ఆఫీస్ స్పేస్‌లో భాగ్యనగరం దూకుడు

- సాధారణ స్థాయిని మించి పరుగులు
- 2016-18తో పోలిస్తే 145 శాతం వృద్ధి
- తాజాగా జేఎల్ఎల్ నివేదికలో వెల్లడి
ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది. దేశంలోని మిగతా మెట్రో నగరాలు కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, భాగ్యనగరం మాత్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నది. సాధారణ స్థాయిని మించి పరుగులు పెడుతూ 2016-18తో పోలిస్తే 145 శాతం వృద్ధిని నమోదు చేసింది. తాజాగా, జేఎల్ఎల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే, ‘రియల్' రంగంలో హైదరాబాద్ మరింత వేగం పుంజుకున్నది. కొవిడ్ నేపథ్యంలో అనేక సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానం తీసుకురాగా, మెట్రో నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ తగ్గిపోయింది. రియల్ రంగం కూడా భారీ కుదుపునకు లోనైంది. ఈ నేపథ్యంలో 2020 చివరి రెండు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా మార్కెట్ కోలుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మిగతా నగరాలన్నీ ఇప్పుడిప్పుడే నిలకడను సాధిస్తుండగా, హైదరాబాద్ మాత్రం దూకుడును ప్రదర్శిస్తున్నది. మునుపటి సాధారణ స్థాయిని దాటి మరీ వృద్ధిని నమోదు చేసింది. జేఎల్ఎల్-2020 తాజా నివేదికలో ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నో వెల్లడయ్యాయి. రియల్ రంగంతోపాటు ఆఫీస్ మార్కెట్లో భాగ్యనగరం మునుపటికంటే 145 శాతం వృద్ధిని కనబరిచింది. కరోనా తర్వాత అతివేగంగా కోలుకొని, మూడో త్రైమాసికానికంటే నాలుగో త్రైమాసికంలో 84 శాతం వృద్ధిని నమోదు చేసింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌పై జేఎల్ఎల్ తాజాగా ఇచ్చిన నివేదిక-2020లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో నిలిచింది. వాస్తవానికి 2019లోనే ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ వృద్ధి తారస్థాయికి చేరింది. ప్రధానంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్ దూకుడును ప్రదర్శించింది. ఆ ఏడాదిలో 13.24 మిలియన్ చదరపు అడుగులకుగాను, 10.50 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం మేర ఆక్యుపెన్సీ (కార్యాలయాలకు స్వాధీనం) అయింది. కానీ, 2020కి వచ్చేసరికి కరోనా ప్రభావంతో మొదటి మూడు త్రైమాసికాల్లో నామమాత్రపు మనుగడ మాత్రమే కనిపించింది. ఏడాది మొత్తంలో 10.78 మిలియన్ చదరపు గజాల ఆఫీస్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి రాగా, కేవలం 6.47 మిలియన్ చదరపు గజాలు మాత్రమే ఆక్యుపై అయింది. గతంలోని స్పేస్‌ను కలుపుకొంటే 2020లో ఏకంగా 12 మిలియన్ చదరపు గజాల ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది. కరోనా, లాక్డౌన్ దరిమిలా ఆగస్టు వరకు గడ్డు కాలమే ఉండగా, ఆ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలుపెట్టింది. మూడో త్రైమాసికం వచ్చేసరికి 3.33 మిలియన్ చదరపు గజాల ఆఫీస్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి రాగా, ఆక్యుపెన్సీ మాత్రం కేవలం 1.54 మిలియన్ చదరపు గజాలుగానే ఉంది. నాలుగో త్రైమాసికం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)లో మరో 3.72 మిలియన్ చదరపు గజాల ఆఫీస్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఆక్యుపెన్సీ మాత్రం 2.83 మిలియన్ చదరపు గజాలుగా నమోదైంది. దీంతో మూడో త్రైమాసికంతో పోలిస్తే 84 శాతం వృద్ధి సాధించింది.
త్వరగా కోలుకొని..
లాక్డౌన్ అనంతరం దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ మార్కెట్ నెమ్మదిగా తేరుకోగా, హైదరాబాద్ మాత్రం వేగంగా సాధారణ స్థాయికి వచ్చింది. నాలుగో త్రైమాసికంలో 2016-18 కంటే 145 శాతం వృద్ధిని నమోదు చేయడమనేది గొప్ప విషయమని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో దేశంలోని ఇతర ప్రధాన నగరాల పరిస్థితిని చూస్తే, ఏఒక్క నగరంలోనూ సాధారణ పరిస్థితి అంటే 2016-18నాటి స్థితి నమోదు కాలేదు. అన్ని నగరాల్లోనూ 43-81 శాతం వరకు మాత్రమే రికవరీ కనిపించింది. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే 145 శాతం రికవరీ ఉన్నట్లుగా జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది.
ప్రథమ స్థానంలో భాగ్యనగరం
గతేడాది ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో దేశంలోనే హైదరాబాద్ మినహా, అనేక ప్రధాన నగరాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. తొలి, మూడో త్రైమాసికాల్లో మిగిలిన అన్ని ప్రధాన నగరాలకంటే బెంగళూరు ఎక్కువ ఆక్యుపెన్సీ సాధించగా, నాలుగో త్రైమాసికం వచ్చేసరికి 50 శాతం (మూడో త్రైమాసికంతో పోలిస్తే) తక్కువకు పడిపోయింది. ఇక చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణె నగరాల్లో నాలుగు త్రైమాసికల్లోనూ పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. కానీ, హైదరాబాద్ మాత్రం నాలుగో త్రైమాసికంలో దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ సాధించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే ఆక్యుపెన్సీలో 84 శాతం వృద్ధి నమోదైంది. అయితే, ఇందులో సగానికిపైగా ముందుగా జరిగిన ఒప్పందాల మేరకు సాధ్యమైందని జేఎల్ఎల్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రధానంగా ఐటీ రంగంలో అత్యధిక భాగం లీజ్రూపంలో ఆక్యుపెన్సీ పెరిగినట్లుగా పేర్కొన్నది.
తాజావార్తలు
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!
- రాజన్న హుండీ ఆదాయం రూ. 40.56 లక్షలు
- నయనతార పెళ్లిపై క్రేజీ గాసిప్..!
- ఆడపిల్లకు సాదర స్వాగతం.. మురిసిన కుటుంబం
- సిలిండర్ ధర ఎంత పెరిగినా.. మారని రాయితీ!