!